ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!
అష్టాదశ కార్యకర్తల అపూర్వ శ్రమదానం - @2213* రోజులు.
ఈ శ్రావణ శుక్రవారం వేళ – అధ్యాత్మికుల ఆశావాహ శుభోదయాన 27.08.2021 – వేకువ 4.22 బ్రహ్మముహూర్తాన - చల్లపల్లి స్వచ్చోద్యమకర్తల అనుభూతులేవనుకొన్నారు? చిట్టడవిని గుర్తు చేస్తున్న బండ్రేవు కోడు కాలువ గట్లను రెండు వారాల పాటు శ్రమించి శుభ్ర – సుందరీకృతం చేశాక వంతెనకు తూర్పుగా రెండు దరులను – క్రమ శిక్షణ గల ఎర్ర తురాయి, అడవి తంగేడు రంగురంగుల పూల మొక్కలు తీర్చిదిద్దాలనే గదా వాళ్ల ప్రణాళిక! దాన్ని కాస్తా ఈనాడు విజయవంతంగా ముగించారు.
ఈ దినం ప్రకృతి బాగా అనుకూలించింది. కొంచెం తడి – పొడిగా ఉన్న నేల పాదులు త్రవ్వడానికనువుగా ఉన్నది. 20 అడుగులకొక తురాయిని, వాటి నడుమ అడవి తంగేడు మొక్కల్ని నాటారు. వంద నిముషాల సమయం ఇందరు వాలంటీర్లది పండుగ వాతావరణమే! ఛలోక్తులు, పరస్పర హెచ్చరికలు, సందర్భానుగుణంగా సామెతలు, మరీ ముఖ్యంగా – అరుదుగా కొందరి పల్లెటూరి నాటు తెలుగు వాడుకలు, అప్పుడప్పుడు నవ్వుల పువ్వులు చోటు చేసుకొన్న తరుణమిది. ఐతే – ఎవరి కోసం, ఎందుకోసం ఈ తాత్త్విక బల సంపన్నులు ఇన్ని వేల రోజులుగా – తమవి కాని చోటులన్నిటినీ పట్టుబట్టి మరీ బాగు చేస్తారో – ఎవరి బాధ్యతలు, హక్కులేవో ఆలోచించే గ్రామస్తులెందరు?
నెల రోజులు పైగా ఈ గంగులవారిపాలెం బాటలో శ్రమించి, తాము గుర్తుంచుకోదగిన రీతిలో – గ్రామస్తులు ఆహ్లాద భరితంగా తిరుగాడదగినట్లుగా వేయికి పైగా పని గంటల పాటు తీర్చిదిద్దిన ఈ మార్గం మరి ఇప్పుడెట్లా ఉంది? చెట్లన్నీ ఒద్దికగా ఉన్నాయి. రంగురంగుల పూల మొక్కలకు చిరు నవ్వుల పూలు విరబూస్తున్నాయి. మురుగు కాల్వ కుంటగుండా సాఫీగా పరిగెడుతున్నది. దాని గట్ల మీదవి ఇప్పటికి మొక్కలే గాని, కొన్ని నెలలకు పెరిగి, పూసినప్పటి సుందర ఊహా దృశ్యం ఊరిస్తున్నది! చెత్త లేదు – ప్లాస్టిక్ తుక్కులు లేవు. త్రాగి పారేసిన సారా సీసాలు కూడ ఇప్పుడిక్కడ లేనేలేవు. వీధంటే ఇదే గదా – ఊరంటే ఇలాగే ఉండాలి కదా – అనిపించడం లేదా – ఈ 2 కిలోమీటర్ల స్వచ్ఛ – సుందర మార్గాన్ని చూస్తుంటే?
కాఫీ – విలాసాల తరువాత – కార్యకర్తల దైనందిన తుది సమావేశంలో ముమ్మారు తమ నివాస గ్రామ స్వచ్ఛ – పరిశుభ్ర – సౌందర్యాల సాధనా సంకల్పాన్ని నినదించిన వారు గంధం బృందావన కుమారుడు. దీటుగా ప్రతిస్పందించిన వారు మిగిలిన కార్యకర్తలు. యదావిధిగా నిమ్మ పళ్ళు, కరివేపాకులు పంచినది నేను. స్వచ్చోద్యమ సారధి పరోక్షంలో – స్వయం సమీక్ష జరుపుకొన్నది కొందరు కార్యకర్తలు.
రేపటి గ్రామ బాధ్యతా స్థల నిర్ణయం కోసం కాస్త తర్జన భర్జనల పిదప శనివారం వేకువ మనం కలవదగిన చోటుగా నిర్ణయించింది అస్మదీయ గృహ – పద్మాభిరామ ప్రాంతం.
ఏ ఉద్యమ మందైనా....
స్వచ్చోద్యమ చల్లపల్లి సాధించిన విజయమేది?
ఆ సుదీర్ఘ ఉద్యమాన అసలగు వైఫల్యమేది?
గ్రామ స్వచ్ఛ – శుభ్ర దీప్తి ఘన విజయం అనుకొంటే –
అత్యధికుల దూరస్థితి అపజయ మనుకోవచ్చా?
ఒక ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కార్యకర్త
27.08.2021.