4017* వ రోజు.....           16-Nov-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

సోమవారం వీధి శ్రమల వంతు 32 మందిది - @4017*

               అందులో ఓం ప్రథమంగా మరీ 4.15 కే వచ్చి మొదలెట్టినది 9 మందైతే - మరో 17 మంది వాళ్ళతో కలిసి, మొత్తం 26 మంది శ్రమ కాని, అంకితభావం కాని, బెజవాడ రోడ్డు పారిశుద్ధ్య ప్రయత్నంగాని మామూలు మాటలకందనివి. మిగిలిన వారు ఆలస్యంగా చేరిన క్రొత్తవారు.

               అట్టి వారిలో కొందరు అర కిలోమీటరు దూరంలోని తరిగోపుల ప్రాంగణాన్ని, శ్మశానాన్ని, చెత్త నుండి సంపద కేంద్రాన్ని, అచ్చటి ప్రజోపయుక్తములైన వీడుకోలు వాహనములు, దహనవాటికలు, కర్మకాండల సౌకర్యములు, స్నానవాటికల వంటి నిర్మాణ కౌశలమునూ, వందలాది నీడ చెట్లు - పూల మొక్కల పెంపకమునూ తనివి తీర చూసి వచ్చారట!

               కొందరు కార్యకర్తలు రోడ్డును ఊడ్చిరి గాని, మరికొందరు రోడ్డు తూర్పు ప్రక్క గుంటలు పూడ్చారు గాని, డిప్పలతో వ్యర్ధాలను చెత్తబండిలోనికి చేర్చారు గాని, నలుగురు గడ్డి చెక్కారు గాని, ఇంకా ఏం చేస్తే వీధి సౌందర్యం ఇనుమడిస్తుందా అని చర్చించారు గాని,

               ఈ వేకువ సందడీ, పనుల మ్రోతా, 4 చెట్ల కొమ్మల్ని మరరంపంతో ఖండనా, మళ్లీ సదరు శాఖల్ని సైజులుగాను, వాహన రాకపోకలకు ఇబ్బంది లేనట్లు పడమటి అంచున, పేర్చుటా మున్నగునవి చేసిన ఆరేడుగురు కార్యకర్తల కష్టమే ఎక్కువ మందిని చూపు త్రిప్పుకోలేనంతగా ఆకట్టుకొన్నది!

               ఎలాగైతే నేం ఎవరి చెమటలు ఎంతగా కారితే నేం - ఎందరి బట్టలు దుమ్ము కొట్టుకుపోతేనేం – ఒకరిద్దరి చేతులు ముళ్ళు గీరుకుపోతే మాత్రమేం గాని –

               మొత్తానికి - 6.10 కి చూద్దును గదా - ఆ 100 గజాల వీధి కాస్త క్రొత్తగా, శుభ్రంగా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తురహితంగా, చెత్తా చెదారహీనంగా కనిపించింది గదా! నేటి 30 మందికి పైగా కార్యకర్తల సమష్టి సామాజిక కర్తవ్య పరిపూర్తిగా మారిందా లేదా?

               స్వచ్ఛ – సుందర గ్రామ కార్యకర్తలంటే - వేరే లోకం నుండి వచ్చి, ఎందుకు 5 లక్షల పని గంటలు శ్రమించారో తెలియని బ్రహ్మ పదార్థాలుగా కాక – మన ఊళ్ళో - మన మధ్యనే ఉండే వ్యక్తులనీ, కాకపోతే కాస్త సామాజిక చైతన్యవంతులనీ, వాళ్లననుసరిస్తే ఎవరికే నష్టమూ ఉండక గ్రామానికి మేలనీ గ్రామస్తులు గ్రహిస్తున్నారని....

               నేటి సభలో

1) DRK డాక్టరు గారి,

2) విశ్రాంతోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు గారి,

3) విశ్రాంతోపాధ్యాయిని రూపవాణి గారి అభిప్రాయమని తెలిసిందిగదా!

4) ఝాన్సీ టీచర్ గారి 500/- విరాళం కాఫీ ఖర్చులకు అందినది గదా!

               రేపటి వేకువ వీధి పనులు ఈ బెజవాడ రోడ్డులోని బాలాజి అపార్ట్మెంట్స్ ప్రక్కన మొదలగుతాయని కూడ తెలిసింది గదా!

               పసుపులేటి ధనలక్ష్మి గారి ఇద్దరు మనుమళ్లు-ఋత్విక్, ఋషిక్ లు వారి పుట్టినరోజు సందర్భంగా స్వచ్చోద్యమ ఖర్చులకు 3,000/- విరాళంగా అందించారు. వీరిద్దరికీ కార్యకర్తలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు.  

               వాస్తవాన్ని గుర్తిద్దాం

పసిపాపల పాలకొరకు ప్లాస్టిక్ వాడేస్తున్నాం

పశువులకూ, శిసువులకూ ప్లాస్టిక్ తినిపిస్తున్నాం

భూమిలో కరగని వాటిని భూమికి అర్పిస్తున్నాం.

ఇప్పుడైన కాస్తయినా ప్రమాదాన్ని గుర్తిద్దాం!

- ఒక స్వచ్ఛ కార్యకర్త

    16.11.2026