4025* వ రోజు.....           24-Nov-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?

ఈ వేకువ జరిగినది (మంగళ - 24-11-26) 4025* వ శ్రమదానం.

               అది కూడ 4.17 కే ప్రారంభం, దాని ముగింపు 6:10 వ నిముషం, 26+1 మంది శ్రద్ధలూ, పట్టుదలలూ, వివిధ పారిశుద్ధ్య – సుందరీకరణ చర్యలూ మరొకమారు బెజవాడ బాటలోని కాటా ప్రాంతానికే సమర్పితం!

               చల్లపల్లి గ్రామస్తులకు - ముఖ్యంగా ఏకాంతము వలన కాలం గడవని పెద్దలకు, తోటివారికేదొక మంచి చేయాలని ఉండి కూడా ఒక్కరుగా చేయుటకు మొహమాటపడే నారాయణరావు నగర, బాలాజీ బృందావనాది అపార్ట్మెంట్ల పౌరులకు వినయపూర్వక హెచ్చరిక ఇది!

               “అయ్యా!

               ఈ చల్లపల్లి వీధుల్ని, డ్రైనును, హరిత సంపదను, తద్ద్వారా పర్యావరణ భద్రతను కాపాడినా – చెడగొట్టుకొనినా అది మన చేతుల్లోనే ఉన్నది. ఎన్నో గ్రామాలలో కనిపించని మౌలిక వసతులు, సువిశాల వీధులు, బాగా ఆలోచించగల ప్రజలు మన గ్రామంలో ఉన్నాయి..

               ముఖ్యంగా 13 ఏళ్ల నుండి ఊరి స్వస్తతే ధ్యేయంగా ప్రతి వేకువ ఝామున శ్రమించే స్వచ్ఛ కార్యకర్తలు మనకున్నారు.

ఈ వేకువ జామున సైతం ఈ ధన్యులు -

- బెజవాడ వీధిలో 150 గజాల మేర చెమటలు చిందించి, చీపుళ్లతో ఊడ్చారు.

- ముగ్గురైతే రోడ్డు తూర్పున గబ్బుకొట్టే మురుగు కాల్వలోని మనం విరజిమ్మిన నానారకాల చెత్తను అవిగో – ఐదారు గుట్టలు ఏరారు.

- మరో ముగ్గురు కాటాల వద్ద లోతైన మాన్ హోల్ లో దిగి, వ్యర్ధాలను బైటకు లాగుట వలననే ఆ డ్రైనులోని మురుగు ప్రవాహం చిల్లలవాగు వైపుకు పారుతున్నది.

- ఈ గ్రామం లోపలా, బైటా 32 వేల వృక్షములూ, పూల మొక్కలూ, ఉద్యానాలూ ఏర్పడి, అందంగా కనిపించుట గ్రామస్తులకు అంగీకార యోగ్యం కాదా?

-  అదుగో - నలుగురు కార్యకర్తలు ఈ వీధి సౌందర్యం కోసం కరెంటు తీగల్లో దూరిన చెట్లు కొమ్మల్ని ఎంత సాహసంగా, ఒడుపుగా కోసి, ముక్కలు చేస్తున్నదీ గ్రామస్తులందరం గ్రహించవద్దా? 

               కనుక ఇదేమీ అనాగరికం కాదనీ, మనకోసంమనమే మన పనులు చేసుకొనుట తప్పుకాదనీ అంగీకరించిన వారు రేపటి నుండి దయచేసి, శ్రమదానములో పాల్గొన కోరెదము.

ఇట్లు

స్వచ్ఛ సుందర కార్యకర్తలు

 

నేటి అదనపు గమనికలు :

1) ముమ్మనేని నాని అనే చిరపరిచితుడు గ్రామ సర్పంచిగా తనను గెలిపించమని కోరుట,

2) రేపటి మన శ్రమదానము కూడ శ్మశాన ప్రాంతములోని కాటాల వద్దనే జరుగునని ఇందుమూలముగా ప్రకటించుట.

        వారాని కొక్క పూటైనా పూనుకోవ?

పుష్కర కాలం నుండీ ఊపిరి సలపని పనులతో

స్వచ్ఛ కార్యకర్తలెంతో చొరవతొ గ్రామోద్ధరణకు

నడుం కట్టినా రోజుకు గంట కూడ రాలేవా?

చివరకు వారాని కొక్క పూటైనా పూనుకోవ?

- ఒక స్వచ్ఛ కార్యకర్త

   24.11.2026