2057* వ రోజు....           29-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ మనం వాడవద్దు.

2057* వ నాటి సమయ శ్రమదానాలు !

ఎప్పుడు మేల్కొన్నారో గాని నేటి వేకువ కార్యకర్తలు సన్నద్ధులైన సమయం: 3.55. అప్పటి నుండి 6.05 దాక ఈ గ్రామ ప్రధాన వీధి ఐన బందరు జాతీయ రహదారి స్వచ్చ- శుభ్రతలకో పాటుబడిన శ్రమదానకర్ణులు 25 మంది. వారి కృషి ఫలితార్థం గా నేటి శుభ్ర సుందరీకృత భాగం 6 వ నంబరు పంట కాలువ వంతెన నుండి మేదరవాడ దాక!...  ఐతే ఇవన్నీ భౌతిక గణాంకాలనుకొంటే- ఇంత చల్లని (బ్రహ్మ ముహూర్తాన – పడక వదలి, ఇల్లు దాటి గ్రామ వీధికెక్కి ఒక ఉమ్మడి ప్రయోజన సాధన కోసం తదేక దీక్షతో 50 పని గంటల పాటు కృషి చేసిన ఈ కార్యకర్తలు తీసుకోగలిగిన గ్రామస్తులకు) పంచిన సద్యః స్ఫూర్తి ఎంత ? ఇన్ని వేల దినాలుగా ప్రకృతి వైపరీత్యాలు కాక- కరోనా జగద్విలయ మహమ్మారిని కూడ లెక్క చేయక- దూషణ భూషణ తిరస్కారాలను సమ దృష్టితో స్వీకరిస్తూ-మనః సాక్షులతో కొనసాగుతున్న చల్లపల్లి స్వచ్చోద్యమకారుల దీక్షల నైతికత ఎంత?

            ఈ నాటి స్వచ్చ కార్యకర్తల కృషి మూడు విధాలుగా సాగింది:

-స్టేట్ బాంకు ఎదుట గుడారంలో వాహనాలు నిలిపి, ఆయుధాలు ధరించిన ప్రధాన బృందం దారికి రెండు ప్రక్కల- కళాశాల ఉద్యానం ప్రక్క, గేటు ముందున్న రంగు రాళ్లను, రహదారిని, పండ్ల దుకాణ ప్రాంతాన్ని, రిజిస్ట్రారు కార్యాలయ ముఖ విభాగాన్ని, దంత వైద్యశాల, రామాలయ, షిరిడి నిలయ, మస్జిద్  ప్రాంతాలను దాటి ఊడ్చుకొంటూ సాగింది!

- గ్రామ రెస్క్యూ దళం సభ్యులు కీర్తి వైద్యశాల ముందు, బ్యాంకు ఎదుట చాలా రోజులుగా వర్షాలకు నీరు నిలుస్తున్న పల్లాలను సరిదిద్ది- ఉప కాలువలు చేసి, ఆ నీటినంతటిని మురుగు కాలువలోకి పంపించారు.

            6.05 కు అసలు కృషి ముగించాక జరిగిన దైనందిన సమీక్షా సమావేశంలో డాక్టరు రామకృష్ణ ప్రసాదు గారు కరోనా భూత-వర్తమాన- భవితలను గురించిన అంచనాలను వివరించి, ప్రమాదాన్ని హెచ్చరించి, తీసికోదగిన జాగ్రత్తలను పదేపదే గుర్తు చేశారు.

            ఈ డాక్టరు గారి నిన్నటి ముఖ పుస్తక చల్లపల్లి స్వచ్చోద్యమ వివరణను చాలమందిమి వీక్షించాము. ఐతే – నడుమ అంతర్జాల అంతరాయాల, విద్యుదంతరాయాల కారణంగా సదరు ప్రసారాన్ని పూర్తిగా చూడనివారు అదే లింకుతో ఇప్పుడైనా ముఖ గ్రంథాన్ని తెరవవచ్చు!

            తమ బందరు మార్గ స్వచ్చ-శుభ్రతలకు పూచీ పడుతున్న నేటి కార్యకర్తలకు ఉడత్తు రామారావు గారి బిస్కత్తుల పొట్లాల పంపిణీ, మరియు  అదే పేరున్న మరొకరి నిమ్మకాయల వితరణ జరిగింది.

         తమ కుమార్తె  తాతినేని స్వాతి ప్రసన్న నిన్న 23 వ పుట్టిన రోజు సందర్భంగా 24 నీడనిచ్చే మొక్కలను స్వచ్చ కార్యకర్త మొక్కల రమణ గారు నేటి కార్యక్రమానంతరం అందజేశారు. 

 

            రేపటి స్వచ్చంద శ్రమదానం కోసం ATM సెంటరు దగ్గర కలుసుకొందాం.

         బృహద్విజయ విహారం

స్వచ్చ మాన్య చల్లపల్లి కథాక్రమం బెట్టదనిన....

సామాజిక ఋణ విముక్తి సాధన సద్భావనతో-

వినీతులై-సునీతులై స్వచ్చోద్యమ కారులెంతొ

బృహత్ప్రణాళిక రచించి విజయ విహారం చేయుట!     

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

సోమవారం – 29/06/2020,

చల్లపల్లి.

3.55 కు SBI వద్ద