కస్తూరి శ్రీనివాసరావు....           11-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు 

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర –8 

సోదర స్వచ్చ కార్యకర్తలకీ,  మనకోసం మనం ట్రస్టుకీ, ట్రస్టు బాధ్యులకీ, ఉద్యోగులకీ – ముఖ్యంగా 2000 రోజుల నిరాటంక-నిర్విఘ్న

స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమానికీ నా అభినందనలు.

1700 రోజులు పైగా నా జీవితంలో భాగమైపోయిన - పైన పేర్కొన్న విషయాలకు నా అభివందనాలు అర్పించడం నా బాధ్యత!

          నేను గాని, వందలాది మన స్వచ్చ కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు గాని ఊహించలేని, కనీసం కలగనలేని మార్పులు మన ఊళ్లో జరిగాయంటే- అది మనలోని ఐకమత్యం వల్లే; మనం ఎంచుకొన్న లక్ష్యం పట్ల చిత్తశుద్ధి వల్లే; ఇంకా-మన స్వచ్చోద్యమ నాయకత్వం వల్లే అని కూడా చెప్పగలను. విడివిడిగా మనవి చిన్న కుటుంబాలు కాని వందకు పైగా వ్యక్తులున్న మన ఉమ్మడి స్వచ్చ కుటుంబం చాలా పెద్దది, మహా శక్తి వంతమైనది.

          ఈ కుటుంబ పెద్దల ఆధ్వర్యంలో మనం స్వచ్చ-సుందర-చల్లపల్లి సాధన కోసం సమష్టి నిర్ణయాలు తీసుకొంటున్నాం; క్రమ శిక్షణతో అమలు చేస్తున్నాం! ఏరోజు ఎవరు హాజరుకాకున్నా, వారి యోగ క్షేమాలు ఆరా తీస్తున్నాం; కార్యకర్తలందరి శుభ-అశుభ సందర్భాలలో మనం ఏకరూప దుస్తుల్లో వెళ్ళి, పరామర్శించి, సంఘీభావం ప్రదర్శిస్తున్నాం; ఎన్నెన్ని అవార్డుల స్వీకరణ కోసం - ఎన్ని చోట్లకో ఒక బృందంగానే వెళ్లి వస్తున్నాం; కలిసి  శ్రమిస్తున్నాం; నిస్వార్ధ శ్రమలోని ఆనందానుభూతిని పంచుకొంటున్నాం!

          ట్రస్టు ఉద్యోగిగా- సమన్వయ కర్తగా- మనలో చాలామందిని ఫోన్లలో పలకరించడం, రానివారికి మరునాటి ప్రణాళికను వివరించడం వంటి బాధ్యతలు నెరవేర్చడమే నా అదృష్టంగా భావిస్తాను.

          ఇన్ని వేల రోజులుగా తమ సమయాన్ని-శ్రమను-ధనాన్ని త్యాగం చేస్తున్న ఇందరు కార్యకర్తలతో కలిసి నడవడం, మానవ సంబంధాలు అడుగంటుతున్న ఈ కాలంలో “ ఒక్కరికోసం అందరం- అందరికోసం ఒక్కరం -

ప్రతి ఒక్కరం మన గ్రామం కోసం” అని దృఢంగా కలిసి సాగడం మన అందరి అదృష్టం! ఎప్పటికీ ఈ స్వచ్చ-సుందర- చల్లపల్లి ఉద్యమానికే నా ఓటు, నా నిబద్ధత అని విన్నవించుకొంటూ-

కస్తూరి శ్రీనివాసరావు

ఒక వినయ పూర్వక కార్యకర్త.

10.05.2020.