తూములూరి లక్ష్మణరావు - 23....           15-Nov-2024

 దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 23

పెదముత్తేవి నుండి స్వచ్చ చల్లపల్లి దాకా....

          నా 57 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకొంటే - ఏ కాస్తయినా ‘మంచిపని’ చేశానా-అని ఆలోచించుకొంటే తట్టింది-నా ఊరు కాని ఊరుకు పదేళ్లుగా జరిగే శ్రమదానంలో పాల్గొనడమే!

          అసలు మంచి అంటే ఏంటి బాబు? నీకు మంచయింది నాకు సెడ్డవుద్దేమోనండి! నాకు బాగా మంచనిపిచ్చింది నీ కొంప ముంచిదేమో బాబు!

          “ఇదుగో-ఇది శానా మంచి, ఇది తప్పంటే తప్పు” అని చెప్పేంతగా తెగ చదూకున్న వాడిని కాదండి! అదుగో-అలా టకాయిచ్చి సెప్పే డిల్లీ కోర్టు పెద్దాయన ఊరే-మొవ్వ దగ్గర పెదముత్తేవే నేను పుట్టినూరండి! ముల్పూరి వాళ్ల కోళ్ల ఫారాల పాతకేళ్ల-పాతిక వేల జీతగాడినయ్యా!

          “ ఇదుగో చూడూ-నీకూ నాకూ కాదు, హోల్ మొత్తం ఇంత పెద్ద చల్లపల్లికే కాదు-దేశానికే పనికొచ్చే, ఏలెత్తి సూపగూడని మంచి పని-మన పాతిక వేల జనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే- అందరం చేయగలిగే గొప్ప పని ఇది-“అని ఇక్కడి పెద్దలూ, తెలివైన వాళ్లూ నిర్ణయించుకొని చేస్తుంటే-

          చీకటితో 4.30 కే చీపుళ్లేసుకొని మా ఇళ్ల దగ్గర 12-11-14 న ఊడుత్తుంటే అంతకుముందే ఆ జనవిజ్ఞానవేదికతో పరిచయ భాగ్యమున్న-నేను కూడ గబుక్కున వాళ్ళలో కలిసి పోయాను బాబు! ఇన్నేళ్ల నుండి చూస్తున్నా- చేస్తన్నా ఇదేం దిక్కుమాలిన పనిరాఅని ఒక్క పూటా అనిపించలేదు!

          ఆరేళ్లపాటు నాగా లేకుండా వచ్చాను గాని తరవాత ఒక్కోరోజు కుదర్లేదు..రెస్క్యూ టీమని పేరుపడిన ఏడెనిమంది కార్యకర్తలతో మూడేళ్లు పనిచేశా!

          కార్యకర్తలే కొందరు శ్రమదానం ఖర్చులకని చందాలిత్తంటే-ఒక్కసారి ఇయ్యలేనని-మా ఇంట్లోనే కుండ పెట్టుకొని, రోజూ చిల్లర అందులో ఏసి, రెండేళ్లయాక అందరి ముందున తెరిస్తే అవి 3600 కు పైగా తేలింది బాబు!

          ఈ ఊళ్ళో అన్నీ తెలిసిన వాళ్లే ఈ శ్రమదానానికి దూరంగా ఉంటే బాదేస్తన్నదండి! అయన్నీ నాకెందుగ్గాని, నా వరకు నేను మాత్రం ఎంత కాలమైనా పొద్దున్నే వస్తానే ఉంటాను బాబు!

- తూములూరి లక్ష్మణరావు.

   06.11.2024.