2212* వ రోజు ....           25-Aug-2021

 ఒక్కసారి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

కార్యకర్తల శ్రమ వైభవం వయస్సు నేటికి 2212* రోజులు.

 

            ఈ బుధవారం (25.08.2021) నాటికి పరిమితం కాని స్వచ్చంద సైనికుల గ్రామ మెరుగుదల కార్యక్రమం ఈ ఒక్క గంగులవారిపాలెం బాటలోనే నెల రోజులకు పైగా నడుస్తున్నది. వేకువ 4.21 కి కాబోలు – 14 మందితో శుభారంభమై – త్వరిత గతితో 10 మంది వచ్చి చేరి, 6.10 దాక – ఇంచు మించు 2 గంటల విలువైన శ్రమదానంతో కిలోమీటరు పర్యంతం – అటు బందరు రహదారి మొదలు ఇటు మురుగు కాలువ వంతెన దాక – ఆహ్లాదకర హరిత వర్ణంతో – ఆరోగ్యకర సుమ శోభిత ఉభయ దరులతో – శుభ్రతతో ఆకట్టుకొంటున్నది. ఇంతేనా – కిలోమీటరు పైగా బండ్రేవు కోడు కాలువ రెండు గట్లు నడకకు యోగ్యంగా – దర్శన భాగ్యంగా కనువిందు చేస్తున్నవి!

 

            గత ఆదివారం సుదూర వైవాహిక కారణాన రాజాలని కార్యకర్తలీరోజు ఆ లోటును భర్తీ చేశారు. ఎన్నాళ్లైనా “సూర్య చంద్రుల గతులు మారవు – భూమి పయనం ఆగిపోవదు. కార్యకర్తలు శ్రమను ఆపరు...” వీటికి సమాంతరంగా అవగాహనారహిత వ్యక్తులేమో ఇంత అందమైన రోడ్లను ప్లాస్టిక్ సంచులతో, బిరియాని పొట్లాలతో, ఎంగిలాకులతో జుగుప్సాకరంగా చెడగొట్టడమూ ఆపరు! ఐనా ఈ భూలోక ప్రకృతి మాత్రం తనకు జరిగే ఇన్ని అపచారాలనూ ఇంత వరకు సహిస్తూనే ఉన్నది.

 

            ఇక – ఈనాడు స్వచ్చంద శ్రమదాతల వైఖరేమంటే – ఇందులో 18 – 20 మంది గత ఆదివారం మురుగు కాల్వ మీది క్రొత్త వంతెన దాక తాము శుభ్రపరచాలనుకొన్నది మిగిలిపోగా – దాన్ని నేటి పని ముగింపు సమయానికి ముందే పూర్తి చేశారు :

 

- మురుగుడు కంపను చాల వరకు తొలగించి, కాలువ నీటి అంచు మీద అమర్చడం,,

 

- వెక్కిరిస్తున్న తాటి చెట్ల మట్టలు నరికి, సుందరీకరించడం,

 

- పనికొచ్చే వేప, గోరింట వంటి మొక్కల్ని కొమ్మలు చెలిగి, పాదులు చేసి మిగల్చడం.

 

- కాల్వ గట్టు ప్రక్క రైతులు గట్టు మీద పెంచే గడ్డి, జొన్నల జోలికి పోక – కలుపు, పిచ్చి మొక్కల్ని మాత్రం ఏరివేయడం,

 

- షరా మామూలుగా ఎక్కడబడితే అక్కడ దొరికే ఖాళీ మద్యం సీసాలను ఏరడం –

 

            వంటి పారిశుధ్య చర్యల్ని స్వచ్ఛ కార్యకర్తల కంటే శ్రద్ధగా మరెవరు చేస్తారు?  

           

            ఇక్కడికి దూరంగా – ఇదే బాటలో సుందరీకరణ విభాగం కూడ రోడ్డు ఊడ్చీ, అక్కడక్కడ ఎత్తు పల్లాలను సమం చేసీ, పూల మొక్కలనాదరించీ, చెట్ల కొమ్మలు కత్తిరించీ .... వాళ్ళ విధులు నెరవేర్చారు.

 

            6.30 సమయంలో గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య – సౌభాగ్య సంకల్పాన్ని మూడు మార్లు నినదించినది ఉస్మాన్ షరీఫ్ గారు; లౌవ్లీ గారు తెచ్చి పంచిన గోంగూర, కరివేపాకు రావెళ్ల శివరామకృష్ణయ్య గారి తాలూకు; జామకాయలేమో ట్రస్టు ఉద్యోగి ఆనందరావు గారివి; నేటి స్వచ్చోద్యమ సమీక్ష, రేపటి కార్యక్రమ సూచనలైతే డాక్టరు DRK గారివి!

 

            రేపటి మొక్కలు నాటే బాధ్యత సైతం ఈ గంగులవారిపాలెం వంతెన దగ్గర నుండే మొదలు.

   

            ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 3

ఒకే త్రాటను – ఒకే మాటను – ఒకే బాటను నడుస్తున్నరు

ఒడుదొడుకు లెన్నెన్ని వచ్చిన స్వచ్ఛయత్నం వీడకున్నరు

యుగ స్వభావం తెలుసుకున్నరు – క్షేత్ర మందే నిలుస్తున్నరు

స్వచ్ఛ సంస్కృతికై తపించే సాహసికులకు నా ప్రణామం!  

   

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

23.08.2021.