4020* వ రోజు.....           19-Nov-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

గురువారం (19-11-26) శ్రమ మాత్రం తక్కువదా? @4020*

               అది మరీ 4.17 కే విజయవాడ దారిలోనే కాటాల వద్ద మొదలై, అచ్చటికి ఉత్తర దక్షిణ దిశలలో అమలయింది! కార్యకర్తల బలం నిన్నటికన్నా ఒక్కటి పెరిగి, 29 గా మారిన కారణము నిన్న రాని డాక్టరు గారు ఈ పూట వచ్చి చేరడమే! 6:06 కు విజిలు మ్రోగింది గాని నలుగురు పని మానిన సమయం 6.12 కే! మంచు లేదు గాని చలి మాత్రం పెరిగింది! చాల రోజుల్లాగే ఈ వేకువ కూడ 4 రకాల రహదారి పనులు జరిగాయి. అవి వరుసగా ఇట్లున్నవి.

               బాటకు తూర్పు డ్రైను గట్టుపైన ఒకచోట పంచాయతి వారు కాబోలు గతంలో తోడిన బురద మేటను ఐదుగురు కార్యకర్తలు ఎన్నుకొన్నారు. ఒకరు గునపంతో త్రవ్వుట, ఇద్దరు దానిలోని ప్లాస్టిక్ లను విడగొట్టుట, మిగిలిన ఇద్దరు మట్టిని ట్రాక్టరులోనికి ఎగుమతి చేయుట....

               రెండవ శ్రమదానం రోడ్డుకు తూర్పు ప్రక్కన ఖాళీలోని ఎగుడుదిగుడులను ఒకరు గునపంతో త్రవ్వగా, ఇద్దరు పారలతో చెక్కుతుండగా, ఇంకొక నిపుణుడు చదును చేయుచుండగా, ప్లాస్టిక్ చెత్తల్ని ఏరేవాళ్ళు ఏరగా, జరిగినది!

               కాటాలకు ఉత్తరంగా ఐదారుగురు మాత్రం ఈ సందడి కి దూరంగా చెట్ల క్రమబద్ధీకరణ కోసం చేసిన ప్రయత్నం మూడవది. ఈ కష్టం కూడ తక్కువదేం కాదు, కోస్తున్న కొమ్మలు జారి, లోతైన డ్రైనులో పడుట, వాటిని కూడ దంతెలతో గట్టు మీదికి లాగుట వలన పని నెమ్మదిగా జరిగింది.

               ఇక్కడ మరో విశేషం : ఏనాడో అమర్చిన ట్రీ గార్డులు పాడై, వాటి అవసరం కూడ లేనందున వాటిని ఊడగొట్టి, కాంక్రీటును మలాటుతో పగల గొట్టి, ఇనుమును వేరు చేసి, రాతి ముక్కల్ని గుంటల్లో నింపే పని. నడుములు, గూళ్లు నొప్పి పెట్టే ఈ పనిని పొరుగూరి రైతు కార్యకర్త నిర్వహించగా, నేను కొంత సహకరించాను.

               నాల్గవది మహిళా కార్యకర్తల వీధి ఊడుపు, ఇవి కాక మరో ఇద్దరి మాటలిలా విన్పించాయి!

కస్తూరి శ్రీను : “ఏం అంజయ్య బాబాయ్! గద్ద గోరు ముళ్ల కొమ్మను పరపరా నా చేతి మీదుగా లాగావు, గీరుకుపోయి, నెత్తుటి చారలు చూశావా?

అంజయ్య : నీకేమన్నా ఇలాంటివి కొత్తా? ఒక అరలీటరు నెత్తురు కారినట్లు మాట్లాడతావేం?

               తుది సభలో ఊరి బాగుదల ప్రతిజ్ఞలు చేయించింది నల్లూరి శ్రీను, పనుల్ని సమీక్షించినది Dr.DRK గారు, రేపటి వేకువ కూడ బెజవాడ దారిలోని కాటాల వద్దనే మనం కలవాలట!

               కంఠశోష

ఎప్పుడు ఉండేదేగద- ఎందుకులే కంఠశోష

మషీరసం దండగ గద - మనసంతా నిస్పృహగద!

పన్నెండేళ్లుగ జరిగే స్వచ్ఛ సుందరోద్యమమే

పట్టని గ్రామస్తులకు బధిర శంఖ ధ్వనియే గదా!

- ఒక స్వచ్ఛ కార్యకర్త

   19.11.2026