ఘంటశాల విజయరమ....           10-May-2020

2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు 

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర –7 

నా స్వచ్చ సుందర చల్లపల్లి :  

            ఈ మే నెల 3 వ తేదీన 2000 రోజుల మైలు రాయిని చేరుకొన్న స్వచ్చ శుభ్ర – సుందర చల్లపల్లి సుదీర్ఘ – సునాయాస ప్రయాణం గురించి తలచుకొంటేనే నా మనసు పులకరిస్తున్నది! మానవతా విలువలులుప్తమై పోతున్న – పాపభీతి అడుగంటిపోతున్న – స్వయం కృషికి తిలోదకాలిస్తున్న  - పరాన్న జీవనతత్త్వం క్రమ్మేస్తున్న – ఎవరో వచ్చి ఉద్దరిస్తారనే భ్రమలో ఉన్న ఈ సమకాలిక సమాజానికి వేదికలెక్కి ఉపన్యాసాలతో కాక – ఆదర్శాల వల్లెవేతతో కాక – ఆర్భాటాల మ్రోత లేకుండ ఆరు సంవత్సరాల నుండి గాంధీజీ ఆశయాలను నిశ్శబ్దంగా ఆచరించి చూపుతున్న చల్లపల్లి స్వచ్చ సైనికులకు నా అభివందనాలు.

            2000 రోజులుగా గ్రామస్తులెవ్వరినీ నొప్పించక – అదే సమయంలో తమ గ్రామ – స్వచ్చ – శుభ్ర – సౌందర్యాల విషయంలో రాజీపడక – తమ ఆశయాల్లో దృఢంగా నిలుస్తూ – వంకలు పెట్టే అవకాశమివ్వక – నెమ్మదిగా – క్రమక్రమంగా – సక్రమంగా చల్లపల్లి రూపురేకల్ని మార్చుతూ – తమ నిరంతర కృషిలో ఆనందిస్తూ ఋజు మార్గంలో సాగటమంటే మాటలు కాదు!

            ఈ విజయానికి కారణాలు : కార్యకర్తల సంయమనం, తాత్త్వికత, క్రమశిక్షణ, ఐకమత్యం, తమ గమ్యం పట్ల సడలని దీక్షలు కావచ్చు. ఆదర్శప్రాయులైన మన స్వచ్చోద్యమ నాయకుల సమయ స్ఫూర్తి, చాకచక్యం, సమర్ధతలు కావచ్చు! జాగ్రత్తగా – నిష్పక్షపాతంగా పరిశీలించే వారెవరైనా - ఇంత పెద్ద గ్రామంలో భౌతికంగా మారిన శుచి – శుభ్రత – పచ్చదనం వంటి వాటిని, ప్రజల ఆలోచనలో సానుకూలంగా వచ్చిన మార్పులను అంగీకరించక తప్పదు మరి!

            ఒక ప్రాధమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయినినైన – ఘంటశాల విజయరమ అనే నేను చల్లపల్లి స్వచ్చ సుందర ఉద్యమం నుండి క్రమశిక్షణ, సమయపాలన, త్యాగ గుణం, ఋషి(సామాజిక) ఋణ విముక్తి వంటి పాఠాలెన్నో నేర్చుకున్నాను. నేను, నా భర్త రాయపాటి రాధాకృష్ణ యధాశక్తిగా ఈ ఉద్యమంలో భాగస్వాములైనందుకు మాకు, మా కుటుంబానికి పూర్తి సంతృప్తిని ప్రకటిస్తూ -

ఘంటశాల విజయరమ,

స్వచ్చ కార్యకర్త,

06.05.2020.