07.07.2020....           07-Jul-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.

 

07.07.2020 వ నాటి హరిత – పూల సుందరీకరణ

 

          ఈ వేకువ 4.15 కు మొదలైన గ్రామ రహదార్ల హరిత సుందరీకరణం 6.18 దాక కొనసాగింది. నిన్నటి నిర్ణయానుసారం 18 మంది కార్యకర్తల బృందం పెదకళ్లేపల్లి మార్గంలోని మేకల డొంక వంతెన మొదలుకొని శివరామపురం దిశగా దారికి రెండు ప్రక్కల 73 మొక్కలు నాటారు. బిళ్ళ గన్నేరు పూల మొక్కలు ఈ సంఖ్యకు అదనం – ఎందుకంటే – అవి అసంఖ్యాకం!

         

          నేను గమనించే సమయానికి – అంటే – ఉదయం 5.20 కి ఆ వంతెన దగ్గర నుండి బాట అందగింపులు చేస్తున్న సుందరీకరణ బృందం తమ పనిలో ఎంతగా లీనమైపోయినదంటే... దానికి శంకర శాస్త్రి గారి వాట్సాప్ ఛాయా చిత్రాలే సాక్ష్యం!

 

- ఒక యువతి ఆ తడిలోనే – బురదలోనే కూర్చొని, కుదురు కొని వందలాది బిళ్ళగన్నేరు మొక్కల నుండి రంగు పూలను బట్టి ఎంచి, విభాగించడం చూస్తే – నా చిన్న వయసులో మా చేనిలో నాటేందుకు పొగ నారును లెక్కించడం గుర్తుకు వచ్చింది! ఇద్దరు స్వచ్చ సుందర కార్మికులైతే – అనుభవజ్ఞులైన రైతులు తిన్నగా – అందంగా నాగలితో కొండ్ర దున్నినట్లు పారలతో వంచిన నడుములు ఎత్తక పూల మొక్కల పాదుల కోసం గాడి త్రవ్వేస్తున్నారు.

 

- మరొక 50 గజాలు ముందుకు – దక్షిణంగా వెళ్ళితే – పది మంది కార్యకర్తలు – అంతకు ముందు బాగా పెరిగినవి కాక గద్దగోరు, వేప మొక్కలకు – పాదులు తీసి నాటుతున్నారు. మన స్వచ్చ సుందర హరిత చల్లపల్లిలో సుదీర్ఘ కాలంగా గడించిన అనుభవంతో వీళ్ళిప్పుడు ఎన్నెన్నో చెట్ల, పూల మొక్కల, పేర్లను, చరిత్రను, వైఖరులను పోల్చగలరు – వివరింపగలరు. 2065 రోజులుగా ఈ స్వచ్చోద్యమ చల్లపల్లి కార్యకర్తలు ప్రకృతికి సన్నిహితులు గదా మరి!

 

          కరోనా ప్రమాద ఘంటికల వల్ల అనివార్యంగా 30 రోజులు శ్రమదాన వాయిదాను ప్రతిపాదించారు గాని, వందలాది మొక్కలు అప్పటికి మిగిలిపోయినందున కేవలం సగం మంది కార్యకర్తలే ఐదారుదినాలుగా ఆ బాధ్యతలను – ముఖ తొడుగులు, సామాజిక దూరం వంటి సకల నిబంధనలను పాటిస్తూనే నిర్వహిస్తున్నారు.

         

          ఈ నాటి రహదారి పునః సుందరీకరణలో ఇద్దరు సీనియర్ కార్యకర్తల నిమ్మ పండ్ల వితరణ యధావిధిగా జరిగిపోయింది.

 

          రేపటి హరిత సుందరీకరణ ప్రయత్నం కూడ మేకలడొంక వంతెన ప్రాంతంలోనే ఉంటుంది!

 

          స్వచ్చ సైన్యం అడుగుజాడలు

సకల వ్యక్తుల – కాల మహిమల సమాహారం ఈ సమాజం

నేర్చుకొంటూ – నిగ్గుదేల్చుతు – నిన్ను నన్నూ చక్కదిద్దే

సమాజానికి నడక నేర్పెను స్వచ్చ సైనిక శ్రమ విధానం

అనుసరింపుడు – అనుకరింపుడు స్వచ్చ సైన్యం అడుగుజాడలు!

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

మంగళవారం – 07/07/2020,

చల్లపల్లి.