2211* వ రోజు ....           22-Aug-2021

 ఒక్కసారి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

2211* వ నాటి శ్రమదాన చమత్కారాలు.

 

ఆదివారం (22.08.2021) ముందు రాత్రి ముసురు వర్షం కురిసినా- కాలుష్యపు రణ క్షేత్రం(బండ్రేవుకోడు కాలువ ఉత్తరపు గట్టు) బురద-నీటిలో కాలు జారుతున్నా-పాతిక మంది కార్యకర్తలు మాత్రం సొంత ఊరి బాధ్యతను మరువలేదు. కాకపోతే – చేసే పనికి ఆటంకం కలిగి, వారనుకొన్న లక్ష్యం మాత్రం కొంత మిగిలిపోయింది. గంగులవారిపాలెం బాటకు తూర్పున పొలం వైపు సుందరీకరణ మాత్రం సజావుగానే సాగింది.

 

            నేనేదో సూక్ష్మం లో మోక్షం అన్నట్లు కొన్ని విన్యాసాలను కొంతవరకు వివరిస్తున్నాను గాని, అందుకు తోడు శాస్త్రి గారి వాట్సాప్ ఛాయా చిత్రాలు మరికొన్ని విశేషాలను ప్రదర్శిస్తున్నవి గాని, నేటి కార్యకర్తల గ్రామ మెరుగుదల దీక్షను, 2 గంటల పాటు ఆవిష్కృతమైన స్వచ్చ-శుభ్ర-సుందరీకరణ వేడుకను సంపూర్ణంగా వివరించలేకపోతున్నాం. నా వ్రాతగాని, ఛాయా చిత్రాలు గాని వర్ణించేది కంటికి కనిపించే కృషిని మాత్రమే- కార్యకర్తల ఆంతర్యాన్ని, ఆదర్శప్రాయమైన స్ఫూర్తిని కాదు.

 

            3 తరాల నాటి భగత్ సింగ్ వంటి దేశభక్తులు స్వాతంత్ర్యం కోసం ఉరి కొయ్యల మీద ఊయల లూగారని చదివాం. ఇప్పటి దేశ భక్తికి చిహ్నమైన ఈ గ్రామ సామాజిక బాధ్యతా నిర్వాహకులు చెట్టు కొమ్మలెక్కి (క్రింద మురుగు అగాధం!) కాలుష్య మూల కారకాల్ని నిర్మూలిస్తూ-సరదాగా ఊయలలూగడం గమనించాను. ఇవాల్టి వేకువ చీకటిలో- చిత్తడిలో పనికిదిగిన వాళ్లకు కాలు నిలువక జారుతుండడమూ, పని ముట్ల పట్టు జారడమూ జరుగుతూనే ఉన్నది. ఐనా సరే-ఒకరికొకరు చేయూతనివ్వడమూ, సహకరించడమూ, తల పెట్టిన పని పూర్తికావడమూ విశేషమే మరి!

 

            6.20 కి పని ముగిసి, వెలుతురులో నేటి పని ఫలితం చూసినప్పుడు మాత్రం ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగాయి. కాళ్లకూ – కాలి బూట్లకూ, బట్టలకూ బురద, బురద నీళ్లు అంటుకోవడమూ-10 నిముషాల పాటు శుభ్ర పరచుకోవడమూ, 6.30 కి కాఫీలు ముగించి, పలనాటి భాస్కరుడు ముమ్మారు ధృఢంగా వెలిబుచ్చిన గ్రామ స్వచ్చ-పరిశుభ్ర-సౌందర్య సంకల్ప నినాదాలకు తోడు నందేటి శ్రీనివాసు చేసిన ఉత్తేజకర గేయాలాపనతో నేటి మన కర్తవ్యం బుధవారం నాటికి వాయిదా పడింది.

 

            పనిలో మునిగిన కార్యకర్తలకు పని ముగియక ముందే పల్నాటి అన్నపూర్ణ గ్లాసుల కొద్దీ చిక్కని, కమ్మని పాయసం లాంటి రాగిజావ ను నయాన-భయాన త్రాగించడం నేటి మరొక విశేషం!

 

            25.08.2021 వ నాటి (బుధవారం) వేకువ మనం పూనుకొని, పూర్తి చేయవలసిన మురుగు కాలువ ఉత్తరపు గట్టు పరిశుభ్రత కోసం ఈ వంతెన దగ్గరే కలుద్దాం.   

   

            ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 2

 పేరుకే ఇది గొప్పదేశం-వేనవేలుగ సమస్యలతో –పీట ముడులతొ

కునారిల్లే బీద దేశం-స్వచ్చ శుభ్రత లెపుడొ మరచిన మురికిదేశం

ఒక్క గ్రామము నుదాహరణగ-స్వచ్చ-శుభ్ర-స సుందరంగా

తీర్చి దిద్దుటకై శ్రమించే ధీరులకు నా తొలి ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

22.08.2021.