గౌరుశెట్టి నరసింహారావు - 18.11.2023....           18-Nov-2023

 జై గురుదేవ! జై స్వచ్ఛ సుందర చల్లపల్లి!!

పెద్దలకూ పిన్నలకూ తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. చల్లపల్లి సెంటర్ లో జరిగిన శ్రమదానోద్యమ శత దినోత్సవం నుండీ నాకీ కార్యక్రమంతో అనుబంధం ఏర్పడింది. నాకు ఏ రోజైనా - ఏ కారణం చేతైనా దీని పట్ల కాస్త పట్టుదల తగ్గినప్పుడల్లా - వాళ్లది కాని గ్రామ సౌకర్యాల కోసం లక్షలు ఖర్చు చేస్తున్న, శారీరక శ్రమ చేస్తున్న, అంతకు మించి విలువైన తమ సమయాన్ని సమర్పిస్తున్న డాక్టర్ దంపతుల్ని చూస్తే చాలు - పునరుత్తేజం పొందుతాను!

అసలిందులో ఏ కార్యకర్త నిత్యం శ్రమదానం తక్కువని? మురుగులో నడుం లోతు దిగి తుక్కులు లాగిన కార్యకర్తలా? బట్టలకు రోడ్ల దుమ్మో - బురదో అంటుకొంటూ పనిచేసే సొదరీమణులదా? ఎక్కడ ఏ కాస్త ఆహ్లాదం లోపించినా పూనుకొని సుందరీకరించే బృందానిదా? ఊరంతటినీ కన్న బిడ్డలా కాచుకొనే విశాల హృదయాలదా? - ఎవరి త్యాగం తక్కువ?

దేశ ఉత్తర సరిహద్దుల్లో - మైనస్ డిగ్రీల చలిలో మనల్ని రక్షిస్తున్న సైనికులేనా – రాత్రింబవళ్ళూ చల్లపల్లి స్వస్తతను రక్షిస్తున్న స్వచ్ఛ కార్యకర్తలు మాత్రం హీరోలు కారా? ఇవి నేననే మాటలు కావు - మహనీయులు గోపాళం శివన్నారాయణ, గురవారెడ్డి, S.P. బాల సుబ్రహ్మణ్యం, జయరాజ్, ఇంకా డజన్ల కొద్దీ ప్రముఖుల పలుకులు!

నవంబరు 12 న జయరాజ్ కవి వార్షికోత్సవ ప్రసంగంలో “ప్రతి చెట్టూ - పుట్టా - పురుగూ - పులుగూ అన్ని మన నేస్తాలనీ, మన కారాధ్యాలనీ చెపుతున్నప్పుడు నాకు కన్నీళ్లాగలేదు. అసలు చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమం ఎంత ప్రత్యేకం, ఆదర్శం, ఆవశ్యకం కాకపోతే - పత్రికలు, ఎక్కడెక్కడి సంస్థలు దీన్ని ప్రశంసిస్తాయి చెప్పండి!

2944 నాళ్ల మన శ్రమదానం నాకు నచ్చింది; ట్రస్టు ఉద్యోగిగా, వేకువ శ్రమదాన కర్తగా నా ద్విపాత్రాభినయం ఇంకా నచ్చింది; ఉన్న ఊరి కోసం ప్రతి కార్యకర్త పాటుబడే విధానమూ – పని వేళ ఇందరి సహనమూ నచ్చాయి; మనలో ఒక - పెద్దాయన రొటీన్ కు భిన్నంగా “స్వచ్ఛ సుందర – ఆనంద - ఆదర్శ - అభ్యుదయ చల్లపల్లిని - సాధిస్తాం!” అనే నినాదాలు నాకెప్పుడూ గుర్తొస్తుంటాయి!

 “ఒక్క రోజైనా - ఒక్కసారైనా స్వచ్ఛ కార్యకర్తగా మెలగు నేస్తమా! ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా!” అనే నందేటి శ్రీను పాట మరీ నచ్చింది. అతడెప్పుడీ పాట పాడతాడా అని కనిపెట్టుకుని చూస్తూ ఉంటాను. ఇక అలాంటప్పుడు ఈ శ్రమ వేడుకకు నేనెందుకు దూరమౌతాను?

- గౌరుశెట్టి నరసింహారావు

   విశ్రాంత BSNL ఉద్యోగి

   18-11-2023