పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
బుధవారం (18.11.26) నాటి కార్యకర్తల సంతృప్తులు! @4019*
అవి ఇవాళ్టికివాళ క్రొత్తగా పుట్టుకొచ్చినవి కావనుకోండి, పన్నెంళ్ల 6 రోజుల నుండి అవి వాళ్ల అనుభవైక వేద్యములే ఐనా - నాకు మాత్రం ఎందుకో గాని ఏరోజుకారోజు నవనవోన్మేషంగా అనిపిస్తుంటువి!
ఈ నాటి సంగతే తీసుకొంటే - సరే ఏదో 28 మందికి వీధి శ్రమతో సంబంధం ఉన్నా నిక్కచ్చిగా కష్టించిన అసలుసిసలు కార్యకర్తలు 22 మందే నండి!
1) మురుగు కాల్వ పనులతోనూ వాళ్ల సరస చతుర సంభాషణలలోని ఐదారుగురి సంతోషాన్ని గమనిస్తూనే ఉన్నాను. అది వాళ్ళ ఇంటి ఎదుట కంపుగొట్టే డ్రైను కాదు - బెజవాడ దారిలోని తూర్పు వైపున ముదురు పాకాన పడిన డ్రైను!
2) చివరలో అంజయ్య, కస్తూరి శ్రీనుల సహకారమున్నా, ఒంటి చేత్తో క్రొత్త శివరామపురం కార్యకర్త ప్రేమానందం డ్రైను అంచున కాలు జారుతున్న చోట ముళ్ల - పూల గద్ద గోరు చెట్టును నరికిన దృశ్యాన్ని చూశాను! దాన్ని మోకులు కట్టి, ట్రాక్టరుకు బిగించి, కస్తూరి వారు ఒడ్డుకు ఈడ్చిన పనినీ బేరీజు వేశాను!
3) జూనియర్ కస్తూరి, గూడూరు కోడూరూ, ఆస్పత్రి నర్సులూ, మరో ఇద్దరూ పారలతో, - రైల్వే పారలతో, గునపాలతో ఎండు డ్రైన్ మట్టిని పెళ్లగించి, ప్లాస్టిక్ + ఇతర చెత్తలు తొలగించి, బాట తూర్పు మార్జిన్ ను ఎందుకంత శుభ్రంగా - చదునుగా - అందంగా రూపొందించాలా అని చాల సేపు ఆలోచించాను!
4) జగనన్న కాలనీ నుండి జగదీశ్ అనే ఒకే ఒక కార్యకర్త తప్ప ఈ వేళ స్థానికులెందుకు పాల్గొనలేదో తెలుసుకోలేకపోయాను!
5) కాటాల సమీపంలో మెండు, సజ్జా, జాస్తి వారలు పూర్తిగా వృక్షాల, పూల మొక్కల సుందరీకరణలో మునిగి, తదేక దీక్షతో పనిచేయడమెందుకో బోధపడలేదు!
6) బృందావన – బండి - BSNL కార్యకర్తలు ఒక ప్రక్క దీక్షగా వీధి పనులు చేస్తూనే ఇతరులకు సూచనలీయడమూ గమనించాను!
అసలీ పాతిక మంది స్వచ్ఛ కర్మవీరుల్ని చూస్తుంటే, పనుల మధ్య వాళ్ల సంభాషణలను వింటుంటే, గంటన్నర తర్వాత నాకనిపించినదేమనగా:
వీళ్లు మామూలు మనుషులు కారనీ,
అది వెక్కిరింతో పొగడ్తో గాని - కొందరు పేర్లు పెట్టినట్లు గ్రామ వీధి పనుల వ్యసనపరులనీ, అదోరకం వెర్రోళ్లనీ,
పన్నెండేళ్లు కాదు - పాతికేళ్ల శ్రమదానానికి సంసిద్ధులనీ......
6.06 కు కొందర్నడిగి నేను విజిలు మ్రోగించినా, 5 గురు మాత్రం 6.12 – తరువాత గాని కాఫీ అనంతర సమావేశానికి రాలేదు!
నేటి సభను ప్రశాంతంగానూ, సావకాశంగానూ పలికిన నినాదాలతో ప్రారంభంచినది కస్తూరి శ్రీనివాసుడు.
రేపటి శ్రమదానం బెజవాడ బాటలోని కాటాల వద్ద ప్రారంభించాలనేది అందరి నిర్ణయమూ!
చెప్పుకొనుట సిగ్గుచేటు!
స్వచ్ఛోద్యమ మన్నా ఈ స్వచ్ఛోద్యమ కారులన్న
ఊరి కొరకు జరిగే ఈ ఉత్సాహోద్వేగములన్నా
కించిత్ శ్రద్దైన లేక ఎంచక్కా ఉండి పోతె
చల్లపల్లి పౌరుల మనిచెప్పుకొనుట సిగ్గుచేటు!
- ఒక స్వచ్ఛ కార్యకర్త
18.11.2026