4029* వ రోజు.....           28-Nov-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?

ఇది 4029* వ సామాజిక సామూహిక శ్రమానందం! (శనివారం- 28-11-26)

               40+2 మంది వేకువ 4.17-6.15 మధ్య సాగించిన

1) వీధి పారిశుద్ధ్య

2) వృక్ష సుందరీకరణ

3) పరిశుభ్రతా చర్యలు

               ఎప్పటిలాగే అసాధారణమూ, అనితర సాధ్యమూ, అనిదం పూర్వమూ అని చెప్పవచ్చు; అలాంటి విశేషణాలకు కారణాలు

1) ఆ వీధి బాధ్యతలు ఒక రోజుకో - ఒక నెలకో- సంవత్సరానికో పరిమితం కాకపోవడం

2) ఇప్పటికే 5 లక్షల పని  గంటలు ఒక పల్లెటూరులో రకరకాల శ్రమలు జరగడం!

               నాయుడు మోహనరావు ఈ కార్యకర్తల్ని దేవదూతలని వర్ణిస్తాడు.

               DRK వైద్యుడినడిగితే – ఇవిసేవలేమిటి? ఏ గ్రామ పౌరుడికైనా బాధ్యతలు అనీ, సజ్జా ప్రసాదు మాటల్లో ఐతే – “ఈ పనులు గ్రామానికి ఉపయోగములే, కార్యకర్తల కష్టం కూడ సమాజానికవసరమే కాని, ఈ మైకుల సందడీ, మనం చేసే మంచి పనుల్ని మనమూ, బైటి వాళ్లూ ఇంతగా మెచ్చుకోవడం - ఎందుకు? ఏదో వస్తున్నాం - మంచి అనుకొన్న పనులు చేస్తున్నాం అది చాలు” అనీ,

               అడపా మాస్టరైతే – “ఇది మాటలకందని  మహోద్యమమనీ, భూమి క్రుంగినా, ఆకాశం పడిపోయినా సరే ఆగని అద్భుతమనీ..... చెపుతుంటారు!

               సరే - ఎవరెలా పొగడినా, తెగడినా, “ఇది కళ్లెదుట జరుగుతున్న వర్తమాన సామాజిక ప్రయోగమనీ, దీని ఫలితం, ప్రభావం గ్రామం మీద, దేశం మీద తప్పక ఉంటుందనీ నేనంటాను!

               ఈ వేకువ శ్రమ చర్యలు సైతం బెజవాడ బాటలోని కాటాల నుండే మొద లై న వి. అవి నెమ్మదిగా వక్కలగడ్డ పరిధిలోకి ప్రవేశించినవి. ఎవరికిష్టమైన - చేతనయిన పనులు – వృక్ష శాఖా ఖండనమో, ఆ కొమ్మల్ని మళ్ళీ కోసి - విభజించడమో, రోడ్డు మార్జిన్ల బరంతులో, డ్రైను సంస్కరణమో, తుక్కు లోడింగో, గడ్డి చెక్కుడో, చీపుళ్ల ఊడ్పులో.... ఆనందంగా చేసుకుపోయారు.

               కాకపోతే ఆలస్యంగా విజిలు మ్రోగినా ఐదారుగురు తప్ప పనులాపలేదు. అందుచేతనే 6.15 కు కాక - 6.30 తరువాతే తుది సభ జరిగింది. అందులో

1. ఇంకా ఈ ప్రాంతంలో 3-4 రోజులు చేయదగిన పనులను గురించీ, ఈపూట జరిగిన శ్రమ గురించీ DRK గారు వివరించారు.

2. పదేపదే బాగుచేస్తున్నా మళ్లీ మళ్లీ డ్రైన్లలోకి వచ్చి పడే సంచుల, చెత్తల పరిష్కారార్ధం పంచాయతి ఆరోగ్య అధికారి వచ్చారు.

3. బిస్కట్లు పంచేవారు పంచారు.

4. నందేటి శ్రీను పాటనందుకొన్నాడు.

5. యడ్ల జగదీష్ నినాదాలు ప్రకటించాడు.

               రేపటి శ్రమదానం కూడ చిల్లలవాగు వంతెన ప్రాంతమని తేల్చారు! (అంతే సంగతులు!)

- ఒక స్వచ్ఛ కార్యకర్త

   28.11.2026

            ఒకసదాశయం - ఒక సత్సంకల్పం

చల్లపల్లిలో శ్రమదానం ఒకసదాశయం - ఒక సత్సంకల్పం

వివాద రహితం వినోదసహితం - ఊరికి మనకానంద దాయకం

శుభోదయమునకు పలుకు స్వాగతము - శుచీ శుభ్రతా సంప్రదాయకము

గ్రామ మంతటికి కీర్తిదాయకము - సమాజానికొక స్ఫూర్తి ప్రేరకము!