తూము వేంకటేశ్వరరావు....           14-May-2020

2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు –

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 11

 విజయీభవ! స్వచ్చోద్యమ వినుత చల్లపల్లి!

అది 2013 డిసెంబర్ 20 నాటి సంగతి : పద్మావతి హాస్పిటల్ డాక్టర్లు, ఒకరిద్దరు నర్సులు, సాయి నగర్ వాసులు – మొత్తం ఏడెనిమిది మంది ఉదయం 4.00 నుండి 7.00 వరకు గంగులవారిపాలెం దారి లో అతి ఘోరంగా ఉన్న బహిరంగ మలవిసర్జకులను – గాంధేయ పద్దతిలో – బ్రతిమాలి - నమస్కరించి – నచ్చ జెప్పే ప్రయత్నం మొదలు పెట్టారు. రెండు మాసాలకు వారి ప్రయత్నం ఫలించి – అది కూడా మనుషులు నడవదగిన రోడ్డుగా మారింది. ఆ బాటను మరికొంత సంస్కరించి – ఆ అనుభవంతో “చల్లపల్లి లోని ఇతర చోట్లలో గూడ ఇదే ప్రయోగం చేయగలమనే ధైర్యంతో 12.11.2014 న మొదలైనదే ఈ స్వచ్చ చల్లపల్లి ఉద్యమం.

            కొన్నాళ్ల తర్వాత అందులో కార్యకర్తగా కుదురుకొన్న నేను ఈ వేకువ కార్యక్రమాన్ని ఫోటోలు తీసి, ఫేస్ బుక్ లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత మన గురువు – శాస్త్రి గారు ఆ సామాజిక మాధ్యమ సంగతిని చూసుకొంటున్నారు. నేను తక్కిన కార్యకర్తల్లో ఒకడినై – కత్తి, గొర్రు చేతబట్టాను.

            ఇక ఇప్పుడు – ఈ 2000 రోజుల విలక్షణ కృషిని, దానితో అనూహ్యంగా మారిపోయిన మా చల్లపల్లిని తలచుకొంటే – ఎంత అద్భుతంగా ఉన్నదంటే – అదొక గమ్మత్తుగా – ఒక ట్రాన్స్ లో జరిగిపోయిందా అనిపిస్తున్నది. అలా అనుకోవడానికి కూడా వీల్లేదు. ఈ సాత్విక మహోద్యమం అద్భుతమైన ప్రణాళికతో – అవగాహనతో – క్రమ శిక్షణ తో – అంకితభావంతో – ఐకమత్యంతో - సొంత లాభం మాని – గ్రామ హితం కోరి – ప్రతి రోజూ 30 – 40 -50 మంది ఒక తపస్సు లాగా – యజ్ఞంలాగా – ఒకే మాటగా – ఒకే బాటగా – ఎన్నో జిల్లాల – రాష్ట్రాల – గ్రామాలకు స్ఫూర్తిదాయకంగా  -నిరంతరాయంగా – స్వచ్చంగా – పారదర్శకంగా సాగుతున్న  సామాజిక బాధ్యతా నిర్వహణం మరి.!

            ఇదంతానా ఊరి అదృష్టం! ఇంత మంది త్యాగధనుల – ఆదర్శ మూర్తుల - సార్ధక శ్రమ జీవులతో ఇంత సుదీర్ఘ అనుభవాన్ని, అనుబంధాన్ని పెంచేసుకుని – అట్టివాళ్లతో భుజం కలిపి పనిచేసిన నాది కూడ అదృష్టం! వీళ్ళందరితో కలవకనేనొక్కడినే ఈ మహాకార్యంలో ఏ ఒక్క శాతమైన చేయగలిగేవాడినా?

            అసలు ఎన్నడూ గడపదాటని మహిళలు వేల రోజుల పాటు వారి గ్రామ క్షేమం కోసం ఆఖరికి శ్మశానాలలో కూడా ఎలా పాటుబడగలిగారో అందరం ఆలోచించాలి!

            VRO గా బదిలీ మీద యార్లగడ్డ కు వెళ్ళిన నేను 2019 లో గాంధీ జయంతి నాటి నుండి  - 220 రోజులుగా ఆ గ్రామ పెద్దల – సహృదయుల సహకారంతో “స్వచ్చ యార్లగడ్డ” ప్రయత్నం చేస్తున్నానంటే అదంతా మా స్వచ్చ చల్లపల్లి కార్యకర్తల – నాయకుల – ఉద్యమ స్ఫూర్తితో కాదూ?

            ఇన్ని అద్భుతాలకు కారణమైన స్వచ్చ చల్లపల్లి ఉద్యమ భాగస్వామినైనందుకు, యార్లగడ్డ స్వచ్చోద్యమ నిర్మాతలలో ఒకడైనందుకు – జీవిత కాలానికి సరిపడినంత తృప్తితో ....

తూము వేంకటేశ్వరరావు

VRO యార్లగడ్డ.

          11.05.2020.