4022* వ రోజు.....           21-Nov-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?

అదే సమయం – అదే చోటు – తారీఖు (21-11-26) మారిందంతే! @4022*

               కార్యకర్తల సంఖ్య కూడ పెరిగి, 44 గా నమోదయింది. కారణం వారాంతం కాబోలు. హిమపాతం సైతం పెరిగింది, మంచు వలన కార్యకర్తల తలదీపాల వెలుగు సరిపోలేదు - ముఖ్యంగా మురుగు కాల్వ పని చేస్తున్న వాళ్లకు. పనులలో సైతం పెద్దగా మార్పు కనిపించలేదు!

               శ్రమదానం నిన్నా - మొన్నటి కన్నా కాస్త వెనకడుగేసింది. అంటే - కాటాలకు ఉత్తరపు దిశలో ఏ పనీ జరిగినట్లు నా దృష్టికి రాలేదు.

               వీధి సుందరీకరణలో భాగంగా బాలాజి అపార్ట్మెంట్ ముందున్న 3 వృక్షాల కొమ్మల సర్దుబాటు ఎక్కువ సేపు జరిగి, ఎక్కువ మంది - సుమారు 16 మందికి చేతి నిండా పని దొరికింది – “చెట్లు సమ ఎత్తులో ఉండాలి, కరెంటు తీగల్లోకి దూరరాదు, చూసేవాళ్లకవి బుట్ట బొమ్మల్లాగా అందంగా కనిపించాలి” అనే లక్ష్యం నెరవేర్చడానికి ఆకుల - సజ్జా కార్యకర్తల కష్టం అక్కరకొచ్చింది. ఆ భవన సముదాయం నుండి నిన్నా - ఈ వేళ పాల్గొంటున్న సింగిల్ కార్యకర్త సుధాకర్ గారికి సంతోషదాయకమయింది!

               2 వ ఘనకార్యం ఇక్కడికి ఉత్తరంగా, ఇళ్ళు కాక - పొలాలున్న చోట జరిగినదే! అదేంటో - ఆ నాయుడు మోహనరావు రావడంరావడంతోనే డ్రైను భీభత్సాల మీదికి దండెత్తుతాడు! గడ కత్తీ, దంతెలతో ఆ ప్లాస్టిక్ పాపాలను ఒడ్డుకు గుంజడమూ, తక్కిన వాళ్లు వాటిని ట్రక్కులోకి చేర్చడమూ! ఆ మురుగు కంపులో ఆ నలుగురైదుగురు ఎలా గంటసేపు పనిచేశారో గాని – నేను ½ గంట కూడ ఉండలేకపోయాను!

               మరొక పని సందడి వీధి మార్జిన్ ను చదును చేయుట, ఏ నిరాశ్రయడో అక్కడ చక్కగా పడుకోగలిగినంతగా మార్చివేయుట! అంబటి, కోడూరు, బత్తుల తదితర కార్యకర్తల పని అది!

               తరవాత పేర్కొనదగినది మట్టి త్రవ్వకం, ఎగుమతి పని! దీనిలో బాగా ఆరితేరిన పసుపులేటి, కస్తూరి విజయ శ్రీనివాసులు, నందేటి, గంధం, తూములూరి వంటి వాళ్లు సరే - ఆస్పత్రి పనుల లక్ష్మీ సెల్వం, ప్రశాంతి పలుగు పని చూశారా?

               6.20 కి వచ్చిన ఎన్నికల పంచాయతి అభ్యర్థి సజ్జా చలపతిరావు గారు పంచాయతి ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా ఉంటుందో, చల్లపల్లి గ్రామాభివృద్ది పట్ల తన అవగాహన ఎట్టిదో వివరించారు.

               అక్కడి 40 పైగా ఉన్న వారికి వేరుశనగ పప్పు చెక్కల్ని ప్రాతూరి శాస్త్రి గారు పంచారు.

               వైద్య శిబిర కారణం వల్ల రేపటి మన శ్రమదానం కాటాల వద్ద కాక విజయా కాన్వెంట్ – ప్రభుత్వాసుపత్రుల వీధికి మారింది!

      రోకలి తల జుట్టు టంటె ఇదే కదా?

చెవిలో ఇళ్లను కట్టీ చెప్పగ చెప్పగ చివరికి

బహిరంగ విసర్జనలను బహిష్కరించారు - సరే

పెంచిన చెట్లను, పూలను త్రుంచేస్తుంటారెందుకు?

పిచ్చి కుదిరి రోకలి తల జుట్టు టంటె ఇదే కదా?

- ఒక స్వచ్ఛ కార్యకర్త

   21.11.2026