ముత్యాల లక్ష్మి - 18.11.2023....           19-Nov-2023

 ఊరి బాధ్యతంతా మనదేననుకొని.....

            పెద్దా - చిన్నా కార్యకర్తలందరికీ నమస్కారాలండి! నా పేరు ముత్యాల లక్ష్మి. చంటి హోటలంటే చాలు - అందరికీ బాగా తెలుస్తుంది. ఎవరికి వాళ్లం కుటుంబాల - పిల్లల బాధ్యతల్ని చూసుకోవడమే చాల గొప్పండి. మరి అవి చూసుకొంటూనే నా బజారు, నా ఊరు పరిశుభ్రతల బరువు మోయడమంటే - అదీ తొమ్మిదేళ్ళ నుండీ - ఎంత మంచి పెద్ద పనో ఆలోచిస్తుంటే ఈ స్వచ్ఛ కార్యక్రమం ఎంత గొప్పదో అర్థమౌతున్నది.

            ప్రతివాళ్లూ నాకు పంచాయతీ ఇది చెయ్యలేదు - వార్డు మెంబరు అది చెయ్యలేదు. మా ఓట్లేయించుకొన్న ఎమ్.ఎల్.ఏ మళ్లీ కనపళ్ళేదుఅనుకోవడమే గాని, మన కర్తవ్యమేంటో మనం పట్టించుకొంటున్నామా? అసలు మనలో ఎంత మందిమి కులం చూడకుండా - డబ్బు తీసుకోకుండా పోటీ చేసిన వాడి మంచి గుణం చూసి ఓటేస్తున్నామండి?

            ఎవడు తోటి వాళ్ల బాధ్యతకూడ తీసుకుంటాడో వాడే నాయకుడండి. ఊరి బాగోగులు ఇంత కాలం పట్టించుకొనేవాళ్లదే ఈ ఊరండి. అదుగో - అలా ఆలోచిస్తే మాత్రం ఈ స్వచ్ఛ కార్యకర్తలు ఏ పదవుల కోసం కాక - ఇతర ప్రయోజనాలాశింపక - చాతనైనంతమేలు చేస్తున్నారే - మరి వీళ్ళెంత పుణ్యాత్ములండి?

            నా సంగతా? 2945 రోజుల్లో సగం రోజులు కూడ వచ్చుండను. వచ్చినపుడు మాత్రం మనస్ఫూర్తిగా బజార్ల శుభ్రత కోసం ఏ పనైనా చేస్తాను. అసలీ కార్యకర్తల గుంపులో కలిస్తే - నేనేమిటి - ఎవరి ఆలోచనైనా మారిపోయి, మనసు శుభ్రపడదా?

            రాన్రానూ ఇంటి పనులూ, హోటల్ పనులూ ఎక్కువైపోయి, ఇంకో ప్రక్కన వయస్సు కూడ పెరిగి, ఎంత రావాలని ఉన్నా ప్రతి రోజూ రాలేకపోతున్నందుకు బాధగా ఉన్నదండి. ఇంత పెద్ద డాక్టర్లూ, ఉద్యోగులూ, పెద్దలు చేసే కృషి ముందు నా పనెంతలేండి!

            ఊళ్ళో ఇంకా కొందరు అసలీ స్వచ్ఛంద శ్రమదానం వైపు కన్నెత్తి చూడకపోవడమే వింతగా ఉన్నది. ఇవ్వాళ కాకాపోతే రేపైనా అందరూ ఎవరి పరిమితులకు లోబడి వాళ్లు ఇంత మంచి పనికి వస్తారనే నమ్మకముందండి!

- ముత్యాల లక్ష్మి

  (చంటి హోటల్)

  18-11-2023.