డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణయ్య - 21.11.2023 ....           21-Nov-2023

ఆనంద - ఆరోగ్య వర్థిని – మా స్వచ్చోద్యమ చల్లపల్లి.

ప్రతి బ్రహ్మముహుర్తంలోనూ పాతిక ముప్పై మందితో కలిసి, పాతిక – ముప్పై వేల మంది గ్రామస్తుల ఆరోగ్యం కోసం శ్రమించడం ఎంత సంతోషమో కదా!

ఈ ఉద్యమం తొలి రోజుల్లో వినడానికి వింతగా అనిపించింది - తుస్సు మనకుండా ఎన్నాళ్లు నిలుస్తుందిలే అనిపించింది. చూస్తుండగానే 50-100-200 రోజులు గడిచిపోతే గాని నేనందులో కలవలేదు. మొక్కల్ని ప్రాణప్రదంగా చూసుకొనే నాకు కార్యకార్తలు వేల కొద్దీ మొక్కలు రహదార్లలో నాటి పెంచడం స్ఫూర్తి నిచ్చింది.

శ్రమదానంలోకి కాస్త ఆలస్యంగా వచ్చినా అందరు కార్యకర్తల్తో బాటు శ్రమదానం బాట పట్టడం సంతృప్తినిచ్చింది. తొలి రోజుల్లో సైకిళ్ల పైన నీటి పీపాలతో మొక్కలకు నీరు అందిస్తుంటే - మా ముగ్గురమ్మాయిలతో సంప్రదించి ఒక నీళ్ల టాంకరును విరాళంగా ఇచ్చాను.

సజ్జా ప్రసాదు, శివరామకృష్ణయ్య, బృందావన్, శాస్త్రి వంటి వార్లతో కలిసి ముళ్ల కంపను సేకరించి మొక్కల రక్షణకు కంప కట్టినవి నాకు మధురక్షణాలు!

ఇన్ని వేల రోజుల శ్రమదానంతో అర్థమైనదేమంటే - నిజమైన తృప్తి తోటి వారికి తోడ్పడటంలోనే ఉంటుందని!

ఇక రెండో గ్రామ సేవ రోడ్ల ప్రక్కన పేవర్ టైల్స్ వేయడం. DRK - పద్మావతీ డాక్టర్లు న్యూజిలాండ్ నుండి వచ్చాక 1 వ వార్డు ముఖ ద్వారం వద్ద అది మొదలైనట్లు గుర్తు! దాని ఖర్చులో కొంత సమకూర్చే పనిలో శాస్త్రి గారితో కలిసి, చాల మంది దగ్గరకు విరాళం కోసం వెళ్లేవాడిని.

షాపుల వారికి, గృహస్తులకు పారిశుద్ధ్యం గురించి నచ్చజెప్పేందుకు సాయంత్రాల్లో ఊరంతా తిరిగిన రోజులు, ఎదురైన అనుభవాలు మరువలేను! మన సమష్టి కృషితో చల్లపల్లిలో జరిగిన పరివర్తన చూసి, అవనిగడ్డ, నాగాయలంక, ఘంటశాల, యార్లగడ్డ వంటి 30 కి పైగా ఊళ్లు మేల్కొని – అందులో కొన్నిట్లో ఇప్పటికీ శ్రమదానం నడుస్తున్నది!

స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం 800 రోజుల పిదప నారాయణరావునగర్ లో మొదలైన శ్రమదానం వెయ్యిరోజులు సాగింది. స్వచ్ఛ, సంస్కృతిని ప్రచారం చేసిన ఆనంద ఆదివారాలు, అవార్డుల స్వీకారానికి చేసిన యాత్రలూ, అన్నీ గ్రామ చారిత్రక సంఘటనలే!

84 ఏళ్ల వయోభారం, గతంలో జరిగిన మోకాళ్ళ, గుండె ఆపరేషన్లూ నడుం సమస్యలూ అప్పుడపుడూ ఆపితే తప్ప ఈ స్వచ్చంద శ్రమ నిష్ణాతుల సాహచర్యాన్ని ఎన్నడూ వదులు కోలేదు! మన ఐకమత్యమూ, శ్రమదాన విజయాలూ, ఎప్పటికీ  ఇలాగే కొనసాగుతాయనే నా నమ్మకం!

- డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణయ్య

   21-11-2023