4028* వ రోజు.....           27-Nov-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?

30 మందితో కళకళలాడిన 4028* వ నాటి శ్రమదానం!

               గాలి కొంచెం తగ్గి, మంచు పడుతున్న 27.11.26 – శుక్రవారం పూట వీధి పారిశుద్ధ్య, సుందరీకరణ దృశ్యాలు ఆకర్షణీయంగా ఉన్నవి. 4:20 – 6:15 నడుమ చిల్లలవాగు వంతెన నుండి కాటాల దాక 150 గజాల బారునా శ్రమ సందడి చివరి ½ గంటయితే కొందరు సందర్శకులకు విచిత్రంగానూ, సమాజ పరివర్తన గురించి ఆలోచించే వాళ్లకు అద్భుతంగానూ అనిపించే ఉంటుంది.

               అవేమన్నా ఆషామాషీ పనులా? ఎప్పుడో కార్యకర్తలు 2015 లో నాటిన మొక్కలు మహావృక్షాలుగా పెరిగితే, అవి కరెంటు తీగలకో, రహదారి వాహన శ్రేణికో అడ్డు తగులుతుంటే - పెంచిన చేతులతోనే వాళ్ళే కత్తిరించవలసిన పరిస్థితి!

               ఆ పనులైనా ఎలా జరిగాయని? మర రంపం వాడడంలో మహా నిపుణుడైన ఒక కార్యకర్త చెట్టు కొమ్మనెక్కి, ఏ కొమ్మల్ని ఎంత వరకు కోయాలో అంతవరకే కోస్తున్న దృశ్యం పని కష్టం తెలిసిన ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది!

               తరిగోపుల ప్రాంగణం వద్ద చెట్లపైకెక్కి ఒకానొక ఆస్పత్రి ఉద్యోగి చాకచక్యంగా మంచి విచక్షణతో మరరంపంతో చేస్తున్న వృక్ష సుందరీకరణను నేనైతే కళ్ళార్పకుండా చూశాను!

               కోళ్లఫారం ఉద్యోగీ, పన్నెండేళ్లు స్వచ్చోద్యమ అనుభవజ్ఞుడూ ఐన మరొక కార్యకర్తకు ఆ మరరంపం దొరక లేదని, చెట్టెక్కి, కత్తితోనే చిందరవందర శాఖల్ని నరకడం మాత్రం చిన్నా - చితకా పనా?

               వెలుతురు చాలని మురుగు గుంట నుండి పుల్లాపుడకా, ప్లాస్టిక్ చెత్తా గంటసేపు లాగడమూ, ఇద్దరు ప్రాత + ఒక క్రొత్త కార్యకర్తలు రోడ్డు పడమర మార్జిన్ శుభ్రతకు నగిషీలు చెక్కడమూ, ఏడెనమండుగురు ట్రాక్టరు కొమ్మల్ని అంత దూరం నుండి లాగుకొచ్చి, సైజులుగా నరికి గుట్టలుగా పేర్చడమూ, నిన్నా - మొన్నా ఊడ్చిన చోటే అదే పనిగా మరల మరల చీపుళ్ల కార్యకర్తలు ఊడ్వడమూ..... ఈ పనులన్నిటిని ఎందరు గ్రామస్తులు గమనించి, గుర్తుపెట్టుకొని, ఆలోచిస్తున్నారు?

               గ్రామస్తుల సంగతలా ఉంచి, స్వచ్ఛ కార్యకర్తలు పట్టుదలతో, పారిశుద్ధ్య పనుల్ని ఆనందిస్తూ చేయడమనేదే ముఖ్యాంశం!

               చాల రోజులు చెన్నైలో ఉండి, ఇక్కడి స్వచ్ఛ సుందరోద్యమానికి దూరమైన డాక్టరు గోపాలకృష్ణయ్య గారి దిగులు నేటికి తీరినందున అమెరికన్ చాక్లెట్లు పంపకంలో ఆయన సంతోషం కనిపించింది. 2 కిలోల చాక్లెట్లను శేషు గారు పద్మావతి గారి కందించారు. మాలెంపాటి వారి నినాదాలతో మొదలైన సమావేశంలో ఏముంటాయి – ఎలక్షన్  చర్చలు కాదు - ఇంకా చల్లపల్లి ఏ మూలల్లో ఏ అవసరాలున్నవి? ప్రాత ప్రభుత్వాస్పత్రి వీధిలో నరికేసిన చెట్లేమిటి? ఈ పూట ఎంతా బాగా పనిచేశాం –

               రేపు కూడ ఈ చిల్లలవాగు వంతెన వద్దనే కదా కలుసుకోవాలి..... లాంటి విషయాలే కదా!

         అంత సులభమని కూడా

మనసుకేమొ సంతృప్తీ - దైహికముగ అరోగ్యం

తెచ్చెడి ఈ శ్రమదానం తెలుసుకొనీ అనుసరిస్తే

ఎంత పెద్ద కష్టంగా ఈ సంస్కృతి అనిపిస్తదొ

అంత సులభమని కూడా అనిపిస్తది కొన్నాళ్లకి!

- ఒక స్వచ్ఛ కార్యకర్త

   27.11.2026