ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం!
స్వచ్ఛ – సుందరోద్యమ చల్లపల్లి శ్రమదాన విశేషాలు @2215*.
ఆదివారం(29.08.2021) నాటి వేకువ శ్రమదాన ప్రారంభ వేళ 4.22.
శ్రామికుల సంఖ్య-బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థినులతో సహా-36 మంది.
పునః పునః శుభ్ర-సుందరీకృత వీధి గంగులవారిపాలెం దిశగా-భవఘ్ని నగర్ దాక.
వాతావరణం ఆహ్లాదకరం. వరుణదేవుని పరామర్శ-రెండుమూడు మార్లు. ఫలితం-ఐదారు వారాలుగా కార్యకర్తలు పట్టి పట్టి, వెదకి వెదకి, ఊడ్చి,ఏరి, అసలే అద్దంలా రూపొందిన రెండుమూడు వందల గజాల బాట ఇప్పుడు మరింత ఇంపుగా-చూస్తే తప్ప నమ్మలేనంత సొంపుగా మారిపోవడం!
ప్రతి వేకువన ఈ గ్రామంలో జరిగే స్వచ్ఛంద శ్రమదాన వేడుక కూడ ప్రత్యేకమే! అదొక స్వయం సమృద్ధ సజీవ సంచార స్వచ్చ-సుందరీకరణ ప్రయోగశాల! ఆ దళంలో కాలుష్యం మీద యుద్ధ సన్నద్ధులైన చతురంగ బలాలుంటాయి! కత్తులు, దంతెలు,చీపుళ్లు, ట్రాక్టర్లు, చిన్నపాటి యంత్రాలు, గడ కత్తులు, నీళ్ల కాన్లు, మందులు, చేతొడుగులు, తలదీపాలు వంటివన్నీ ఉంటాయి. బురద,ముళ్ల చెట్లు, మురుగు కాల్వలు, గడ్డి వంటి వివిధ సందర్భాలలో ఎప్పుడు-ఏ ఆయుధాలను-ఎలా-ఎంతమేర ప్రయోగించాలో తెలిసిన ప్రయోక్తలుంటారు. ఐతే అందరి ఉమ్మడి లక్ష్యమూ స్వగ్రామ స్వస్తతా సంక్షేమమే! ఇష్టపడి తప్ప-ఈ నిస్వార్థ గ్రామసేవ నెవ్వరూ కష్టపడి, తప్పని సరి తద్దినంగా – మొక్కుబడిగా చేయరు!
అందుకే 2215 * రోజులైనా ఈ కార్యక్రమం వన్నె తగ్గని ఆదర్శ గ్రామ సామాజిక-సామూహిక శ్రమ జీవన సౌందర్యానికి కొక సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది! సామాజిక అభిరుచి ఉన్న వాళ్లను ఎక్కడెక్కడినుండో ఆకర్షిస్తున్నది!
ముఖ గ్రంథం(ఫేస్ బుక్) లాంటి మాధ్యమాల్లో చూడడం కాక-ప్రత్యక్షంగా చూసి, పాల్గొనేందుకు అలా వచ్చిన ఐదుగురు యువతులు-వ్యవసాయ పట్టభద్ర విద్యార్థినులు ఆసాంతం ఆసక్తిగా- చెమటలు పడుతూ పని చేయడం నేటి విశేషం. సమీక్షా సమావేశంలో వీరంతా తమ ఆనందానుభూతిని వెల్లడించారు. కార్యకర్తల ఈనాటి కృషి ఒక్కటే గాక-గత ఐదారు వారాల గంగులవారిపాలెం బాటలోని ప్రయత్నాన్నీ ప్రస్తావించి డాక్టరు దాసరి రామకృష్ణ ప్రసాదు గారు రేపటి ప్రణాళికను గూడ నిర్దేశించారు- చాలనాళ్లుగా కార్యకర్తల కోసం ఎదురు చూస్తున్న బందరు రోడ్డులోని ATM కేంద్రం దగ్గరే మన రేపటి వేకువ కలయిక అని.
ఈనాటి 6.30 వేళ సమీక్షా సమావేశంలో స్పష్టంగా
మూడుమార్లు గ్రామ స్వచ్చ-పరిశుభ్ర-సౌందర్య సాధనా సంకల్పనినాదాలను ప్రకటించినది దాసరి-(దుబాయి)-స్నేహ గారు. ఈ స్వచ్చోద్యమం పట్ల తన అభినివేశాన్నీ –గత మూడు నెలల నుండి పాల్గొంటున్న తన ఆనందాన్ని ఆమె వివరిస్తుంటే-చల్లపల్లి గ్రామ స్వస్తతా భవితవ్యం పట్ల కార్యకర్తలకు మరింత నమ్మకం,ఉత్సాహం సమకూరినవి. ఆ తదుపరి మదర్పిత అల్పాహార ఆస్వాదనకు గాను అతిథి కార్యకర్తలకు మా కృతజ్ఞతాభివందనాలు!
(సోమవారం వేకువ మన గమ్యం ATM కేంద్రం.)
శ్రమదానం- అదెమూలం
కనువిందగు శ్రమదానం కనిపిస్తే చిరకాలం
దారుల-వీధుల-డ్రైనుల కాలుష్యం మటుమాయం
చల్లపల్లి అణువణువున స్వచ్ఛత ఇక సుసాధ్యం
ఆహ్లాదం-ఆరోగ్యం-ఆనందపు తాండవం!
ఒక ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కార్యకర్త
29.08.2021.