2063* వ రోజు ....           05-Jul-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.

          కరోనా వ్యాధి వ్యాప్తి కారణంగా స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం నిన్నటి నుండి ఒక నెల పాటు ఆపాలని తీసుకొన్న నిర్ణయం తెలిసిందే! అయితే అవకాశం ఉన్నప్పుడు పాగోలు రోడ్డులోను, శివరామపురం రోడ్డులోను, బస్టాండ్ లోను మొక్కలు నాటాలని నిర్ణయం జరిగింది.  

          ఈ ఆదివారం వేకువ జామున కూడ 14 మంది స్వచ్చ కార్యకర్తల సదాశయ శ్రమదాన కారణంగా సుమారు 200 గజాల ఒక బాట పునీతమైపోయింది. ఆ బాట క్రొత్తదేమీ కాదు, చల్లపల్లి పరిధిలోనిది కాకున్నా గత నాలుగేళ్లుగా ఈ గ్రామ స్వచ్చ సైనికుల పట్టుదలతో పది- పన్నెండు మార్లు – ఏ 150 దినాల పాటో కాపు కాయబడి, ఊడ్వబడి, వందలాది చెట్లు నాటబడి కనుల విందుగా తీర్చిదిద్దబడినదే!  అందంగా- పచ్చగా నిల్చిన చెట్లతోను, తెలవారకముందే విచ్చుకొన్న రంగు రంగుల పూలతోను, యాతాయాత జనులను రంజింపచేస్తున్నదే!

          వాస్తవానికి ఈ వేకువ కూడ 4.00 సమయంలో సన్నతుంపర పడుతూనే ఉన్నది. కరోనా విపత్తుకు తోడు నిన్నటి వేకువ ఎడ తెగని వర్షంతో దైనందిన శుభోదయ శ్రమదానం జరగక- విసుగు చెందిన కార్యకర్తలు ఈ వేకువ ఒకరొకరుగా పాగోలు మార్గంలోని మహాబోధి పాఠశాల ముఖద్వారం వద్దకు చేరుకొని, తమతో బాటు తెచ్చిన 200 పూల మొక్కలను దింపుకొని, ఆ చినుకుల్లోనే పాదులు త్రవ్వి, దారికిరుప్రక్కల 6.30 సమయానికల్లా 85 పూల మొక్కలు నాటారు. వాటిలో అధిక భాగం అడవి తంగేడు నామాంతరం గల గద్దగోరు మొక్కలే! మిగిలినవి సువర్ణ గన్నేరు, కోనో కార్పస్.

          తక్కువ మంది కార్యకర్తలతోనే ఈ ఉదయం ఎక్కువ గ్రామహిత చర్య జరిగినట్లున్నది! మూడు రకాల – అడవి తంగేడు, సువర్ణ గన్నేరు, కోనో కార్పస్ మొక్కలను వరుస క్రమంలో నాటుతూ ఒక్కో ప్రక్కన ఐదారుగురి తోనే క్రొత్త మొక్కలు క్రమశిక్షణతో  కొలువు తీరినవి. క్రింద నేలలో తేమకు తోడు పై నుండి రాలుతున్న చినుకుల వల్ల నాటే మొక్కల పాదుల్లో నీరుపోసే అవసరం కలగలేదు. కోవిడ్ విలయంలో తమ మధ్యదూరం పాటిస్తూ ముఖానికి మాస్కులు కట్టుకొని, మెలకువతో చేసిన శ్రమదానం ఇది!

          నేటి మరొక విశేషం 65 ఏళ్లు నిండిన- కొంత సందడి చేసే అలవాటున్న  మన స్వచ్చ కార్యకర్త కోడూరు వేంకటేశ్వర రావు గారి జన్మదిన సంఘటన. ఆ తీపి గుర్తుగా తన సహ కార్యకర్తల అభినందనల నడుమ- అందరికి మిఠాయిలు పంచి మనకోసం మనం ట్రస్టు ఖర్చుల నిమిత్తం 520/- విరాళమిచ్చినందుకు స్వచ్చోద్యమ సుందర చల్లపల్లి పక్షాన మన అభినందన మందారం!  ఈయన ఇంకా 35 జన్మ దినోత్సవాలు, అంత వరకూ స్వచ్చంద శ్రమదానం చేస్తూ- మిత్ర కార్యకర్తలకు ఇలాగే జన్మదిన విందులు చేస్తూ, అభినందనలు అందుకొంటూ ముందుకు సాగవలసి ఉన్నది!

        అబ్దుల్ కలాం ప్రవచనం

కలలు కనుట అవసరమే కలాం చెప్పినట్లుగా

సాకారం చేసుకొనుటె చాల కష్టమంటగా

ఇష్టమైన కష్ట సాధ్యమిది మన గ్రామాభ్యుదయం

చల్లపల్లి కార్యకర్త సాధించిన ఘన విజయం!

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

ఆదివారం – 05/07/2020,

చల్లపల్లి.