4018* వ రోజు.....           17-Nov-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

నిన్న 32 , నేడు (మంగళ -17 -11 -26 ) 30 మందితో ... @4018*

               అదొక శ్రమ జీవన పాఠం- నాలుగు వేల రోజుల, 5 లక్షల పని గంటల తరువాత కూడా నడుస్తూనే ఉన్నది. పని స్థలమూ అదే బెజవాడ రోడ్డు, పని సమయము కూడ ఇంచుమించు సోమవారము వలెనే –

4:20 – 6:10!

               నేటి శ్రమదానంలో ఈ తెలవారుజామున నాకు 4 పద్ధతులు కనిపించాయి:

               1 ) జగనన్న కాలనీ ప్రక్కన మెయిన్ రోడ్డు పనులు,

               2 ) ముగ్గురు నలుగురి 3 -4  వృక్ష శాఖా  ఖండన మండనములు,

               3) జుగుప్సాకరమైన మురుగు కాల్వ పనులు,

              4) ఇతరములు

               మొదటిది కోడూరు వారి నాయకత్వాన- జగనన్న  కాలనీ – తొలి  అడ్డరోడ్డు ప్రవేశం వద్ద లోతును పూడ్చే పని, దానికి అవసరమైన మట్టి సమీపంలోనే ఉంటే, త్రవ్వే వాళ్లు త్రవ్వుతుంటే – కొందరు పారలతో చెక్కుతుంటే – ఆ మట్టిలోని ప్లాస్టిక్ లను విడగొట్టి, గడ్డిని ఏరి, 40-50  డిప్పల మట్టితో గుంటలు పూడ్చిన తర్వాత  ఆ రోడ్డు స్వరూపం క్రొత్తగా కనిపిస్తున్నదిప్పుడు!

               2 వ రకం శ్రమ సజ్జా, మెండు, మల్లంపాటి కార్యకర్తల త్రయానిది, ఇది కాస్త రిస్కుతో కూడిన శ్రమే! ఏలాగంటే – ఆ నాలుగూ గద్ద గోరు ముళ్ల పూల మొక్కలు కావడమూ , చిక్కుపడిన కొమ్మలు పెనవేసుకుపోయి, నరికిన కొమ్మలు ఊడి రాకపోవడమూ ! అదీకాక మొక్కలనాను కొని లోతైన డ్రైనూ! ఆ గంటకు పైగా ముళ్లపొదతో పెనుగులాటలో కాళ్లకు, చేతులకు ముళ్లు గీసుకోనకుంటే ఆశ్చర్యమే!

               3 వ యుద్ధం రోడ్డుకు తూర్పున లోతైన – కంపుతో ముక్కులదర గొడుతున్న డ్రైను  కాలుష్యాల పైననే! ఆ సమర వీరులు బృందావన, క్రొత్తగా వచ్చిన యడ్ల, BSNL  & CO వాళ్లు ! ఐతే ఆయుద్ధం సగంలో ఆగింది, రేపటికి వాయిదా పడింది!

               ఇవి కాక కొంత సేపు వీధిని  బాలాజీ అపార్ట్మెంట్ కు చెందిన ముగ్గురు మహిళలూ, ఒక ఆస్పత్రి నర్సూ ఉడ్చారు.

               చివరలో నలుగురు అతిథి కార్యకర్తలు వచ్చారు.

              నిన్నటి నినాదాల బాధ్యత కస్తూరి విజయుడి దైతే, నేడది రాగ భావ యుక్తంగా నెరవేర్చింది నందేటి శ్రీను!

              రేపటి వేకువ బాలాజి అపార్ట్ మెంట్ల ప్రక్కనే ఆగి , బెజవాడ రోడ్డులో ఉత్తరంగా పనులు చేయాలని నిర్ణయించారు! 

               కొంత రక్షిద్దాం!

భూగోళం మొత్తానికి పూచీ పడలేము మనం

చల్లపల్లి వరకైనా సాధిద్దాం సదాశయం

ప్లాస్టిక్  ఫ్లెక్సీలన్నిటి దూరంగా పెట్టుదాం

మన వంతుగ పర్యావరణాన్ని కొంత రక్షిద్దాం!

-ఒక స్వచ్ఛ కార్యకర్త

   17.11.2026