గౌరిశెట్టి నరసింహరావు ....           07-May-2020

  2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు 

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 4   

జై స్వచ్చ - సుందర – ఆరోగ్య – ఆనంద చల్లపల్లి

            గత 2000 రోజులుగా నిరంతరంగాను, ఇక మీద నిరవధికంగానూ జరగనున్న స్వచ్చోద్యమ చల్లపల్లి ప్రస్థానం నాలో, గ్రామంలో ఎన్నెన్ని మార్పులు తెచ్చిందో – ఆలోచిస్తే నమ్మశక్యం కావడం లేదు చల్లపల్లి నా స్వగ్రామం కాదు. ఎక్కడో ప్రకాశం జిల్లాలో పుట్టి, ఉద్యోగ రీత్యా రెండు జిల్లాలు దాటుకొని వచ్చి, ఇక్కడ స్థిరపడి, పరిమిత సంఖ్యలో కార్యాలయ పరిచయస్తులున్న నేను ఇన్ని వందలమంది స్వచ్చ కార్యకర్తలకు ఆత్మీయుడిగా మారడం- వేల కొద్దీ రోజులు నాది కాని ఊరి ప్రజల మేలు కోసం నిత్యం శ్రమించడం ఎలా సాధ్యపడింది? ఒక్క పైసా ప్రతిఫలమాసించక, ఇందరు త్యాగమూర్తుల నడుమ – లక్షల గంటలు శ్రమించి, ఆనందించింది నేనేనా?

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ స్వచ్చోద్యమం తో ఇంతగా ఈ గ్రామ చరిత్రను తిరగరాయడం నాబోటి వాళ్లకెలా సాధ్యపడింది? అని ఆలోచిస్తే – బహుశా ఈ క్రింది నాలుగైదు కారణాలు కావచ్చనిపిస్తున్నది :

1) “మేం ఇంత గొప్ప ఉద్యమ నిర్మాతలం – ఊరికింత పెద్ద సేవ చేస్తున్నాం ...” వంటి అహంకారాలు లేని, కుల మత భేదలెరుగని స్వచ్చ కార్యకర్తలు విడివిడిగా కాక, ఒకటిగా, క్రమ శిక్షణగాపనిచేస్తూ పోవడం.

2) స్వార్ధ మెరుగని సమర్ధులైన ఇద్దరు డాక్టర్ దంపతుల సమయోచిత సారధ్యం లభించడం.

3) డాక్టర్ డి. ఆర్. కె. ప్రసాదు, డాక్టర్ పద్మావతి గార్ల వ్యక్తిత్వ ప్రభావంతో కావచ్చు – వివిధ వృత్తుల – వివిధ నేపధ్యాలు గల సమర్ధులైన వ్యక్తులు, మరీ ముఖ్యంగా ఎన్నడూ ఇలాంటి పనులకు బయటకురాని మహిళలు ఎంతో చొరవగా ఇన్ని వేల రోజుల నుండీ చల్లపల్లి పౌర సమాజానికి ఉపయోగపడే విధంగా తమ సృజనాత్మకతను చాటుతూ పోవడం.

4) ఒక వంక కరోనా లోక మంతటినీ గడగడలాడిస్తున్నా సరేమన డాక్టర్ గారున్నారనే భరోసాతో నేమోగానికార్యకార్తలు వెనకడగు వేయక పాటలు వింటూ – నిస్వార్ధంగా ఊరి కోసం శ్రమించడం.

5) కార్యకర్తలు చెక్కు చెదరని ఐకమత్యంతో, కుల – మత – రాజకీయాల ప్రసక్తే పట్టించుకోక, తమ ఊరి శ్రేయస్సే లక్ష్యంగా - నందేటి శ్రీనివాస్ పాటలతో పునరుత్తేజం పొందుతూ ఒకే దీక్షతో గమ్యం కోసం కదలడం.       

            ఇంకా ఎన్ని కారణాలైనా ఉండవచ్చు, నేను నివసించే ఈ చల్లపల్లి లో వేగంగా వచ్చిన కనిపించిన, కనిపించని మార్పులెన్నో!

            ఆరేడేళ్ళనాడు ఇంత అద్భుతమైన శ్మశానాన్ని, డంపింగ్ యార్డును ఎవరైనా ఊహించారా? ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన RTC బస్ ప్రాంగణాన్ని, కంపుప గొట్టే చోటుల్లో - మలవిసర్జనల చోటుల్లో క్రింద భూగర్భ డ్రైనేజి వ్యవస్థ, పైన కనువిందైన పూల కుండీల, పూల తోటలను గాని,  రహదారి వనాలుగాని, అందమైన – రంగురాళ్ళు పరిచిన విశాలమైన వీధుల్ని గాని, ఇన్ని వేల చెట్లతో పచ్చదనాన్ని గాని ఎవరు కలగన్నారు?

            అందమైన పార్కులు, సెల్ఫీ పాయింట్లు, ప్రజల ప్రయాణికుల కోసం స్వచ్చ – సుందర – పబ్లిక్ టాయిలెట్లు, “బుట్టలు తీసుకురారండోయ్” అనే పాటతో చెత్త బండ్లు, ఆనంద ఆదివారాలతో విద్యార్ధుల్ని ఉత్తేజపరిచే సాంస్కృతిక ఉత్సవాలు, వీటన్నిటి వెనుక వందలాది కార్యకర్తల లక్షలాది పని గంటల  శ్రమ, లక్షల్లో – కోట్లలో ధనవ్యయాలు – ఇన్ని అద్భుతాలు నా చల్లపల్లి లో కాక ఇంత స్వల్పకాలంలో ఇంకా ఎక్కడ జరుగుతాయి?

            అవార్డుల కోసం మా చల్లపల్లి స్వచ్చోద్యమం జరగడం లేదు. ఆ అవార్డులన్నీ నా సోదర స్వచ్చ కార్యకర్తల శ్రమతోనే స్వచ్చ సైన్యాన్ని వెదుక్కొంటూ వస్తున్నాయి. ఇంత అద్భుతమైన – ఆదర్శమైన – ఉదాహరణ ప్రాయమైన – న్యాయమైన – సజీవ ఉద్యమాన్ని వదలి దూరంగా నేనెన్నడూ లేననీ, ఇకముందైనా ఉండబోనని - అదినా అదృష్టమనీ విన్నవించుకొంటూ –

- గౌరిశెట్టి నరసింహరావు,  

స్వచ్చ సుందర కార్యకర్త, చల్లపల్లి,

03.05.2020.