06.07.2020 ....           06-Jul-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.

 

నేటి ముచ్చట్లు

 

            ఈ నాటి వేకువ జామున – 4.09 నిముషాల సమయంలో మహాబోధి పాఠశాల ప్రవేశ ద్వారం దగ్గరకు పూర్తి సన్నద్ధులై చేరుకొన్న 17 మంది స్వచ్చ సైనికులలో నలుగురు పాగోలు గ్రామస్తులు కూడ ఉన్నారు. పార, గునపాలే ప్రధాన ఆయుధాలుగా – స్వచ్చ – సుందర టోపీలు వాన చినుకుల నుండి శిరఃత్రాణాలుగా – చేతి తొడుగులు  అపరిశుభ్రతా కవచాలుగా – హరిత సుందరీకరణ కార్యరంగంలో దిగారు.

 

            నిన్న నాటిన 85 పూల మొక్కల దగ్గర నుండి పాగోలు గ్రామం దిశగా వీరి పురోగమనం రహదారి తొలి మలుపు దాక సాగింది. ఎక్కువ మొక్కలు కుడి ప్రక్కనే కొలువుతీరాయి. ఈ రోజు నాటిన 73 మొక్కలలో అడవి తంగేడు, కోనో కార్పస్, మలేషియా వేప, వేప వంటి జాతులున్నాయి! ఈ రాత్రి పెద్ద వర్షమే పడి, కార్యకర్తల వ్యవసాయానికి అడ్డుపడకుండ చినుకు - చినుకుగా పడుతూ, చల్లని ఆహ్లాదకర వాతావరణ నేపధ్యంలో కూడా కొందరు కార్యకర్తల బట్టలు చెమటతో తడిశాయి. ఈ కృషీవలులు రహదారి సుందరీకరణ కోసం గుంటలు త్రవ్వి, మట్టిలాగి మొక్కలు నాటడానికి ఇంతకన్న మంచి అదను మరేముంటుంది? అందుకే తమ 30 రోజుల స్వచ్చోద్యమ విరామాన్ని తాత్కాలికంగా విరమించి, నిన్న – ఈ దినం ఈ పాగోలు దారిలో 158 నీడనిచ్చే మొక్కలు, రంగురంగుల పూల మొక్కలు నాటే పనిమాత్రం చేపట్టారు.

 

            ఇద్దరిద్దరు చొప్పున రోడ్డు కిరువైపులా ఐదారు ముఠాలుగా చీలి, వరుస క్రమంలో – ఏ మొక్క తరువాత దేనిని నాటాలో గణించుకొంటూ – చిన్న చిన్న చతురోక్తులాడుకుంటూ – 6.15 నిముషాల దాక – 2 గంటల పాటు సాగిన వీరి ప్రయోజనకర శ్రమదానం నాకైతే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది! ఇద్దరు కార్యకర్తలు మాత్రం దారి అంచుల్లో పెరుగుతున్న దోమల కంపను, దురద గొండి మొక్కలను తొలగించారు.

 

            చల్లపల్లి లో తప్ప – తత్ప్రభావిత 30 గ్రామాలలో కాక – యావద్దేశంలో – ఇలాంటి గ్రామ ప్రయోజనకర నిస్వార్ధ శ్రమత్యాగాలు ఎక్కడైనా జరుగుతున్నాయనుకోను.

 

            కాఫీ – తేనేటి ఆస్వాదనా సమయంలో – రేపటి హరిత సుందరీకరణ కృషి కోసం పెదకళ్లేపల్లి మార్గంలోని మేకలడొంక వంతెన దగ్గర వేకువనే – (భారీ వర్షం లేనిచో) కలుసుకోవాలని నిర్ణయమైంది.

 

            నిన్న కార్యకర్తల నడుమ 65 వ జన్మదినాన్ని జరుపుకొని, ఆల్ఫాహార పంపిణీ చేసి, మనకోసం మనం ట్రస్టుకు 520/- విరాళమిచ్చింది కాక కోడూరు (చెక్ పోస్ట్) వేంకటేశ్వరరావు గారు నేడు మరొక మారు నెలవారీ 520/- విరాళాన్ని మేనేజింగ్ ట్రస్టీకి నగదుగా ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  

        సమాజ విజయకేతనాలు.

రావచ్చును దేశకాల ప్రాంతములందున మార్పులు

కావచ్చును సామాజిక కర్తవ్యంలో చేర్పులు

జనహితైక దృష్టి తోడ సాగిన స్వచ్చోద్యమాలు

ఔనన్నా కాదన్నా అవే విజయ కేతనాలు!  

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

సోమవారం – 06/07/2020,

చల్లపల్లి.