దాసరి శ్రీనివాసరావు....           02-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు –

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర - 2 

“స్వచ్చ సుందర చల్లపల్లి” ఉద్యమం మీద నా స్పందన

            2014 లో మన ప్రధాని మోదీ, అప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గార్ల స్వచ్చభారత్ – స్వచ్చాంధ్రప్రదేశ్ పిలుపులకు 10 మాసాల ముందే – స్వచ్చ చల్లపల్లి కార్యాచరణకు చొరవచేసిన దాసరి రామకృష్ణ ప్రసాదు, చల్లపల్లి జనవిజ్ఞానవేదికల ప్రయత్నం ఇంతంతై – 2000 దినాల స్వచ్చోద్యమంగా పరిణమించడం నాకిప్పటికీ నమ్మశక్యం కావడం లేదు. ఎక్కడెక్కడి – ఎందరెందరి గ్రామాలను, ప్రజలను కదిలించి, ఈ నాటికీ నిత్యనూతనంగా కొనసాగుచున్న మన స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమంలో నేను సైతం వేలుపెట్టినందుకు – పాలుపంచుకున్నందుకు నాది పూర్తి సంతృప్తి!

            ఇన్ని వేల దినాల – ఇన్ని లక్షల పని గంటల స్వచ్చోద్యమం ఈ గ్రామస్తులు 30 వేల మందికి ప్రయోజనకరమైనందుకు, ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం ఆత్మ సంతృప్తి దాయకంగా సాగుతున్నందుకు నా అభివందనాలు. వందలాది స్వచ్చ కార్యకర్తల ఈ కుటుంబం నిస్వార్ధమైన కణ్వమహర్షి ఆశ్రమ కుటుంబమనుకుంటే, ఈ ఉద్యమ పోషకులు, ఈ కుటుంబ పెద్దలు డాక్టర్ రామకృష్ణ ప్రసాదు, డాక్టర్ పద్మావతి గార్లు!

            వీసమెత్తు స్వార్ధం లేక – తమ విలువైన కాలాన్ని, శ్రమను, అవసరమైనప్పుడు తమ శక్తి మేర ధనాన్ని ఈ గ్రామం కోసం సమర్పిస్తున్న ప్రతి స్వచ్చ సైనికుడు ధన్యుడే!

            ఏ కొంచెం అవకాశం దొరికినా, ఈ ప్రాతఃకాల గ్రామ బాధ్యతలో పాల్గొని, ఉడతాభక్తిగా ధన – శ్రమదానాలు నేను కూడ చేయగలుగుతున్నందుకు, ఆనందం పొందుతున్నందుకు, నా వరకు నేను కూడా ధన్యుడినే! ఈ చారిత్రాత్మక స్వచ్చోద్యమానికి నా నిబద్ధత కొనసాగుతూనే ఉంటుందని విన్నవిస్తూ -  

- దాసరి శ్రీనివాసరావు,

హీరో షోరూం,

చల్లపల్లి.

            02.05.2020.