08.07.2020....           08-Jul-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.

 

08.07.2020 వ నాటి పునః – సుందరీకరణలు

 

            ఈ వేకువ జామున 4.09 – 6.10 సమయాన – పెదకళ్లేపల్లి మార్గాన – మేకలడొంక సమీపాన – గత రెండునాళ్ళ తరువాయిగా వివిధ జాతుల వృక్షాలనో, పూల మొక్కలనో నాటే కృషిలోన పాలుపంచుకొన్న ధన్యులు 16 మంది. ఈ బ్రహ్మముహూర్తాన వీరి శ్రమదానంతో మరింతగా ధన్యమైన దారి 400 గజాల మేర!

 

            గత నాలుగేళ్లుగా పలుమారులు – పలువిధాల 3 కిలోమీటర్లకు పైగా నిడివి గల ఈ రహదారిలో స్వచ్చ కార్యకర్తలు ఊడ్చే ఉండవచ్చు. డ్రైన్లను విసుగుచెందక మరీ మరీ శుభ్రపరిచే ఉంటారు; పిచ్చి – ముళ్ళ మొక్కల్ని, దురద గొండి చెట్లను, కొబ్బరి బొండాల అవశేషాలను, ఎన్నెన్నో పర్యావరణ హానికర తుక్కుల్ని, ఖాళీ మద్యం సీసాలను, నరికి, గడ్డిని చెక్కి, దారి మీద, ప్రక్కల గుంటల్ని సరిజేసి కూడ ఉండవచ్చు గాక – స్వచ్చ శుభ్రతలను శ్వాసించే, అడుగడుగున సౌందర్యాన్ని – ఆహ్లాదాన్ని ఆరాధించే – స్పష్టించే తమ చిరకాలపు అలవాటును వీరు ఒక్కసారిగా మానుకోలేరు! గ్రామాభ్యుదయం పట్ల వాళ్ళ ఆప్యాయత, అనుబంధత, నిబద్దత, బలహీనత అదే మరి! గ్రామం నుండి, గ్రామ సమాజం నుండి తమ స్వీకారానికి రెట్టింపుగా సమర్పించిన ధన్యత కూడ అదే అనుకోవచ్చు!

 

- ఇందుకనుగుణంగానే – కరోనా ప్రమాదం ఉరుముతున్నా - ఈ బాట చల్లపల్లికి చెందకున్నా వీరు నేడు కూడ మరొక మారు – ఈ 21 వ శతాబ్దంలో అశోకుని ప్రతిరూపాలై – దారి సౌందర్యం కోసం 74 గద్ద గోరు, వేప మొక్కలు విజయవంతంగా నాటారు. ఈ కొద్ది మందే ఐదారు జట్లుగా మారి, పని విభజన చేసుకొని, ప్రధానంగా రోడ్డుకు పడమర గట్టు లోతట్టున ఇన్ని పూల మొక్కలు నాటడం చిన్న సంగతేమీ కాదు.

 

- మేకల డొంక దగ్గరి వంతెన సమీపంలో సుందరీకరణ పంచపాండవులు రోడ్డుకు ఉభయదిశలను అద్దంలా మార్చి మరికొన్ని వందల రంగురంగుల బిళ్ళ గన్నేరు మొక్కల వరుసలు తీర్చి దిద్దారు! ఇవి పైన ప్రస్తావించిన 74 మొక్కలకు అదనం!

 

            మొత్తానికీ ఆ మధ్య కొన్న – మిగిలిపోయిన అన్ని రకాల మొక్కల ప్రతిష్టాపన ఇప్పటికైతే ముగిసినట్లే – కొద్దిగానే మిగిలినట్లున్నవి. మరి ఇతర రహదార్లలో వచ్చిన, రాబోతున్న ఖాళీల సంగతేమిటి?

 

            రేపటి హరిత సౌందర్య సాధన కోసం మేకలడొంక వంతెన దగ్గరే మనం కలుసుకోవచ్చు. కొన్ని తుక్కు గుట్టలు, మరికొన్ని తుది మెరుగులు మనకోసం ఎదురు చూస్తుంటాయి!

 

          స్వచ్చ – శుభ్రత సమారాధన

స్వచ్చ సైన్యం గ్రామ శుభ్రత సమారాధన చేసి పెడితే –

ట్రస్టు మనుషులు ఊరినంతా రాగరంజితముగ మలిస్తే -

అనుభవిస్తివి ఇంత కాలం ఆ సమగ్ర కృషికి ఫలితం!

అనుసరింపుము – అనుకరింపుము స్వచ్చ సైన్యం అడుగుజాడలు!!

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

బుధవారం – 08/07/2020,

చల్లపల్లి.