ప్రాతూరి శాస్త్రి - 09.09.2020. ....           09-Sep-2020

కృషితో నాస్తి దుర్భిక్షం

శ్రమమూల మిదం జగత్

            ప్రారంభ దినాలలో ఒక బృందం శుభ్రం చేసికొంటూ పోతుంటే మరో బృందం మొక్కలు నాటేవాళ్ళు.

            యోగా మాస్టారు వెంకటేశ్వరరావు గారు, సతీష్ , మెకానిక్ రవి, నిరంజన్, మధు, ఉస్మాన్ ఓ బృందంగా మొదట నేలలో బోర్లు కోసేవారు. తదనంతరం నీడనిచ్చే మొక్కలు నాటేవారు.

            మరుసటి రోజు వేకువనే సత్యం, మురళి, బృందం ముళ్ళకంప తెచ్చి నరికి రక్షణగా మొక్క చుట్టు కంప కట్టేవారు.

            ఇదే ఆనవాయితీగా ఈనాటికీ జరుగుతోంది మనుష్యులు మారినా.

            కాలాంతరాల్లో కంప కట్టడం ఓ కుటీర పరిశ్రమలాగా చేసేవారు.

            తెచ్చిన కంపను రెస్క్యూ టీమ్ (బృందావన్, నరసింహారావు, లక్ష్మణరావు, శ్రీను, బీడీఆర్) వారు సైజ్ వారీగా నరికితే అంజయ్య, సజ్జా ప్రసాదు, శివరామకృష్ణయ్య, కొత్తపల్లి వేంకటేశ్వరరావు గార్లు మరికొంతమంది బృందం పాదులుచేసి కంప కట్టేవారు.

పరిశుభ్రత అనేది నిత్య కృషి.

            బైపాస్ రోడ్డు, విజయవాడ రోడ్డు, నాగాయలంక రోడ్డు, కళ్లేపల్లి రోడ్డులలో కరంటు వైర్లు వెళ్ళే వైపు పూలమొక్కలు, రెండోవైపు నీడనిచ్చే మొక్కలు నాటేవారు.

            మనకున్న అదృష్టం గోపాలకృష్ణయ్య గారి కుటుంబం ఇచ్చిన నీటి ట్యాంకర్లు, కొన్నాళ్ళకి వివేకానంద డిగ్రీ కాలేజీ  సెక్రటరీ శివప్రసాదుగారు మరో ట్యాంకర్ పంపారు. తరువాత ఆ ట్యాంకర్ మన ట్రస్టుకి వచ్చింది.

            రోజు రెండుపూటలా మొక్కలకు నీరు అందించడం వల్లే నాటిన మొక్కలు పెరిగి కనులకింపు కలిగిస్తున్నాయి.     

            సువర్నగన్నేరులతో బోగన్ విలియా చేరాక రహదారుల శోభ పెరిగింది.

            వీటితో అడవి తంగేడు కలసి అన్ని రహదారులు పసుపువర్ణ శోభితమైనాయి.

            మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ట్రస్ట్ కార్మికుల సేవ.

            కార్యకర్తల వేకువ సేవానంతరం ట్రస్టు కార్మికులు మొక్కలకు పాదులు లేకపోతే చేయడం, కంప పోతే తిరిగి కట్టడం రహదారి వనాలు శుభ్రం చేయడం చేస్తుంటారు.

- ప్రాతూరి శాస్త్రి

09.09.2020.