4023* వ రోజు.....           22-Nov-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?

ఆదివారం(22-11-26) నాటి జమిలి బాధ్యతలు- @4023*

               ఆ జంట బాధ్యతలలో మొదటిది వైద్యరంగంలో ఒక అపూర్వ ఘట్టమైన GBR ఫౌండేషన్ వారి వైద్యసేవా శిబిరం. నెలల ప్రకారమైతే ఈ శిబిరం సంఖ్య 288*, గోపాళం శివన్నారాయణుల వారి 2రాష్ట్రాలలోని 47 మెడికల్ క్యాంపుల్లో ఇదొకటి!

               ఇక 2వ వైవిధ్య సేవ చల్లపల్లి ప్రాంతానికి పరిమితమైన స్వచ్ఛంద శ్రమదాన ఉద్యమం. దీని వయసు కూడ పన్నెండేళ్ల పైమాటే. మొదటిది వైద్యసేవకు పరిమితం! 2వది అనారోగ్య నివారణకు (preventive medicine) గాను DRK తదితర సేవామూర్తుల విస్తృత ప్రయత్నం!

               ఇటు 31 మంది వీధి సేవాతత్పరులూ, మరోడజను మంది ప్రక్కనే 4:40 కే ప్రారంభమైన విజయా కాన్వెంట్ లోనే వైద్యశిబిర సహాయకులూ - అనగా 41 మంది స్వచ్ఛంద సామాజిక సేవలు ఇలా ఉన్నవి!

               చల్లపల్లి ప్రభుత్వాసుపత్రి వీధిలో వేకువ 4:19 కే డజను మంది కార్యకర్తల వీధి సంస్కరణ మొదలయింది. ఇంకో19 మంది సావకాశంగా వచ్చి, ఆయుధపాణులై వీధి కాలుష్య సంహరణం ప్రారంభించారు.

               6:05 తరువాత చూద్దును గదా- ఆ150 గజాల బజారులో 90% శుభ్రపడింది. ఇప్పుడా రోడ్డులో దుమ్మూ-ధూళీ లేదు, డ్రైను మురుగులో రకరకాల ప్లాస్టిక్కులు లేవు, చెట్ల కొమ్మలు - అడ్డ దిడ్డంగా కాక అణకువగా, పొందికగా కనిపిస్తున్నవి, ప్లాస్టిక్ సీసాలు, మద్యం బాటిల్సూ, ఎండుకొమ్మలూ, పుల్లలూ కనిపించవు.

               ఐతే- ఈ వీధి పరిశుభ్రతాకారణ మేమిటో- ఎవరి 40 పని గంటల శ్రమతో ఈ ఆహ్లాదం వచ్చిందో –ఆలోచించే గ్రామస్తులెందరు? ఈ వైద్యశిబిరం గవర్నమెంటు నడుపుతున్నది కాదనీ, అత్యున్నత వైద్య అర్హతలు గల ఒక విజయవాడ వైద్యుని నిర్వహణమనీ ఎందరికి గుర్తుంటుంది? ఈ స్వచ్ఛ కార్యకర్తల, శివన్నారాయణుల సామాజిక బాధ్యతా స్పూర్తిని అంది పుచ్చుకొంటున్న ప్రజలు 1%  అన్నా ఉన్నారా ?

               4:30కే మొదలైన ఈ జమిలి సేవలలో- వీధిసేవలేమో 6:10కి ముగిస్తే, వైద్య సేవలు ఏ 12:00 కో ముగుస్తాయి!

               ఈ ఆదివారపు విజయా కాన్వెంట్ దక్షిణ బజారు పరిశుభ్రత ముగిసిన తరువాత ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో జరిగిన సమీక్షా సమావేశాన్ని కరాఖండీ నినాదాలతో మొదలెట్టిన వారు రాయపాటి రమ గారు. సమీక్షా నిర్వహణ మధ్యలో మన సమకాలపు ప్రత్యేక వైద్యుడైన శివన్నారాయణ గారి చరిత్రను వివరించినది నేను.

               రేపటి బెజవాడ రహదారి సేవలు వేకువ 4:20 కే తరిగోపుల ప్రాంగణం వద్ద ప్రారంభం కాగలవు. వైద్యశిబిరం మాత్రం 2027 మార్చి 28న జరుగుతుంది!

               నాకర్ధంకాకున్నది!

ఔను నిజమే- ఏపనైనా అందరికీ నచ్చాలను

రూలేం ఉండదు గానీ, రోతగ మారిన ఊరును

 సరిజేసే పనులేవో స్వచ్ఛందంగా జరిగితె

 నచ్చియు పాల్గొనకుండుట నాకర్ధంకాకున్నది!

- ఒక స్వచ్ఛ కార్యకర్త

   22.11.2026