ప్రాతూరి శాస్త్రి 21.08.2020. ....           21-Aug-2020

   

స్వచ్ఛ చల్లపల్లి

అందాల హరివిల్లు మన చల్లపల్లి

800 వ రోజు కై  4 రోజుల ముందు సమావేశమైన కార్యకర్తలు. 

పాఠశాలల విద్యార్దులతో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. కనీసం 800 మంది ఉండాలని , అందరూ srysp college నుండి గ్రామంలో నినాదాలతో పాదయాత్ర జరపాలని తలచారు.

 చల్లపల్లి లోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కలిసి సందర్భం చెప్పగా నినాదాల ప్లకార్డ్ లు తామే తయారుచేసి విద్యార్థులతో వస్తామని తెలిపారు.

 800 రోజు మధ్యాహ్నం 3 గం.కు srysp college లో ముందు భాగం లో వరుసక్రమంగా నిలబడినారు.

 ర్యాలీలో కార్యకర్తలు, గ్రామాధికారులు, విద్యార్ధులతో పాటు వారివారి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ర్యాలీ కాలేజీ నుండి చల్లపల్లి సెంటరు, బస్టాండు, కోట , పోతురాజు గుడి , బ్రహ్మం గారి గుడి ఎదురు సందుల నుండి తిరుగుతూ నినాదాలు చెపుతూ శ్యామలాంబ గుడి, కోట గుమ్మం నుండి వారి పాఠశాలలకు విద్యార్థులు చేరినారు.

గ్రామ ప్రజలంతా ఆనందిస్తూ కొంతమంది ర్యాలీలో పాల్గొంటూ ర్యాలీని దిగ్విజయం చేశారు.

  నా జీవితంలో మరో మలుపు......

మా పెద్ద కుమారుడు విద్యాసాగర్ కి స్వచ్ఛఆంధ్ర కమీషన్ లో Personal Secretary  గా ట్రాన్స్ఫర్ అయింది. రెండు సంవత్సరాలు కలిసి ఉన్నాము.

తనతో విజయవాడ వచ్చేయమన్నాడు. నాకు చల్లపల్లి లోనే ఉండాలని ఉంది వుంటానన్నాను. డాక్టర్ గార్లకు కూడా చెప్పాడు.

మరుసటిరోజు ఉదయపు సమావేశంలో డాక్టర్ గారు విషయం చెప్పారు. శాస్త్రి గారు విజయవాడ వెళ్లిపోతున్నారని. కానీ స్వచ్ఛ కుంటుంబీకులు ఒప్పుకోలేదు. మాతోపాటే ఉండాలి ఉంటారన్నారు.

ఆశ చిగురించింది. జీవితానికి ప్రశాంతత లభించింది.

               ...900 వ రోజు...

నిస్వార్ధసేవకు పట్టంకట్టడం ఎప్పుడో విన్నాం

ఇప్పుడు చూస్తున్నాం

దేశంలోనే కనీవినని వింతలు డబ్బుకు లోకం దాసోహం అనే విన్నాం, చూసాం.

నిస్వార్ధనికి కూడా లోకం దాసోహం అంటుంది.

900 రోజుల సేవ అదీ వేకువ 4.30ని.నుండి 6.30ని.వరకు 50 మందికి తక్కువ కాకుండా చేసే సేవ.

స్థిరసంకల్పధారులైన డా.డీఆర్కేప్రసాద్, డా.పద్మావతి గార్లు వారి కార్యకర్తలు అసాధ్యాలను గూడా సుసాధ్యాలుగా మార్చగలరు.

ఆరోజు తలపెట్టిన పాదయాత్ర విజయవంతమైంది

నారాయణరావు నగర్ ప్రారంభం నుండి సభాప్రాంగణం వరకు ప్రజలు రంగురంగుల ముగ్గులతో స్వాగతం పలికారు

 దారిలో ఆంజనేయస్వామి గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి పూజచేశారు మన ప్రియతమ నాయకులు శ్రీ బుద్ధప్రసాద్ గారికి గాంధీచౌక్ సెంటరులో స్వాగతం పలికారు.

గాంధీజీ విగ్రహం వద్దకు వెళ్ళుచుండగా శ్రీ బుద్ధప్రసాద్ గారికి పూలదండతో సత్కరించారు

గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసినారు మన ఉపసభాపతి శ్రీ బుద్ధప్రసాద్ గారు

ఉదయం 5.30 ని.ప్రారంభమైన పాదయాత్ర 6.15 ని.పూర్తిచేసికొని సభా ప్రాంగణంలో అడుగుపెట్టినారు

విజయవాడ నుండి డా.రమణ గారు, డా.కాలేషావలి గారు, పామర్రు నుండి భార్గవి గారు, గ్రామ పంచాయితీ ప్రముఖులు,

విచ్చేసి సభను విజయవంతం చేశారు

చల్లపల్లిని  ఓ డీ యఫ్ గా ప్రకటించారు ఎం. డీ.ఓ.గారు

మన ఉపసభాపతిగారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం జరిగిన సందర్భంగా గ్రామాధికారులు శాలువతో సత్కరించారు

తదనంతరం స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం పుస్తకాన్ని శ్రీబుద్ధప్రసాద్ గారు ఆవిష్కరించారు 

బుద్ధప్రసాద్ గారి ప్రసంగానంతరం సభ ముగిసినది.

ఆరోజు మరపురాని రోజు.

చల్లపల్లిని దత్తత తీసికొన్న మన బుద్ధప్రసాద్ గారు స్వచ్ఛ సైనికులకు అభినందనలు తెలిపినారు.

                 903 వ రోజు.....

ఎవరైతే సామాజిక స్పృహ గల్గివుంటారో, ఎవరి మనసు స్వచ్ఛంగా సద్భావం తో ఉంటుందో వారు గ్రామాభ్యుదయంకోసం పాటుపడుతూనేవుంటారు.

డా.డీఆర్కేప్రసాద్, డా.పద్మావతి గార్లు వారి కార్యకర్తలు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభం చేసి అడుగు అడుగు కలుపుతూ కదంతొక్కుతూ, ముందడుగు వేస్తూ స్వచ్ఛ సుందర చల్లపల్లిని ఒక స్థాయిలో నిలబెట్టుచున్నారు

ఆనాడు పోలీస్ క్వార్టర్స్ లో పరిశుభ్రతా కార్యక్రమం చేపట్టారు.

పోలీసులు, యస్.ఐ. చంద్రశేఖర్ గారు కార్యకర్తలతో కలసి సేవాకార్యక్రమాలు నిర్వహించారు

పెద్దపెద్ద దుంగలను సైతం అవలీలగా ఎత్తివేశారు

యస్.ఐ. గారు ఉత్తేజంగా మాట్లాడారు సేవ చేస్తున్నారు అంటే మామూలుగా శుభ్రం అనుకున్నాం. ఈరోజు మీరుచేసిన సేవ మరువలేనిది అన్నారు. క్యారీ బ్యాగుల నిషేధంలో మీకు తోడుగా మేము నిలుస్తామన్నారు.

       900 రోజుల సేవా జీవితం కొత్త మలుపులు తిప్పింది. 

       Srysp college లో walkers club ఉంది. ప్రతిరోజు కాలేజీలో నడుస్తూ వుంటారు.

       నడక సంఘ ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ గారు, మండవ బాలవర్ధి గారు డా. డి. ఆర్.కె ప్రసాదు గారిని కలిసి ప్రతి నెల 2,4  ఆదివారాలు సేవాబాధ్యతలు స్వీకరిస్తామన్నారు. వారి రాకతో కార్యకర్తలలో నూతనఉత్తేజం కలిగింది.   

 విజయానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకున్న వాడు పరమపద సోపాన పటంలో పాములు తగలకుండా విజయం పొందుతారు.

 వీరి చేరికతో కార్యకర్తలు 100 మంది దాటారు.

వీరిలోనుండి వచ్చిన కార్యకర్తే ఆకుల దుర్గాప్రసాదు.  

డా. పద్మావతిగారు సుందరీకరణ బృందానికి ప్రాముఖ్యత నిచ్చి ఒక  బృందంగా శుభ్రతకే పరిశుభ్రత నేర్పే కార్యకర్తలయ్యారు.

వారు ఎచట శుభ్రం చేసినా అద్దంలా శుభ్రం చేసేవారు.

 వారే దుర్గావాసులు, మాధురీ పద్మావతులు.

నారాయణరావు నగరులో చంటి గారి బృందం సేవ ఆగింది.

తరువాత రోజుల్లో మరల కొనసాగించారు.

కమ్యూనిస్టు బజారులో                      

    పూర్వం ఓ పక్షి సముద్రపు ఇసుకలో గుడ్లు పెట్టింది. సముద్రపుటలలకు ఆ గుడ్లు సముద్రంలోకి వెళ్లిపోయాయి.

పక్షి విచారించలేదు సరికదా సముద్రంలో నీరు ఎండకడితే అనే ఆలోచన వచ్చి తన ముక్కుతో నీరు తీసికొని దూరంగా వదిలేది.

 ఓదార్చడానికి వచ్చిన పక్షులు గూడా మేముసైతం అంటూ సాయ చేయసాగాయి. పక్షులకు రాజు గరుత్మంతునికి తెలిసి సముద్రంపై రెండు ప్రహరాలు చేసి గుడ్లను తెచ్చి పక్షికి ఇచ్చాడట.

 ఒక స్థిరసంకల్పం కలిగితే చిన్న చిన్న సాయాలనుండి పెద్దవారి వరకు సాయంచేయడానికి వస్తారు

యుక్తి లభిస్తుంది, బుద్ధి స్ఫురిస్తుంది.

వివేచన ఇచ్చేవారు వస్తారు.

  అలా వచ్చిన వారు ఉదయ్ సింగ్ గౌతమ్, విద్యాసాగర్, బుద్ధప్రసాద్ గారు , డా.గురవారెడ్డి గారు, డా. గోపాలం శివన్నారాయణ గారు, నాదెళ్ల సురేష్ గారు ఇలా ఎంతోమంది ఈ మహోద్యమానికి చేయుతనిచ్చి నడిపించారు.

కమ్యూనిస్టు బజారులో మహిళా సేవ మరపురానిది.

ప్రాతూరి శాస్త్రి

21.08.2020.