2060* వ రోజు....           02-Jul-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.

 

2060* వ నాటి భార హృదయాల వీడుకోలు ఉద్విగ్నతలు!

 

          మనం చూస్తూనే ఉంటాం – మన సమాజంలో అనుకోకుండా కొన్ని, ఎన్నెన్నో పురిటి నొప్పుల – ముందస్తు ప్రణాళికలతో కొన్ని మంచివో – చెడ్డవో ఉద్యమాలు, లేదా అటువంటివి వస్తూ – పోతూ ఉంటాయి. చెడ్డవాటికి కాస్త ముందూ – వెనుకగా కాలమే మందు పూసి మాన్పిస్తుంది. అలా అవి మఖలో పుట్టి పుబ్బలో మాడిపోతాయి. చల్లపల్లిలో స్వచ్చోద్యమం వెనుక మాత్రం పెద్ద కధే ఉంది! పాతికేళ్ళ జనవిజ్ఞానవేదిక నేపధ్యం ఉంది. అంతకు ముందు నుండే ఈ ప్రాంతం వాతావరణంలో కంటికి కనిపించని ఎడం పక్ష భావజాల ప్రభావం ఉంది. అంతే గాదు. ప్రజా వైద్యం మూలతత్త్వాన్ని ఆకళించుకొన్న – నీతి నియమ మర్యాదల్ని పాటించే ఒక ప్రముఖ వైద్యుని హస్తం ఉన్నది. వీటితో బాటు కాలం పరిపక్వత కూడ ఉన్నది. కాల స్వభావాన్ని పట్టుకోగల సదరు వైద్యునికి సహకరించే – అనుసరించే కొన్ని వందల మంచి మంచి హృదయాలూ ఈ గ్రామంలో, పరిసర ప్రాంతంలోను ఉన్నవి!

 

          అందుకే ఈ చల్లపల్లి స్వచ్చ – సుందర మహోద్యమం ఆరేళ్లుగా – 2060 దినాలుగా అకుంఠితంగా – ఆదర్శంగా – అద్భుతంగా – అనుసరణయోగ్యంగా – సమస్త ప్రజారోగ్య దిక్సూచిగా – కొనసాగి విజయవంతమై నిలిచింది! ఎండ – వానలు, చలి – మంచులు, వేడి గాలులు – చలి వేళలు, కొన్ని బాలారిస్టాలు ఆపలేని ఈ ఉద్యమాన్ని చైనాలో పుట్టిన కరోనా అడ్డుకోబోతున్నది.

 

         తప్పక పాటించి తీరవలసిన ప్రభుత్వ మార్గదర్శకాలు, మన స్వచ్చంద శ్రమదాన ఉద్యమానికి కనురెప్పవంటి – ప్రభుత్వ “కరోనా నోడల్ అధికారి” ఐన అరజా శ్రీకాంత్ గారి హిత వచనాలు, గోపాళం శివన్నారాయణ వంటి డాక్టర్ల వివేచనలూ, అంతకముందు నుండే మన ఉభయ వైద్యుల – మరికొందరు కార్యకర్తల అంతర్మధనాలూ నేటి స్వచ్చ కార్యకర్తల మెజారిటీ అభిమతాలు కలిసి, మన చిరకాల ప్రజోపయుక్తమైన ఈ శుభోదయ శ్రమదానాన్ని రేపటి నుండి 30 రోజుల వరకు ఆపేసి అప్పటి పరిస్థితిని బట్టి పునః సమీక్షించుకొని సమయోచిత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించాయి.

 

          మరి – 2060 నాళ్ళ నుండి తమ ఒంటికీ – మనసుకూ సంతృప్తిదాయకమైన ఎడతెగని శ్రమదానం చేస్తున్న ఇందరు కార్యకర్తల స్పందన ఏమంటే –

 

1) తమ వీధిలో – తమ ఇంటి పరిసరాలలో ఇదే వేకువ సమయానికి ఒక్కరు గానో, ఇద్దరు గానో శుభ్రతా చర్యల కొనసాగింపు.

 

2) వాట్సాప్, ముఖ పుస్తకం వంటి మాధ్యమాలలో తమ వైయుక్తిక కృషి, అభిప్రాయాల మేళవింపు.

 

3) మనం నాటి పెంచిన వేలాది వృక్షాలలో నష్టమైన – ఎక్కడైనా ఖాళీలున్న చోట్ల కొత్త చెట్ల – పూల మొక్కల భర్తీ కోసం ట్రస్టు కార్మికులతో పాటు పరిమిత సంఖ్యలో – ఎవరైనా కొద్ది రోజుల పాటు వారికి సహకరించడం.

 

          నేడు ATM కేంద్రం వద్దకు చేరిన 25 మంది స్వచ్చ కార్యకర్తలు పై విధంగా చర్చించి, ఉమ్మడి గా నిర్ణయించి, నందేటి శ్రీనివాసుని రెండు పాటలు విని, కొద్దిపాటి శ్రమదానం చేసి, ఒకరొకరు తాత్కాలిక వీడుకోలు తీసుకొన్నారు. డాక్టరు DRK గారు జూన్ మాసపు ట్రస్టు సంబంధిత జమా ఖర్చుల వివరాలు నివేదించారు. ఇంతే సంగతులు!

 

         కర్త – కర్మ – క్రియ లెవ్వరు?

ఏ ఒకరిద్దరొ – ముగ్గురొ ఈ ఉద్యమ కర్తలనీ, బాధ్యులనీ

స్వచ్చోద్యమ భారమెల్ల వారే మోస్తుందురనీ, కర్త - కర్మ క్రియలనీ

అపోహలవసరమా? అని – అత్యద్భుత శ్రమ జీవన ఆరాధకులింత మంది

చల్లపల్లి స్వచ్చ – శుభ్ర – సౌందర్యపు హేతువులని – మూలములని....!

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

గురువారం – 02/07/2020,

చల్లపల్లి.