2059* వ రోజు....           01-Jul-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.

 

2059* వ నాటి విధి నిర్వహణలు!


          ఈ వేకువ జామున కూడ - 3.55 – 6.00 నడుమ విసుగు – విరామం – అలసత్వం వంటివేవీ దరిజేరని 23 మంది చల్లపల్లి స్వచ్చోద్యమకారులు తరగని నిబద్ధతతో గ్రామ పారిశుధ్య మెరుగుదల కోసం, తద్ద్వారా సోదర గ్రామస్తుల స్వస్త జీవనం కోసం శ్రమించారు. ఆదర్శాలు వల్లించడం కాక – వేరొకరి వెనుక నడవడం కాక, మాటిమాటికీ మరెవరి వల్లనో ప్రేరేపితులు కాక – స్వయం ప్రేరణతో, ఆచరణతో, అగ్రభాగాన నడిచే వారే నాయకులు, వైతాళికులు అనబడతారు! అలాంటి వాళ్ళకు ఇతరుల చప్పట్లు కాదు, ఆత్మ సంతృప్తే ముఖ్యం! రికార్డులు, రివార్డులు కాదు, తమ గ్రామ బాధ్యతల పరిపూర్తే లక్ష్యం! ఇలాంటి వైఖరిని మన పూర్వులు “ఋషి ఋణ విముక్తి” అన్నారు. ఇప్పటి భాషలో సంఘజీవులుగా ఉన్నందున “సామాజిక బాధ్యతా నిర్వహణ” అందాం.

 

          నేటి స్వార్ధపూరిత సమాజంలో – వికృత నగ్న దోపిడీ ప్రపంచంలో కనీసం చల్లపల్లి వంటి ఒక్క గ్రామంలోనైనా అలాంటి కొన్ని లక్షణాలున్న కొందరు 2059 రోజులుగా ఆ ఋణ విముక్తి ఎలాగో చేసి చూపిస్తున్నారు. రోజూ రెండు గంటల తమ సమయాన్ని, శ్రమనూ, చెమటనూ, మేధస్సునూ తామున్న ఊరి కోసం త్యాగం చేస్తున్నారు. అలాంటి ఒక కార్యకర్త నిన్న తన వివాహ వేడుక మిషతో గ్రామ ప్రయోజనకారి ఐన “మనకోసం మనం” ట్రస్టుకు 1000/- విరాళమిస్తే – ఈ రోజు 83 వ ఏట ప్రవేశించిన – ఎక్కడో కర్ణాటక లో ఉంటున్న ఔత్సాహిక బాలుడు తన సహకార్యకర్తలకు – ముఖ్యంగా వాళ్ళ స్వచ్చోద్యమానికి ఆశీర్వచన పూర్వకంగా కేకులు, బొబ్బట్లు, కాఫీలను పంచి, ట్రస్టుకు కూడా కొంత ఆర్ధిక సహకారమందించారు! వారు కనీసం మరొక 18 సంవత్సరాలు ఇలాగే తరగని ఉత్సాహంతోమనలోను , గ్రామస్తులలోను, తన చుట్టూ సమాజంలోనూ సద్యః స్ఫూర్తిని నింపుతూ వర్ధిల్లాలని స్వచ్చ కార్యకర్తలందరి ఆకాంక్ష – అభినందనం!

 

          ఈ జులై ప్రధమ దినాన ATM ను కేంద్రంగా చేసుకొని సాగిన కార్యకర్తల కృషి శ్లాఘనీయం! ఎక్కువ మంది చీపుళ్ళ – దంతెల వారు సంత బజారు స్వచ్చ శుభ్రతలకే ప్రాధాన్యమిచ్చారు. అక్కడి నీటి మడుగుల్లో మట్టి నింపి – సమం చేస్తూ – రంగు రాళ్ళ మీద పేరుకొన్న బురదను గోకి, రైతు బజారు కూరల వ్యర్ధాలను ఊడ్చి, పోగులు చేసి, ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి తరలించారు.

 

          మిగిలిన వారు బందరు జాతీయ రహదారిని శుభ్రపరచి, నిల్వ నీటిని సన్న కాలువలు చేసి డ్రైనులోకి నడిపి, కూరల దుకాణాల వ్యర్ధాలను సేకరించి – తమ బాధ్యతలను పూర్తి చేశారు!

 

          తన పుట్టిన రోజని, ఉద్యోగ విరమణ రోజని, తమ వైవాహిక శుభ తరుణమని - ఇంకా ఏవేవో మిషలతో అటు మనకోసం మనం ట్రస్టుకు – ఇటు సహచర కార్యకర్తలకు విరాళాలు, విందులు ఇచ్చే పెద్ద వ్యసనపరుడు ప్రాతూరి శాస్త్రి మహాశయుడు ప్రతి నెలా తాను స్వచ్చోద్యమానికి ఇస్తున్న నెలవారీ చందాను (ఇంకా అసలు ఈ నెల ఫించను వచ్చిందో లేదో!) ఈరోజు చెక్కు రూపేణా 5,000/- బహూకరించారు. శతమానం భవతి!   

 

          రేపటి స్వచ్చంద శ్రమదాన విధుల కోసం ATM కేంద్రం దగ్గరే కలుసుకొందాం.

 

ఇడుగిడుగో స్వచ్చోద్యమ తొలి దినాల వీరుడు!

ఏదేశం ఏగినా – ఎచట కాలు పెట్టినా

చల్లపల్లి మెరుగుదలను స్వప్నించే ధీరుడు!

కన్నడ దేశంనుండే – స్వచ్చోద్యమ చల్లపల్లి

కంకితుడై నిలుస్తున్న అతడే మన “అర్జునుడు”!

 

         నా భావన – అభ్యర్ధన

అతని గమ్యం స్వచ్చోద్యమ ధన్యమాన్య చల్లపల్లి

స్వచ్చ కార్యకర్తంటే క్షమాగుణం కలవాడని

తెగడ్తలూ – పొగడ్తలూ దీవెనలను కొంటాడని

తానొక అత్యున్నత తాత్త్విక సంపన్నుడనీ...

                           

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

బుధవారం – 01/07/2020,

చల్లపల్లి.

ప్రాతూరి శాస్త్రి గారి విరాళం