కస్తూరి విజయ్....           13-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు 

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 10 

ఒక అరుదైన- విజయవంతమైన

సామాజిక అద్భుతం- 2000 రోజుల చల్లపల్లి స్వచ్చ ఉద్యమం

ప్రత్యేకించి ఏ గమ్యమూ లేని నా జీవితంలోనూ – నా దృక్పథంలోనూ సానుకూలమైన మార్పుకు కారణమైన స్వచ్చ చల్లపల్లి కార్యకర్తల కుటుంబానికీ, ఉడుం పట్టు పట్టి చల్లపల్లి లో ఆశ్చర్యకరమైన మార్పులు తెచ్చిన చరితార్థమైన స్వచ్చోద్యమానికీ అభివందనాలు! కేంద్రంలో ప్రధానీ, రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రీ ఇచ్చిన పిలుపుల కన్న ముందే గంగులవారిపాలెం బాటలో మొదలై, మిగిలిన గ్రామమంతటికీ ప్రాకి, ఆ తరువాత రాష్ట్రంలో-దేశంలో-ఐక్యరాజ్యసమితిలో కూడ అనుసరింపబడుతూ-అభినిందించ బడుతున్న ఈ ఆదర్శ శ్రమదానంలో నేను 560 వ రోజున మాత్రమే పాల్గొన్నాను. నిజం చెప్పాలంటే- తొలి 50-100 రోజుల వరకూ ఈ పవిత్ర కార్యక్రమాన్ని చులకన చేసి, ఎగతాళి చేసిన వాళ్లలో నేనూ ఒకణ్ణి!(చేసిన పాపం చెప్పుకొంటే పోతుందంటారు!)

ఐతే ఒక్కసారి కమిట్ అయిన తరువాత మాత్రం మనస్పూర్తిగానూ, శక్తి వంచన లేకుండానూ పని చేశాను. (రామారావు మాస్టారు నా బరువు పనుల మీద పద్యాలు రాసి- చదివారు కూడ)!

డి.ఆర్.కె. ప్రసాదు గారి ఓర్పు, పద్మావతి గారి నేర్పు, తోటి కార్యకర్తల నిబద్ధత, సహనం, కులమతాలకు- రాజకీయాలకు అతీతంగాను, సమైక్యంగాను ఈ సుదీర్ఘ శ్రమదాన ఉద్యమము జరుగుతున్న తీరు, ఇందరి క్రమ శిక్షణ, నాకు ప్రతి రోజూ ఆశ్చర్యకరంగానే ఉంటాయి. ఇందరు నిస్వార్థ కార్యకర్తలు పోటాపోటీగా-డ్రైన్లు శుభ్రపరిచి- రోడ్లు ఊడ్చి- శ్మశానాలు, డంపింగ్ యార్డుల్లో పనిచేసి, “అన్న- అక్క-బావ-బాబాయ్-తమ్ముడు-పిన్ని” - వరుసలతో ఆప్యాయంగా పలకరించుకొంటూ- మనకోసంకాక – గ్రామం కోసం ఇన్ని రోజులు పాటు బడటమే ఒక అద్భుతం.

నా అసలు పేరు కస్తూరి విజయ్.  ఐతే- చల్లపల్లి స్వచ్చ-సుందర- చల్లపల్లి గా మారినట్లే నా పేరును కూడ మార్చి “స్వచ్చ భారత్ విజయ్” అని పిలుస్తున్నారుకరోనా లాక్ డౌన్లే అడ్డుకోని స్వచ్చోద్యమానికి 3000-4000.... రోజుల ప్రయాణం ఒక లెక్కా?

- కస్తూరి విజయ్

10.05.2020