4021* వ రోజు.....           20-Nov-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

4021* వ శ్రమదానం వేకువ 4.18 కే మొదలు!

               “అసలప్పటికున్న చలి ఏమిటో - ఇళ్ళ నుండి అంతంత దూరంగా శ్మశానం దగ్గరలో 4.30 కు 12 నిముషాల ముందుగా ఆ పరుగులేమిటో - చెత్త దుమ్ము – గబ్బు పనుల కోసం ఈ శుక్రవారం (20-11-26) పూట పోటీలు పడడమెందుకో - ఎక్కడ పని జరుగుతుంటే అక్కడి గ్రామస్తులు పట్టించుకొనరెందుకో అని ప్రతిరోజూ ఆలోచిస్తూంటాను!

               గత 30 రోజుల్లాగే ఈ పూట కూడ బెజవాడ బాటలోని కాటాల ప్రాంతంలోనే 30 మంది కష్టం ఉపయోగపడింది. కొంచెం తక్కువగా 2 గంటల శ్రమ వలన :

- నాలుగు పెద్ద చెట్ల కొమ్మలు దుర్గా ప్రసాదుని మరరంపం కోతకు గురయ్యాయి! అతనితో సమానంగా చిరు చెమటల కార్యకర్త సజ్జా ప్రసాదు.

               అంత బరువు రంపం మోస్తూ, కాలు డ్రైను లోకి స్లిప్పవుతున్న స్థితిలో అన్ని కొమ్మల్ని కోసి, అది పైన పడబోతే తప్పుకొంటున్న ఆ ఉభయ ప్రసాదులకు జోహార్లు!

               వాళ్ల దగ్గర్లో మెండు శ్రీను, ప్రేమానందు అనే 2 మొండి ఘటాలున్నాయి, పడిన కొమ్మల్ని చెలిగి, రోడ్డు దాటించడం వీళ్ళ ప్రధాన బాధ్యతన్న మాట!

               వాళ్ళు లాగి పడేసిన కొమ్మల్ని  పొందికగా, రోడ్డు వాహనాలకు ఇబ్బంది లేనట్లు అందంగా పేర్చడం కోట పద్మవతి గారి వంతు! ఫొటోల్లో కనిపిస్తే చూడిండి –

ఆమెపేర్చిన ఎత్తైన గుట్ట ఎంత పెద్దదో!

- వీళ్ళ పనికి దూరంగా జరిగే మట్టి పని బాగా కష్టమే గాని, అంజయ్య బృందావన, పసుపులేటి, తూములూరి, కస్తూరి వంటి వాళ్లు చెతుర్లాడుకొంటూ, అంతటి కష్టాన్నీ ఇష్టంగా మార్చుకొని, అరగంటలో అంత పెద్ద గుట్టనీ ట్రాక్టర్ లోకి ఎత్తారు!

- రోడ్డుకు తూర్పుగా 10 - 12 అడుగుల మేర శుభ్రంగా - చదునుగా - ఒక మంచి అద్దం కనిపిస్తుంది గదా – దాన్ని ½  గంట శ్రమతో తయారీదారులెవరనుకొంటిరి?

               ఐదారు రోజులు శ్రమదానానికి దూరమై, బాకీ పడిన అంబటీ, చెక్ పోస్టు మాజీ ఉద్యోగీ, బత్తుల వెంకటేశ్వరావులే గదా!

               ఇటీవలనే స్వచ్ఛ కార్యకర్తగా మారుతున్న వృద్ద సుధాకర్, 15 రోజులు తప్పిపోయిన శేఖర్, ఇంకా జాస్తి వంటి వారితో నేటి శ్రమదానం నిండుగా కనిపించింది!

               అందమైన టవల్స్ ను ఆలస్యంగా తెచ్చి, కార్యకర్తలకు పంచింది S.R.Y.S.P. కళాశాల మాజీ ప్రిన్సిపల్ T. సాంబశివరావు గారు, వాటిని పంపినది శ్రీ తొట్టెంపూడి మల్లికార్జున ప్రసాద్ - అమృత దంపతులు, సందర్భం వారి కుమార్తె వివాహం!

               నేటి నినాదాలు పలికిన సభా ప్రారంభకులు కూడ తగిరిశ వారే!

               ఈ 2 గంటల శ్రమ వేడుకను మెచ్చినవారు దాసరి రామకృష్ణ ప్రసాదు!

               మన రేపటి వీధి సుందరీకరణ కూడ బెజవాడ మార్గంలోని కాటాల ప్రాంతమే!

               ఏనాడో స్వర్గంగా మారును

సజావుగా సాగుతున్న స్వచ్ఛ సుందరోద్యమమున

నాలుగు లక్షలపైగా పనిగంటల శ్రమమందున

రోజుకు రెండొందలైన ప్రజలు పాల్గొని ఉంటే

చల్లపల్లి ఏనాడో స్వర్గంగా మారును గద!

- ఒక స్వచ్ఛ కార్యకర్త

   20.11.2026