మెండు శ్రీనివాస రావు, ....           12-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు 

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 9

నా దృక్పథంలోను, జీవితంలోను పెను మార్పులు తెచ్చిన

          2000 దినాల స్వచ్చోద్యమానికి అభివందనం

మిత్రులారా! రెండు వేల దినాల- రెండు లక్షల పైగా పని గంటల సహచర కార్యకర్తలారా! ఇది ఇతరులతో బాటు మనల్ని మనం సైతం అభినందించుకోదగ్గ సందర్భం అనిపిస్తున్నది. ఐతే- మా వంటి, సజ్జా ప్రసాదు గారి వంటి కొందరు కార్యకర్తలకు మాత్రం ఇది వరలో” మన స్వచ్చోద్యమానికి ప్రచారాలతో, అభినందలతో పనేముందనీ, వేకువనే నాల్గు గంటలకు వచ్చామా మనం-చేయగలిగిన బాధ్యతలేవో చేసామా-6.00 తరువాత నిశ్శబ్దం గా ఇంటికి తిరిగి వెళ్లామా.... అన్నట్లుగా ఉండాలనిపించేది. రెండు గంటలపాటు ఈ పాటలూ, పద్యాలూ వినడమేమిటి-నందేటి శ్రీనివాసుని  పాట లేమిటి-చివర్లో మళ్లీ సమీక్షా  ఉపన్యాసాలేమిటి... అని కూడ అనుకొనేవాడిని.

 నా పేరు మెండు శ్రీనివాస రావు – పోస్టాఫీసు ఉద్యోగిని, స్వచ్చోద్యమం తొలి నాళ్ల నుండి- అనగా 31 వ రోజు నుండి నా చల్లపల్లి శుభ్ర-సుందరీకరణ కోసం ప్రయత్నిస్తూ – సంతృప్తి పొందుతున్నవాడిని, తమ జన్మ గ్రామం కాని ఈ చల్లపల్లి భవితవ్యం కోసం ప్రతి క్షణం తపన చెందే డాక్టర్ డి.ఆర్.కె , డాక్టర్ పద్మావతి , శాస్త్రి మాష్టారు తదితర పెద్దల త్యాగాలను నిత్యమూ గమనిస్తున్న వాణ్ణి .

మనం కోరుకోకున్నా మన స్వచ్చోద్యమాన్ని జగత్ప్రసిద్ధం చేసిన పాత్రికేయ మిత్రులనూ, ఐక్యరాజ్యసమితిలో కూడా  దీన్ని 12 నిముషాల పాటు గొంతెత్తి నినదించిన – వివరించిన నాదెళ్ల సురేష్ వంటి వారిని చూసి ఆశ్చర్యపడుతూ ఉండేవాణ్ణి. ఇక ఇప్పుడు పెద్దలు- నల్లూరి రామారావు గారి ప్రోద్భలంతో తప్పని సరై ఈ నాల్గు మాటలూ వివరిస్తున్నాను.

ఒకప్పటి నా సహాధ్యాయిని, ప్రస్తుతం మస్కట్ దేశ నివాసిని- దోనేపూడి సుధారాణి గతంలో మన స్వచ్చోద్యమ వాట్సాప్ లోఅప్పుడప్పుడూ నేను పని చేస్తున్న ఫోటో చూసి, ఫోన్ చేసినపుడూ, అమెరికాలోని ప్రొఫెసర్ శ్రీ రాజేశ్వర రావు గారు అభినందించినపుడూ- ఈ స్వచ్చోద్యమ చల్లపల్లి ఘనతను ఊహించి, నేనూ సంతోషించాను.

పాతిక ముప్పై ఊళ్లే కాక మండలాలన్నీ, జిల్లాలు, రాష్ట్రాలన్నీ, ఈ నిస్వార్థ స్వచ్చోద్యమాలు మొదలు పెడితే -  పట్టుదలతో కొనసాగిస్తే మన దేశ ఆరోగ్య ఆనంద సూచికలు నిట్ట నిలువునా పైకి వస్తాయనీ, అంత వరకూ సహచర కార్యకర్తలందరితో బాటు నేనూ శ్రమిస్తూనే ఉంటాననీ విన్నవిస్తూ....

మెండు శ్రీనివాస రావు, 

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త.

09.05.2020