ప్రాతూరి శాస్త్రి 01.11.2020. ....           01-Nov-2020

 

         కార్యకర్తల అందాల భావాలు

 

       కొందరు సేవచేయడం కోసమే పుడతారు. కొందరు స్వయంశక్తి చేత , స్వయంకృషి తో జీవితంలో సేవజేయ మొదలిడుతారు. మరికొందరు పరిస్థితుల ప్రాబల్యంతో సేవాబాధ్యత ఆపాదించబడుతుంది.

        ఈ శ్రమజీవుల జీవితాలు తరువాత తరాలపై కూడా ప్రభావం చూపుతుంది.

         కణకణమున శ్రమశక్తి అణువు అనువున లభించు తృప్తి

         ఒక్కసారి స్వార్ధము వీడి చూడు

         శ్రమసంస్కృతి ని దర్శించవచ్చు.

           డాక్టరు గారు చీపురు పట్టి ఊడుస్తుంటే , వాకింగ్ కు వెళ్తున్న నేను, తుమ్మల జనార్దనరావు గారు చూసి మేమూ శ్రమదానం ప్రారంభించాము. ఆనాటి నుండి జీవితంలో శ్రమదానం ఓ భాగమైపోయింది అంటారు లక్షణరావు గారు.

           50 వ రోజు నుండి ఈనాటి వరకు స్వచ్ఛ చల్లపల్లి అభివృద్ధి కై శ్రమ చేస్తున్నాము. ముఖ్యంగా 1,2 వ వార్డులలో, అంకమ్మగుడి రోడ్డు స్మశానం వరకు దుర్గందభూయిస్టమైన మలవిసర్జన ప్రాంతాన్ని శుభ్రంచేయడం, ఆ వార్డులలో రోడ్లపైనే టాయ్లెట్లకు రాకుండా వారందసరికే కౌన్సిలింగ్ ఇవ్వడం, ప్రభుత్వ సాయంతో పాటు టాయ్లెట్ కట్టుకోలేని వారికి ట్రస్టు నుండి సహకార మిప్పించడం ఈనాటికీ మరువలేము.

"మనవంతు మనం రోజుకు 3 గంటలు గ్రామానికి సేవజేస్తే ఎన్నో మార్పులు తేవచ్చు నంటారు మన మాజీ zptc కృష్ణకుమారి గారు, వారి భర్త రాజేంద్రప్రసాద్ గారు.

       31 వ రోజునుండి చల్లపల్లి శుభ్రత సుందరీకరణ కోసం ప్రయత్నిస్తూ సంతృప్తి చెందుతున్నానంటారు మన మెండు శ్రీను.

         డాక్టర్ గారి బృందం మా హోటల్ ముందు శుభ్రం చేసివెళ్ళితే నేను మొద్దు నిద్రపోయానా. నేను గూడా ఎందుకు వెళ్లకూడదు అని 90 వ రోజునుండి సేవాబాధ్యత లో పాల్గొంటున్నాను అంటారు ముత్యాల లక్ష్మీ గారు

           ధ్యానమండలి సభ్యులమైన మేము యోగామాస్టారి పిలుపుతో 100 వ రోజునుండి స్వచ్ఛ చల్లపల్లి సేవలకు అంకితమయ్యానంటారు సజ్జప్రసాదుగారు.

            గొప్ప గొప్ప పనులంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు మనం చేసే పనిని గొప్పగా మార్చుకోవాలి అంటారు. 2 వ రోజునుండి సేవాబాధ్యత చేపట్టిన జనవిజ్ఞాన సభ్యుడు వాసుమాస్టారు.

           స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం నుండి క్రమశిక్షణ, సమయపాలన, ఐకమత్యం,త్యాగగుణం నేర్చుకున్నాం అంటారు విజయరమ, రాధాకృష్ణ గార్లు.

         ప్రతిరోజూ జరిగే స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలు పేపరులో చూస్తున్నా, వారు చేస్తున్న సేవలు వింటున్న , డాక్టర్ గారి మాటలే ఇన్స్పిరేషన్ గా 900 రోజుల తరువాత  ఉద్యమంలో ప్రవేశించాను అంటారు సుందరబృంద సభ్యురాలు దేసు మాధురి. విశేషం ఏమిటంటే వీరి కుటుంబం అంతా ఉద్యమంలో భాగస్వాములే.

కలసి శ్రమిస్తున్నాం, నిస్వార్థ శ్రమలోని ఆనందానుభూతిని పంచుకుంటున్నాం అంటారు సూపరువైజర్ శ్రీనివాసరావు.

          ఉద్యమం ప్రారంభించిన 30 రోజులకు ఏడెనిమిది మంది కుర్రవాళ్ళు(సతీష్, నిరంజన్, మధు,రవి,బాలు,....) ఉద్యమంలో చేరి శ్రమదాన కార్యక్రమం చాలా సందడిగా,చేసేవాళ్ళము. ముఖ్యంగా మొక్కలు నాటడం  అంటారు వాహన మరమ్మత్తుదారు ఉస్మాన్ షరీఫ్ గారు.

              నిస్వార్ధపరులైన ఉద్యమ రధసారధుల సాహచర్యంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంటుంది. డాక్టర్ గారి అభ్యుదయ భావాలు, మేడం గారి వినూత్నమైన ఆలోచనలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి అంటారు సుందరబృంద సభ్యులు ఆకుల దుర్గాప్రసాదు గారు.

 100 రోజుల స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం స్వతహాగా ప్రజాగాయకుడినైన నాలో స్పూర్తిని కలిగించింది అంటారు నందేటి శ్రీనివాసరావు.

             ఉదయం 40 మంది శ్రమజీవులతో కలసి కుశల ప్రశ్నలు వేసికొని గ్రామంకోసం పనిచేసే మహత్తర కార్యక్రమం నన్ను బాగా ఆకర్షించింది అంటారు గోళ్ళ వెంకటరత్నం గారు.

       అహంకారంలేని కులమత భేదాలెరుగని స్వచ్ఛ కార్యకర్తలు ఒకటిగా క్రమశిక్షణ తో సేవ చేయడం, వందలమంది కార్యకర్తల కు ఆత్మీయుడుగా మారడం మరువలేనంటారు బిఎస్ యన్ యల్ నరసింహారావు గారు.

 

వైద్య దంపతులిరువురూ ఏ అనారోగ్యము లేకుండా సుదీర్ఘకాలం సమాజానికి చికిత్సలు చేస్తూ వర్ధిల్లాలి అంటారు శివారాంపురం వాస్తవ్యులు రావేళ్ళ శివరామకృష్ణయ్య గారు.

          నేను లేకుంటే స్వచ్ఛ ఉద్యమానికి ఏమీ లోటు ఉండదు.

కానీ అందుకు నేను పాల్గొనకుంటే నేను ఎంతో నష్టపోయేదాన్ని అని అంటారు పల్నాటి అన్నపూర్ణ గారు.

      ఉద్యమ ప్రారంభాన్నుంన్డీ కార్యకర్తయిన నేను ఇంతమంది త్యాగధనుల, ఆదర్శ మూర్తుల, శ్రమజీవులతో అనుభవాన్ని, అనుబంధాన్ని పెంచుకోబట్టే స్వచ్ఛ యార్లగడ్డ నిర్మాత నయ్యానని అంటారు తూము వెంకటేశ్వరరావు గారు.

తొలుత పొరబడ్డా, ఈ స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం చాలా విశిష్టమైనది అని కొద్దికాలనికే తెలిసిందివారానికి రెండు రోజులే సేవజేసినా ఊరికోసం ఇంతమంది ఒకే ఆలోచనతో సేవాబాధ్యత నిర్వహించి చాలా గ్రామాలకు ఆదర్శంగా నిలవడం సంతృప్తి నిచ్చిందంటారు లక్ష్మీ సెల్వంగారు.

          చల్లపల్లి నుండి శివరాంపురం వరకు శుభ్రంచేస్తున్న చల్లపల్లి కార్యకర్తలను జూసి మేము సైతం అంటూ కొత్తూరు నుండి ఉద్యమంలో కలసి పనిచేస్తూ  మేము స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలమైనాము అంటారు ప్రతిరోజు శివరాంపురం నుండి వచ్చే కార్యకర్తలు.

ఈ స్వచ్ఛ చల్లపల్లి శ్రమదాన కార్యక్రమంతో నా వూరి కాలుష్యానికి విముక్తి, నా ఆరోగ్యానికి, ఆనందానికి శక్తి. కనుక ఈ శుభోదయ శ్రమదాన కార్యక్రమానికి నేనెందుకు పలకాలి స్వస్తి అంటారు లాబ్ రవి.

         అందరమూ తలచుకుంటే ఓ మంచి ఆదర్శం కోసం ఓర్పుతో సేవ చేస్తుంటే అనుకున్నవి సాధించవచ్చు అంటారు పసుపులేటి సత్యం.

           మా డాక్టర్ గార్ల అండ, సోదర కార్యకర్తల సాహచర్యం, నిత్య వేకువ శ్రమదానం నా ఆరోగ్య సూత్రం.

నా శరీరానికి మనసుకు ఆరోగ్యమిస్తున్న  స్వచ్ఛ కార్యక్రమానికి నేనెలా దూరమౌతాను అంటారు కోడూరు బాబాయ్.

560 వ రోజునుండి ఉద్యమంలో పాల్గొంటున్న నేను తొలి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చులకన చేసిన వాళ్ళలో నేను గూడా వున్నాను.  కానీ  ఉద్యమానికి వచ్చాక  మాత్రం మనస్పూర్తిగా, శక్తివంచనలేకుండా పనిచేస్తున్నాను అంటారు కస్తూరి విజయకుమార్.

           ఓ మంచి కోసం చేసే ఈ ఉద్యమంలో కాలు చెయ్యి అడుతున్నంతవరకు రిటైర్మెంట్ ఉండదు. మా డాక్టరు గార్లు , కార్యకర్తలు ఎప్పుడు సుఖంగా ఉండాలని , మా ఊరిని చూసి మిగిలిన ఊళ్లన్నీ మారాలని ఆశిస్తున్నాను అంటారు మాలెంపాటి అంజయ్య గారు.

         స్వచ్ఛ కార్యకర్తల నిరాడంబరత, నిస్వార్థ ఆదర్శ శ్రమదానం , నిబద్ధత కు ఐక్యరాజ్యసమితి ని ఆలోచింపజేయుటలో నాదెళ్ల సురేష్ గారి నేర్పరితనం ఉద్యమానికి బలం చేకూరింది.  అంటారు గురవయ్యగారు.

             నవంబరు 12, 2014 నుండి ప్రారంభమైన ఈ ఉద్యమం  నిరంతరంగా కొనసాగుతూ ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు మాచే జరుపబడ్డాయి. డ్రైన్లు శుభ్రత, అశుద్ధాలు సైతం తొలగించి గ్రామ రహదారులు శుభ్రం చేస్తుంటే కొంతమంది ఫోటోలకోసం చేస్తున్నారన్నవాళ్లే సంవత్సరం తిరిగేసరికి ప్రసంసించడం ప్రారంభించారు. అనేక గ్రామాలకు ఆదర్శమవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సంతోషం ఎన్ని కోట్లిచ్చినా రాదు అంటారు యోగామాస్టారు వెంకటేశ్వరరావు గారు.

తొలి రోజుల్లో పారిశుద్ధ్య కార్యక్రమల తో ప్రారంభమయి పచ్చదనం కోసం గ్రామమంతా మొక్కలు నాటారు.ఊరంతా సుందరీకరణ జరిగింది.  డంపింగ్ యార్డులో చెత్త నుండి సంపద కేంద్రం పంచాయతీ వారు సజావుగా నడిపిస్తే ఇన్నాళ్ల శ్రమ సఫలం అవుతుందంటారు డా.గోపాలకృష్ణయ్యగారు.

           ఆనాటి చల్లపల్లికి ఈనాటి చల్లపల్లికి ఎంతో వ్యత్యాసం.  ఎవరూ రోడ్డుపై చెత్తవేయని రోడ్లే దర్శనమిస్తాయి ఈనాడు. అందమైన రహదారులు ఇరువైపులా పెరిగిన చెట్లు స్వాగతం పలుకుతాయి దర్శకులకు. డ్రైన్ల విషయంలో పూర్తి స్థాయిలో అనుకున్న విధంగా underground drainage  అవలేదు.

పద్మావతిగారి ఆలోచనలకనుగుణంగా సృష్టించబడిన సుందరబృంద నిర్మాణం గ్రామానికే వన్నెతెచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే డా.పద్మావతిగారు ఏ కార్యక్రమం చేపట్టినా instant coffee లా మధురంగా వుంటుంది.

డా.డీఆర్కేప్రసాదుగారు ఏ కార్యక్రమమైనాslow and steady wins the race లా ఆనందంగా ఉంటుంది.

ఇరువురి ప్రణాళికాబద్ధమైన ఆలోచనల ఫలితమే స్వచ్ఛ సుందర చల్లపల్లి.

డాక్టర్ గార్ల న్యూజిలాండ్ పర్యటనలో వారి మదిలో జనించినదీ సుందర చల్లపల్లి. వారు కన్న కలల సాకారానికి

రెండడుగుల దూరంలో ఉన్నాము.

మొదటిది zero waste management  రెండవది underground drainage.

రాష్ట్రీయ, జాతీయ స్థాయికి ఎదిగిన స్వచ్ఛ సుందర చల్లపల్లి అంతర్జాతీయ మహిళా దినోత్సవం2019 నాడు డా.పద్మావతిగారందుకున్న వసుంధరా పురస్కారం తో సుందర చల్లపల్లి  శ్రమసంస్కృతి పతాకస్థాయికి చేరింది.

            ప్రజల భాగస్వామ్యం అన్నిటా ఉండి తడి, పొడి చెత్తలు డంపింగ్ యార్డుకు చేరి, పంచాయతీ వారు వానపాముల ఎరువు తయారుచేస్తే సుందర చల్లపల్లి సాకారమౌతుంది.   

          ప్రస్తుత సానిటరీ ఇన్స్పెక్టర్ గారు ప్రత్యేకశ్రద్ధ  తీసుకొని చల్లపల్లి గ్రామంలో డ్రైన్ల సంస్కరణ ప్రారంభించారు. ఇది అత్యంత ముదావహం.

ఒక పక్క డ్రైన్స్ శుభ్రం చేయిస్తూ మరోపక్క డ్రైన్లపై ఆక్రమణలు తొలగిస్తూ గ్రామ పరిశుభ్రతకు పెద్దపీట వేశారు మన సానిటరీ ఇన్స్పెక్టర్ గారు.

           నదీనాం సాగరోగతిః  

ఏ కార్యకర్త పలికినా, ఎవరు ఆశించినా, ఏ వ్యక్తి తలచినా మహాసముద్రాన్ని పోలిన స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధనే.

    మాకు సేవాగుణము ననుగ్రహించి

   మమ్ముల తీర్చిదిద్దినావు తల్లీ

  కన్న కలలు సాకారం చేయిస్తున్న కల్పవల్లీ

 నీకు పాదాభివందనం ఓ స్వచ్ఛ చల్లపల్లీ.

ప్రాతూరి శాస్త్రి

01.11.2020