ప్రాతూరి శాస్త్రి - 29.10.2020. ....           29-Oct-2020

 ఒక్కసారి వాడే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించే దిశగా- 6 మండలాల, 6 స్వచ్చ కార్యకర్తల తపన, ఆవేదనా పూర్వక-

మేథోమధనం.

అవనిగడ్డ నియోజక వర్గ పరిధిలోని ఐదు మండలాల- 6 స్వచ్చ గ్రామాలకు చెందిన 66 మంది స్వచ్చ సైనికులు 16.02.2020 సాయంత్రం 5.00-6.55 గంటల మధ్య చల్లపల్లిలోని పద్మాభిరామంలో"సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తు నిషేధం" మీద జరిపిన మేథో మధనం గత 1924 రోజుల స్వచ్చోద్యమ చల్లపల్లి ప్రస్థానంలో మరొక మైలు రాయి!

పర్యావరణ విధ్వంస కరమైన ప్లాస్టిక్ మీద ప్రకృతి పరిరక్షకుల కసి, వేదన, ఈ రెండు గంటల చర్చలలో కనిపించాయి. ప్రభుత్వం ఈ 22 వ తేదీన ప్రకటించనున్న "ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువుల" పై నిషేధం నేపధ్యంలో వీరు సంయమనంతో, ముందు చూపుతో కార్యసాధన కోసం ఈ క్రింది నిర్ణయాలు తీసుకొన్నారు:

మానవాళి భవిష్యత్తును శపిస్తున్న ఈ ప్లాస్టిక్ పెను భూతాన్ని నేటి పరిస్థితుల్లో మనం పూర్తిగా తుదముట్టించలేమనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆ భూతంలో సగ భాగమైన "సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తు వినియోగాన్ని సున్నా స్థితి కెలా తీసుకురాగలమనే వివేకంతో తేల్చిన కొన్ని నిర్ణయాలివి:

1) జిల్లా కలెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ గారు వ్యూహాత్మకంగా, దూర దృష్టితో విజయవాడ నగరంలో దశల వారీగా నిత్య జీవితంలో వాడే ప్లాస్టిక్ వస్తు వాడకాన్ని గణనీయంగా తగ్గిస్తున్న విషయాన్ని అందరం గమనించాలి, అభినందించాలి. అనుసరించాలి.

2) త్వరలో వెలువడనున్న ప్రభుత్వ శాసనం అమలులో గ్రామ గ్రామాన ఉన్న మన కార్యకర్తలంతా మెలకువగా, సంయమనంగా ఉండి, పంచాయతీ, పోలీస్ శాఖల వారి ప్రతి ప్రయత్నానికి అడుగడుగునా సహకరించాలి.

3) దుకాణాల దగ్గర ప్లాస్టిక్ కవర్ల వాడకంలో వ్యాపారుల సాధక బాధకాలను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలంతా తెలివిగా-ఓర్పుగా ఎన్ని మార్లైనా నచ్చ జెప్పి చూడాలి.

4) స్వచ్చ కార్యకర్తలు ముందుగా తాము ప్లాస్టిక్ వస్తు వినియోగంపై స్వయం నిషేధం విధించుకొని మాత్రమే గ్రామస్తులకు, వ్యాపారులకు ఆ విషయం చెప్పాలి. ఆచరణ లేని వట్టి మాట ప్రభావశీలం కాదనిఅందరంగుర్తుంచుకోవాలి.

5) మన అందరం నూరు శాతం మన నిర్ణయాలను అమలు పరచి, ఆయా గ్రామస్తులను సంసిద్ధులను చేసి, అప్పుడు మాత్రమే వీలైనప్పుడు జిల్లా కలెక్టర్ గారితో సమావేశమై లోటు పాట్లను చర్చించవచ్చు.

6)తల్లి దండ్రులు ఇంటి వద్దనే తమ పిల్లలను ఈ ప్లాస్టిక్ వస్తువుల వాడకానికి దూరంగా ఉంచేట్లు ప్రయత్నించాలి. దేవాలయాలు, కళ్యాణ మండపాలు, విందులు-వినోదాలన్నింటి దగ్గర మనం సౌమ్యంగా భక్తులకు, నిర్వాహకులకు పదేపదే నిరంతరాయంగా ఈ విషయాలను చెప్పి ఒప్పించాలి.

7) చల్లపల్లి, కోడూరు వంటి చోట్ల సంచులు, ఫ్లెక్సీలు వంటి ప్లాస్టిక్ వస్తు వాడకం గణనీయంగా తగ్గడం మనకు ప్రోత్సాహకరమైన విషయమే కనుక - అందరం గుర్తుంచుకొనదగ్గ విషయాలు- ఎవ్వరూ దిగులు చెందక, విసుగు పొందక మళ్లీ మళ్లీ మన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉండడమే. రెండవది- స్వచ్చంద కార్యకర్తలం కనుక మనమెవర్నీ శాసించలేం.

రెవిన్యూ, పోలీస్, పంచాయతీ అధికారుల చొరవను, ప్రయత్నాన్ని అభినందించడం, అనుసరించడం, సహకరించడం వరకే చేద్దాం.

విమర్శలకూ, కోపతాపాలకూ, నిర్వేదాలకూ, అనిశ్చితికీ స్వస్తి చెప్పి, పర్యావరణహితం కోసం జాగరూకులమై పాటుబడదాం.

ప్లాస్టిక్ అనకొండల్ని నిర్మూలించడం లో మనం తప్పక విజయం సాధిద్దాం.

 

అవనిగడ్డ నియోజక వర్గ స్వచ్చ కార్యకర్తలు

చల్లపల్లి

16.02.2020.

 

- ప్రాతూరి శాస్త్రి

29.10.2020.