పల్నాటి అన్నపూర్ణ....           01-Jun-2020

2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

 

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 29

 రోజురోజుకీ పూర్తిగా నా చల్లపల్లి మారిపోవడానికి కారణ

మైన పుణ్యాత్ములకీ - 2000 దినాల స్వచ్చ ఉద్యమానికీ నా ప్రణతులు! 

          మొదటి 30-40 రోజుల దాక జనవిజ్ఞాన వేదిక వారి - డి.ఆర్.కె. ప్రసాదు గారి- స్వచ్చ కార్యకర్తల వారి స్వచ్చోద్యమం తడాఖా చాలామంది లాగే నేనూ గుర్తించలేకపోయాను. “ఇట్లాంటివి ఎన్ని రాలేదు - పోలేదు” అని అనుకొన్న వాళ్లలో నేనూ ఉన్నాను. తరవాత గడప దాటి వేకువ జామున బైటకెళ్లేందుకు కొన్ని రోజులు నాకు నేనే ఘర్షణ పడి ATM సెంటరు ఎదురుగా వేంకటేశ్వరస్వామి ఆలయానికి రోజుటిలాగే ఆ రోజు కూడా, వెళ్ళుతూ అక్కడ రోడ్డు ఊడుస్తున్న, మురుగు కాల్వలు బాగు చేస్తున్న స్వచ్చ కార్యకర్తలైన నేనభిమానించే పెద్ద డాక్టర్లు, కాలేజి రోజుల గురువులు, ఇతర పెద్దలను చూసి ఒక్కసారిగా కంగుతిన్నాను. ఇదేమిటిరా తండ్రి! గౌరవింపదగిన ఇందరు పెద్దలు నా ఇంటి దగ్గరలో ఊరును శుభ్రం చేయడమేమిటి? నేనేమీ పట్టనట్లు ఆలయానికి వెళ్ళడమేమిటి? అని మదనపడి ఇక అప్పటికప్పుడు వాళ్ళల్లో కలిసిపోయాను. ఇక ఆ తరువాత ప్రతి రోజూ తెగించి వెళ్లాలని ఉబలాట పడి – చివరికి వెళ్లనే వెళ్లాను. ఇంటి పనులు, వృద్ధులై పోయిన అత్తమామల పనులు, ఇతర సంకోచాలు అన్ని రోజులు అడ్డుపడ్డాయన్న మాట! 

          మొత్తం మీదైతే చాలా రోజులు వెళ్లాను గాని మధ్య మధ్యలో వాయిదాలు తప్పలేదు. క్షణం తీరిక లేని అంత పెద్ద డాక్టర్లు, రిటైర్డ్ ప్రిన్సిపాళ్లు, 70 - 80 ఏళ్ల వృద్ధులు అంతనిక్కచ్చిగా అనుకొన్న సమయానికే ఎలా వెళ్లి ఈ మురికి- బురద - చెత్త పనులు చేయగలుగుతున్నారో తలుచుకొంటేనే దండం పెట్టాలనిపిస్తుంది! 

          కొన్ని నెలలకు గాని, ఈ ఉద్యమం, ఈ శ్రమదానం నా ఊరికి, దేశానికి ఎంత ముఖ్యమో-కాస్త ఆలస్యంగా-40 రోజుల తర్వాతైనా వీళ్లతో చేరి ఎంత మంచి పని చేస్తున్నానో- ఎందరెందరు గొప్ప వాళ్ల - ఉత్తముల సరసన నాకు చేతనైన ఊరి పని నిర్వహిస్తున్నానో అర్థం కాలేదు. 

          మాది కైకలూరు దగ్గర కొచ్చెర్ల అనే ఒక గ్రామం. అమ్మమ్మ గారి ఊరు, మెట్టిన ఊరు మాత్రం ఈ చల్లపల్లే. ఈ ఐదారేళ్ల చల్లపల్లి ఉద్యమంలో పల్నాటి అన్నపూర్ణకు గూడ ఏ కాస్తయినా భాగముందని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఎంతో తృప్తి! నా సొంత కుటుంబంతో బాటు 100 – 150 మంది అన్నలూ – అక్కలూ – వదినలూ – తల్లి దండ్రుల్లాంటి పెద్దలూ – తమ్ముళ్లూ –మరదళ్లూ సమకూడిన స్వచ్చ కుటుంబంలో చేరకపోతే ఎంత పోగొట్టుకునే దాన్ని!  

          80 ఏళ్ల పెద్ద డాక్టరు – శివప్రసాదు గారు కారులో నన్ను వేకువనే స్వచ్చంద శ్రమదాన ప్రాంతానికి తీసుకెళ్లి – మళ్ళీ ఇంటి దగ్గర దించి – మా నాన్నకిచ్చినంత ప్రేమగానే నేను చేసిన కూరను ఆయనకిచ్చి 100 రోజుల – 500, 1000 ... రోజుల స్వచ్చోద్యమ పండుగల సాంస్కృతిక కార్యక్రమాలలో – కోలాటంలో నేనూ పాల్గొని – ఏ పది మార్లో సోదర కార్యకర్తలకు నా పిండి వంటలో - పులిహోరలో సమర్పించి, అభినందనలూ, ఆశీర్వాదాలూ అందుకొని, అంతక ముందుకు వైద్య శిబిర సేవలకే పరిమితమైన నా పతి దేవుడు భాస్కర్ తో సహా – ఏ వెయ్యి రోజులో ఈ చల్లపల్లి కోసం శ్రమించి.... ఇవన్నీ చేయకుంటే నా జీవితంలో ఎంత వెలితి? 

          నేను లేకుంటే స్వచ్చ ఉద్యమానికే లోటూ ఉండదు గాని, అందులో నేను పాల్గొనకుంటే నాకెంత నష్టం? ఎన్ని వేల రోజులు ఈ శ్రమదాన ఉద్యమం జరిగిందో - శ్మశానాలూ, వీధులూ, బస్టాండులూ, మురుగు కాల్వలు, ఇంకా ఎన్నెన్నిటిని సంస్కరించేశారు అని లెక్కలేసే కంటే - అసలు ఈ ఉద్యమకారుల స్పూర్తి ఎంత దాకా ప్రాకింది, సమాజంలో ఎంత మార్పు తెచ్చింది అని గణించుకుంటే - నాలాంటి గృహిణి వేకువ చీకట్లో బైటకొచ్చి - ఊరి కోసం ఎంతో కొంత వేల రోజులుగా కృషి చేస్తున్నదంటేనే తెలియడం లేదా - ఈ చల్లపల్లి స్వచ్చ ఉద్యమం ప్రత్యేకత ఎలాంటిదో? నాపాటికి నేను మా ఆయన, మా మరిది, ఇనపకొట్టు సాయి గార్లతో కలిసి ప్రతి ఆదివారం మా వీధిని బాధ్యతగా ఊడ్చి శుభ్రం చేస్తున్నాను.

          మా చల్లపల్లిని ఆదర్శంగా తీసుకొని, ఊళ్లూ, జిల్లాలు - రాష్ట్రాలు స్వచ్చ పరిసరాలను పెంచుకొని, పర్యావరణాన్ని రక్షించుకొని బాగుపడాలనీ, ఈ స్పూర్తి కలకాలం నిలవాలనీ కోరుకొంటాను తండ్రీ!

- పల్నాటి అన్నపూర్ణ,

   షాబుల్ వీధి

                     చల్లపల్లి – 25.05.2020.