పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?
బుధవారం (25-11-26) శ్రమ విశేషాలు మాత్రం తక్కువా? @4026*
ఈ వేకువ 4.20 - 6.15 నడుమ, బెజవాడ రహదారిని పెద్ద శ్మశానం సమీపమున అటూ ఇటూ తిరుగాడుచున్న బాటసారులు గాని, వివిధ వాహన చోదకులు గాని, 26 మంది స్వచ్ఛ కార్యకర్తల పారిశుద్ధ్య, శుభ్ర సుందరీకరణ చర్యలను చూస్తే - వారికేమనిపిస్తుంది?
క్రొత్త మనుషులకూ, బస్సులోని ఇతర గ్రామస్తులకైతే – “ఎవరు వీళ్లు? ఇంత వేకువ వేళ చలి గాలిలో - చినుకులు పడుతుండగా ఈ వీధి ఊడ్పులేమిటి? చూడబోతే విద్యాధికులు, ఉద్యోగుల్లా కనిపిస్తున్నారు గాని, వాళ్ల స్థాయికి తగిన పనులు కావే ఇవి"! అనిపిస్తుందేమో!
చల్లపల్లి స్థానికులకైతే ఈ 26 న్నూ తెలిసిన ముఖాలే గనుక - “ఎవరో చెపుతుంటే విన్నాం గాని, స్వయంగా - దగ్గరగా చూస్తుంటే ఈ కార్యకర్తల కష్టం సామాన్యమయింది కాదే! వీళ్ళే గనుక లేకుంటే ఈ డ్రైన్లు, ఇన్ని వేల వృక్ష సంపదలు, వీధి పరిశుభ్రతలు, ఆ వృక్షాల కొమ్మలు కూడ రోడ్డుకడ్డంగా పెరగక, కరెంటు తీగల్లో చొరబడక ఉండేవా?" అనే ఆలోచనలు రావచ్చు!
తమ మోటారు బళ్లు ఆపి, ఆసక్తిగా గమనించిన వారికి మాత్రం “శ్రమదానమంటే ఏవో పైపై పనులూ, పేరు కోసం పనుల ఫొటోలూ, పత్రికల్లో ప్రచారాలూ అనుకొన్నాం గాని, మరీ ఇంత బరువైన రిస్కీ పనులా? అంతెత్తు చెట్టు కొమ్మపై నిలిచి, వృక్ష సుందరీకరణమా? కాటాల ప్రక్కన రోడ్డు మార్జిన్ లోని పెద్ద పుట్టను ముగ్గురు త్రవ్వేస్తుంటే - పాములో – మండ్ర గబ్బలో కుటితే?” అని కాస్త భయ పడనూ వచ్చు!
బాట పడమర డ్రైన్ లోంచి తోడిన తుక్కులు ఏడెనిమిది గుట్టలు చూసి, "ఈ మురుగు కంపు పనులా వీళ్లు 4000 రోజులుగా చేస్తున్నవి? ఈ పాతిక మంది ఈ ఒక్క వేకువ చేసిన పనులే గనుక (- ఇలాంటి ముదనష్టపు పనులకు వాళ్ళసలు రారనుకో-) కూలీలతో చేయిస్తే పాతిక వేలైనా ఖర్చవుతుందే” అనుకోక తప్పదు!
బలమైన తీగలల్లుకొని, ముళ్ళ పొదల మీదుగా పెరిగి, అక్టోబరు తుఫానుకు సగం విరిగిన పెద్ద కొమ్మల్ని ఏడెనిమిది మంది బలశారురైన కార్యకర్తలు గంట పాటు రకరకాల కోణాల నుండి కోసి, డ్రైనులో నుండి లాగి, ముక్కలు కోసిన సంగతి పరీక్షగా చూశారనుకో – “అసలెందుకొచ్చిన కష్టం వీళ్లకి? ఈ మనుషులు పిచ్చోళ్లా? లేక సమాజానికి ఆదర్శమూర్తులా?” అని తేల్చుకోలేకపోతారు కూడ
నేనిలా వ్రాసుకుపోతుంటే చదివే వారిలో ఏ కొద్దిమందో- “చేశార్లెద్దూ - ఊరి పనులు – ఈయనేంటి - ఉన్నవీ లేనివీ జోడించి ఇలా వర్ణించాలా?" అనుకోరని గ్యారంటీ లేదు!
[నేటి తుది సభలో కూడ ఇలాంటి మాటలే వచ్చాయి! ఒకప్పటి చల్లపల్లి నర్సింగ్ హోం కాంపౌండరూ, ప్రస్తుతం హైదరాబాదులో ఆస్పత్రి నిర్వాహకుడూ ఐన శ్రీనివాస్ స్వచ్చోద్యమ ఖర్చులకు 10,000/- విరాళమిచ్చారట!]
రేపటి వేకువ కూడ బెజవాడ బాటలోని కాటా వద్దనే మనం కలుసుకోవాలట!
అర్థం కాలేదా?
మనిషి కసాధ్యమె లేదని, మనోనిశ్చయం ముందర
ఏసమస్య నిలవదనీ ఈ స్వచ్ఛోద్యమ ధీరులు
పుష్కర కాలం నుండీ పోరాడుట చూళ్లేదా?
అది నీకోసం అనైన అర్థం కాలేదా మరి?
- ఒక స్వచ్ఛ కార్యకర్త
25.11.2026