పాగోలు దుర్గా ప్రసాదు....           15-May-2020

2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు 

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 12

చారిత్రాత్మక చల్లపల్లి ఉద్యమంలో కలికి తురాయి 2000 రోజుల ఈ స్వచ్చ సుందర ఉద్యమం

            పాగోలు వాస్తవ్యుడనైన నేను ప్రభుత్వ పాఠశాలలో పదేళ్ళపైబడి – సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడిని. అతి దయనీయమైన చల్లపల్లిని, పరోక్షంగా మా పాగోలు గ్రామాన్ని 2000 రోజులుగా శ్రమించి, దర్శనీయ – పరిశుభ్ర స్వచ్చ – సుందర గ్రామాలుగా మార్చివేసిన స్వచ్చ సైనికులందరికీ, ఉద్యమ నాయకత్వానికీ ముందుగా నా ధన్యవాదములు, అభినందనలు!

     కారణాంతరం వల్ల నేను 700 రోజుల తర్వాత మాత్రమే ఈ ఉద్యమంలో పాల్గొన్నాను. ఆ తొలి నాటి వేకువ జామున నేను చూసిన శ్రమదాన దృశ్యాలు ఎంత ఆశ్చర్యం కలిగించాయంటే – ప్రతి ఒక్క దానిని ఇప్పటికీ గుర్తుంచుకొనేంతగా! 45 – 50 మంది వయో వృద్ధులు, గృహిణులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు – రైతులు ఖచ్చితంగా సమయపాలనతో వేకువ నాల్గున్నరకే ఆ చలిలో ఎలా వచ్చారు? సుశిక్షుతులైన ఉద్యోగుల్లా ఎవరి చీపురును, గొర్రును, కత్తిని, తలదీపాన్ని , చే తొడుగుల్ని వారే చకచకా ధరించి ఊరికోసం నిస్వార్ధంగా ఎందుకు పనిచేశారు! 6.00 కు డాక్టర్ గారి పని విరామ సూచక విజిల్ మ్రోగినా కొందరింకా పని కొనసాగించడం – ఆతదుపరి కాఫీ సేవనం, ఆ నాటి శ్రమదాన సమీక్ష వింతగా అద్భుతంగా అనిపించి, ఇక అప్పటి నుండి వీలైన ప్రతి రోజూ పాల్గొనాలని నిర్ణయించుకొన్నాను!

            చల్లపల్లి లో ప్రతిరోజూ వ్యక్తిగత మరుగు దొడ్ల ఏర్పాటుకు సాయపడి, ఆ గ్రామంలోనే కాక మా పాగోలు బాటలో కూడ బహిరంగ మల విసర్జన నిర్మూలనకు పరోక్షంగా  ప్రత్యక్షంగా కారకులు ఈ కార్యకర్తలే. చల్లపల్లి లో అడుగడుగునా రోజురోజుకీ వచ్చిన సానుకూల మార్పులు, వద్దన్నా వచ్చిపడిన రాష్ట్రీయ – దేశీయ గుర్తింపులు, అవార్డులు, నాటి పెంచిన పాతిక ముప్పై వేల హరిత - సుందర పూల మొక్కలు, వాటన్నిటికీ పాదులు, ముళ్ళ కంచెలు, ఈ దైనందిన దృశ్యాలను ఫేస్ బుక్ లో నిక్షిప్తాలు, - ప్రత్యక్షంగా చూడని వాళ్ళు ఇవన్నీ నమ్మశక్యాలేనా?

            మా పాగోలు రోడ్డు ఇంత అందంగా – శుభ్ర సుందరంగా ఉండి – ఎక్కడెక్కడో ఉన్న మా గ్రామస్తులు వచ్చి చూచి, ఆనందిస్తున్నారంటే – అదంతా ఈ చల్లపల్లి స్వచ్చోద్యమం చలవ కాదూ? ఉద్యమ నాయకులకు, పెద్దలకు, పిన్నలకు, నా శత కోటి ధన్యవాదాలు. ఈ ఉద్యమం పట్ల నానిబద్ధత ఎప్పటికీ ఇలాగే ఉంటుందని సగర్వంగా, సహార్షంగా ప్రకటిస్తూ ....

- పాగోలు దుర్గా ప్రసాదు

           (15.05.2020)