ప్రాతూరి శాస్త్రి - 28.09.2020. ....           28-Sep-2020

 "మనం వేసే ప్రతి అడుగులో, చేసే ప్రతి పనిలో నిజాయితీ, నిబద్ధత ఉంటే, మనం ఎవరి వద్ద తల వంచుకునే అవసరం లేదు."

 

          వివేకానంద డిగ్రీ కాలేజీ విద్యార్థులు సేవకు వచ్చిన వైనం.

                

          వివేకానంద డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుచున్న విద్యార్ధినీ విద్యార్ధులతో స్వచ్చ చల్లపల్లిపై అవగాహనా కార్యక్రమం జరిగింది. డా.డి.ఆర్.కె.ప్రసాదు, డా. పద్మావతి గార్లతో ముఖాముఖి.

         

          తరువాత వచ్చే ఆదివారం 25-09-2016 వ తేదీన ఉదయం 6-00 గంటల నుండి 8-00 గంటల వరకు ఆనంద ఆదివారంపేరుతో సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. డి.ఎస్.పి గారు ఈ కార్యక్రమానికి ఇంతకుముందే తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. స్వచ్చ చల్లపల్లికాన్సెప్ట్ ఆధారంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది.

 

684* రోజుల స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో అద్భుతం ఆనంద ఆదివారంజరగడం.

 

          స్వచ్ఛ చలపల్లి ఉద్యమంలో యువతను, విద్యార్ధులను భాగస్వామ్యం చేయడానికి చేసిన కృషి నేటిది. స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం ఫలితం రావాలంటే చల్లపల్లిలోని 20 వేల మంది ప్రజలు పూనుకుంటేనే సాధ్యం. విశ్రాంత ఉద్యోగులు, విద్యార్ధులు, యువత, కళాకారులు నిస్వార్ధంగా పాల్గొంటేనే ఉద్యమానికి ఊపు వస్తుంది. ఏ ఉద్యమానికీ ఫలితం వెంటనే రాదు. స్వాతంత్రోద్యమం మొదలుపెట్టిన కొన్ని దశాబ్దాలు తర్వాత కదా ఫలితం వచ్చింది. ప్రత్యేక తెలుగు రాష్ట్రంగా మద్రాసు నుంచి విడిపడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, దక్షిణాఫ్రికా స్వాతంత్రోద్యమం ఇలా అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

 

          స్వచ్ఛ ఉద్యమం మొదలు పెట్టిన తరువాత చల్లపల్లిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ఎంతోమంది చెబుతూ ఉన్నారు. ప్రతి రోజు స్వచ్ఛ కార్యకర్తలు చేసే కృషే దీనికి ముఖ్య కారణం. 40 నుంచి 50 మంది కృషి చేస్తేనే ఇలా ఉంటే 20,000 మంది ప్రజలు పూనుకుంటే ఎంత మార్పు రాగలదో మనం ఊహించవచ్చు. విశ్రాంత ఉద్యోగులు అనేక మంది స్వచ్ఛ ఉద్యమంలో హుషారుగా పాల్గొంటున్నారు. విద్యార్ధులను చైతన్యపరచగలిగితే ఫలితాలు కలకాలం నిలబడతాయి. విజయవాడలో జరిగే “HAPPY SUNDAY” కార్యక్రమన్ని స్పూర్తిగా తీసుకుని మనం చల్లపల్లి విద్యార్ధులలో స్వచ్ఛ చల్లపల్లి భావనలను తీసుకువెళ్ళవచ్చు అని డా.పద్మావతి గారు ఆలోచించారు.

 

          17.09.2016 శనివారము న వివేకానంద డిగ్రీ కాలేజి కరస్పాండెంట్ శివప్రసాదు గారు, ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు గారి అనుమతితో డిగ్రీ ఆఖరి సంవత్సరం విద్యార్దులతో స్వచ్ఛ ఉద్యమం గురించి ముఖాముఖి మాట్లాడినారు. 25.07.2016 ఆదివారము, చల్లపల్లి ATM సెంటర్ వద్ద సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చెయ్యాలని నిర్ణయం జరిగింది.

       

          కేవలం ఆటపాటలు మాత్రమే కాకుండా ఈ కార్యక్రమం నుండి స్వచ్ఛ ఉద్యమ సందేశం వెళ్ళడం ముఖ్యం. మచిలీపట్టణం నుంచి వచ్చిన డాన్సు మాస్టర్ సత్యన్నారాయణ గారి ఆధ్వర్యంలో డాన్సు ప్రాక్టీసు 5 రోజులు జరిగింది. స్వచ్ఛ కార్యకర్తలంతా ఈ కార్యక్రమ ఏర్పాట్లను అత్యంత శ్రమకోర్చి పర్యవేక్షించారు.

 

          సాయంత్రం పెద్ద వర్షం కురిసినప్పటికీ కార్యకర్తల శ్రమదానంతో సెంటర్ ని సభకు అనువుగా చక్కగా మలిచారు. పోలీస్ శాఖ చక్కగా సహకరించింది. కొంతమంది అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అత్యంత జనసమ్మర్ధం ఉండే ATM సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమం నిజంగా సందడే! రెండున్నర గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలు చాలా హుషారుగా డాన్సులు చేశారు. కొంతమంది స్వచ్ఛ కార్యకర్తలు కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. స్వచ్ఛ కార్యకర్తలు, విచ్చేసిన ప్రజలు, అధికారులు, వివేకానంద డిగ్రీ కాలేజి విద్యార్దులు, స్టాఫ్ అందరూ ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా కాలేజి, స్కూళ్ళ నుండి మన ఊరి విద్యార్ధుల ప్రతిభను ఇలాగే వెలికి తీస్తూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు జరగాలని కొంతమంది కోరారు. కూచిపూడి యువ క్లబ్ నుంచి వచ్చిన ఇద్దరు కుచిపూడిలో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.

 

          హైదరాబాద్ నుండి వచ్చి ఈ  కార్యక్రమాన్ని చూసిన శ్రీమతి నాయుడు అనుష గారు స్పందించి అప్పటికప్పుడే మనకోసం మనం ట్రస్టుకు 1,000 రూపాయలు విరాళాన్ని ఇచ్చారు.

 

          S.R.Y.S.P ప్రిన్సిపాల్ సాంబశివరావు గారు 500 రూపాయలు విరాళం ఇచ్చారు.

 

          ప్రాతూరి శాస్త్రి గారు ప్రదర్శలినచ్చిన విద్యార్ధులకు 10,000 రూపాయలు విరాళమిచ్చారు.

 

          ఆరోజు ఎంతమంది విద్యార్ధులు ప్రదర్శనలిచ్చారో అన్ని వేల రూపాయలను వివేకానంద డిగ్రీ కాలేజి కరస్పాండెంట్ శివప్రసాదు గారు మనకోసం మనంట్రస్టుకు విరాళం ప్రకటించారు.

        

          ఇకనుండి ప్రతి శనివారం మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు 50 మంది విద్యార్దులు స్వచ్ఛ ఉద్యమంలో పాల్గొంటారని ఆహూతుల హర్షధ్వానాల మధ్య ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు గారు ప్రకటించారు.

             

          ఆనాటి నుండి ప్రతి శనివారం కాలేజీ విద్యార్థులు సేవాబాధ్యత నిర్వహించేవారు.

           

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

ఆదివారము - 25.09.2016

 

          సాయంత్రం 3.30ని. నుండి 5.15.ని. వరకు వివేకానంద డిగ్రీ కాలేజీ విద్యార్థులు 30 మంది సేవ చేసినారు

ప్రిన్సిపాల్ కోటేశ్వరరావుగారు లెక్చరర్ చంద్రశేఖర్ గారుగూడా సేవచేసినారు. పారలు పలుగులు తెలియనివారు ఎంతోచక్కగా క్రమశిక్షణగా చేయడం చూసేవారికి, బస్సులలో వెళ్లేవారికి కనులపండుగగా వుంది గ్రామసేవ చేయవలసిన వయసులో నేర్చుకుంటే వారు భవిష్యత్తులో వారుండబోయే ప్రాంతాలు బాగుపడే అవకాశం ఎంతయినా వుంది.

         

          2018 జన్మభూమి 9 రోజుల కార్యక్రమంలో డిగ్రీ కాలేజీ విద్యార్థులు పాగోలు గ్రామం వంతెన నుండి గ్రామంలో అన్ని వీధులు శుభ్రం చేశారు.

 

        రోజూ ఓ గ్రామాధికారి పర్యవేక్షించేవారు. చివరిరోజున వారికి ప్రశంసా పత్రములు ఇచ్చినారు.

 

      ఈనాటికీ విద్యార్థులు సేవను బాధ్యతగా స్వీకరించి పని చేస్తారు.

- ప్రాతూరి శాస్త్రి

28.09.2020.