4027* వ రోజు.....           26-Nov-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?

ఈ రోజు (గురు - 26-11-26) అనేం లేదు – ఏ నాటి శ్రమైనా తగ్గిందే లేదు - @4027*

               అది బెజవాడ రహదారి, వక్కలగడ్డ సమీపస్థ తరిగోపుల ప్రాంగణ ప్రాంతం. ఆ స్వచ్ఛ కార్యకర్తలు 27 గురే, వాళ్ళు చేయాలనుకొన్నది వేలాది ప్రజలకు ఆహ్లాదకరమైన వీధి పరిశుభ్ర సౌందర్య చర్యలే,

               అందుకు గాను చలినీ తుఫాను వాతావరణాన్నీ లెక్కచేయక - ఆడు బిడ్డలతో సహా వేకువ 4.20 కే వెళ్లి అక్కడ వాలారు! ఇక అక్కడి నుండి పని విరమణ సూచక విజిలు మ్రోగుతున్నా ఐదారుగు తప్ప 6.10 తరువాత గాని ఆ చెత్త పనులు విరమించలేదు!

               ఇందులో మురుగు కాల్వ సంస్కర్తలు కాటాల సమీపంలో విసుగూ విరామం లేక తోడిన సిల్టూ, లాగిన ప్లాస్టిక్ తదితర తుక్కులూ  గంటకు పైగా పీల్చిన కంపూ, వాళ్ల బట్టలకు యుద్ధ వీరుల శరీరాలకు రక్తపు మరకల్లాగా నల్లని మురుగు చారలూ, ఆ మురుగు ఓడుతున్న చెత్త గుట్టల్ని ఇద్దరు డిప్పలకెత్తి, చెత్త ట్రాక్టర్ లోకి చేరుస్తున్న వైనమూ... చూశాను! (ఈ సమాచారం “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” వాట్సప్ చిత్రాలలో కూడ పాఠకులు తెలుసుకొనవచ్చు!)

               అప్పటికే బాగ శుభ్రంగా ఉన్న రోడ్డు పడమర ఖాళీ చోటుల్ని పారలతో చెక్కి, చదును చేసి, తీర్చిదిద్దుతున్న ఇద్దరు విశ్రాంత వయోధికుల్ని కూడ వాట్సప్ ఫాటోలో గుర్తించండి.

               కార్యకర్తల ముఠా ఇంకొకటి ప్రధానంగా కత్తులూ, దంతెలూ ధరించి, పెరిగి, రోడ్డు అందం చెడగొడుతున్న పిచ్చి మొక్కల్నీ, కలుపునూ తొలిగించుకొంటూ, చెట్ల కొమ్మల్ని సరిజేసుకొంటూ, ఆనందిస్తున్న వైనం గమనించారో లేదో!

               చిల్లలవాగు వంతెన ప్రాంతంలో చీపుళ్ళతో ఊడుస్తున్న ఒక సీనియర్ డాక్టరమ్మనూ, నర్సులనూ చూస్తే ఈ వాట్సప్ పాఠకులకేమీ అనిపించడమే లేదా?

               ఈ అపూర్వ శ్రమదానోద్యమాన్ని తొలినాళ్ళ నుండీ గమనిస్తున్న, పాల్గొంటున్న, ఆనందిస్తున్న అదృష్టం నాది! పన్నెండేళ్లకు పైగా ఈ స్వచ్ఛ కార్యకర్తల వేలకొద్దీ శ్రమ జీవన సౌందర్య దృశ్యాల్ని ఎప్పటికప్పుడు వర్ణించే, పద్యాలూ, పాటలూ వ్రాసే సదవకాశం నాది!

               శ్రమదానానంతర సభలలో వరుసగా గత మూడు రోజుల్నుండి ఉద్యమ సంబంధ నినాదాలు చేసిన అవకాశం

1) భోగాది వాసు మాస్టారు

2) కోడూరు వెంకటేశ్వరరావు,

3) సుధాకరులది!

               DRK గారి నేటి సమీక్షా కాలంలో మధ్యలో కలుగజేసుకొని, ఒకాయన అభిప్రాయంలో “RTC బస్టాండు, గంగులవారిపాలెం వీధీ, కాసానగర కూడలి వంటివి స్వచ్ఛ సామంత దేశాలట! తరిగోపుల ప్రాంగణం స్వచ్ఛ సుందర చల్లపల్లి అనే సామ్రాజ్య రాజ్యాలట!”

                రేపటి శ్రమదానం కూడ చిల్లలవాగు వంతెన వద్దనేనట!

               ఎందరికది తెలియునులే!

గ్రామస్తులలో యాభై శాతానికి పైగా ఈ 

స్వచ్ఛోద్యమ వైశిష్ట్యం సంగతే గ్రహించలేదు

ప్రతి వేకువ శ్రమల వెనుక ప్రతి ఏర్పాటెవరిదో,

ఇంతటి ప్లానింగ్ ఎవ్వరిదో ఎందరికది తెలియునులే!               

- ఒక స్వచ్ఛ కార్యకర్త

   26.11.2026