పసుపులేటి ధనలక్ష్మి - 18.11.2023....           19-Nov-2023

 ఈ ఉద్యమం ఎంత సులభమనిపిస్తుందో అంత కష్టం

            అందరికీ వందనాలు. నేను పసుపులేటి ధనలక్ష్మి నండి. పెద్ద చదువు లేకపోయినా మొదట్లో ధైర్యంచేసి రాలేకపోయినా, 50 రోజుల తరవాత వచ్చి కలిసినా, ఇంత పెద్ద పెద్దవాళ్లు నన్ను కూడ తమతో సమానంగా - ఒక స్వచ్ఛ కార్యకర్తగా గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలండి.

            ఒకప్పుడు నేను వార్డు మెంబరుగా ఉన్నప్పుడే నయమండి ఎక్కువ రోజులు వచ్చి, అందరితో పాటు వీధులు శుభ్రం చేసేదాన్ని. పిల్లల పెళ్లిళ్లూ, వాళ్ళ పిల్లల మంచీ చెడులూ, ఇతర బాధ్యతలతో వేకువనే రాలేక పోతున్నాను గానీ, పూర్తిగా మానలేదు.

            ఇందరితో కలిసి పని చేసిన రోజున తృప్తి, రాలేనప్పుడు వెలితీ అనుభవించాను. ఇలా బజారుల్నీ, బస్టాండుల్నీ, శ్మశానాలనీ ఆడా మగా తేడా లేకుండా కలిసి బాగుచేయడం మంచి దా-కాదా అనే ప్రశ్నేమిటండీ? మన ఇంటినీ, ఇంటి ముందు. వీధినీ ఊడ్చి - ముగ్గులెట్టడంలేదా? ఇదీ అంతే.

            ఈ తొమ్మిదేళ్లలో ఊరంతా మన కళ్లెదుటే మారిపోతూ ఉంటే - 30 వేలకు పైగా చెట్లు పెరుగుతూఉంటే - ఈ ఊరి గొప్ప తనం గురించి దేశమంతా కోడైకూస్తుంటే - ఇంకా ఇప్పుడీ సందేహాలేమిటి? ‘మాటలు కాదు. పనికావాలి ఇప్పుడుఅని మన డాక్టరు గారు చెప్పేదెందుకని? ఇంతమంది చీపుళ్లు పట్టుకొని, డిప్పలు మోసుకొని, ప్రతిరోజూ ఊరునెందుకు బాగుచేస్తున్నారు. ఈ ఊరును చూసి, చాలా ఊళ్ల వాళ్లు ఎక్కడికక్కడ ఎందుకు మనని అనుసరిస్తున్నారు?

            ఇదసలు మామూలు ప్రయత్నమా? పైకెంత తేలిగ్గా కనిపిస్తున్నదో దీని వెనకంత కష్టముంది. మరి అన్ని కష్టాల్ని మోస్తూ ఊరి మంచి కోసం ఇన్నేళ్లు పాటుబడడమంటే మాటలా?

            అందుకే మన కార్యకర్తలకీ, వాళ్లని నడిపించేవాళ్లకీ ఇంకోమారు ధన్యవాదాలండీ!

- పసుపులేటి ధనలక్ష్మి,

   18-11-23