ప్రాతూరి శాస్త్రి - 23.09.2020. ....           23-Sep-2020

2017 లో స్వచ్చాంధ్ర కమీషన్ వారు డా. డీఆర్కే గారిని ఏకైక సభ్యుడిగా నియమించారు. స్వచ్చాంధ్ర కమీషన్ సభ్యులుగా సచ్చతే సేవ గూర్చి పలు గ్రామాలలో శ్రమ సంస్కృతి ని గూర్చి వివరించడానికి గ్రామాలు తిరిగాము.  

 

మా స్వచ్ఛ సుందర చల్లపల్లి రధసారధి గారికి స్వచ్ఛ శ్రామికునికి దక్కిన అరుదైన గౌరవం. స్వచ్ఛ సుందర సాధన కోసం శ్రమిస్తున్న స్వచ్ఛ చల్లపల్లి రథసారథి, మన కోసం మనం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ప్రముఖ వైద్యులు డాక్టర్ డీ. ఆర్కే. ప్రసాద్ గారు స్వచ్ఛ ఆంధ్ర మిషన్ రాష్ట్ర స్థాయి కమిటీకి గౌరవ సభ్యులుగా ప్రభుత్వంచే నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ జీవో నెం.1591 విడుదల చేసింది. ఈ గౌరవం సాధించిన డీఆర్కే గారికి, మేడమ్ పద్మావతి గారికి శుభాకాంక్షలు. డీఆర్కే గారి అడుగులో అడుగేస్తున్న స్వచ్ఛ కార్యకర్తలు అందరూ గర్వించదగిన గుర్తింపు ఇది. 

స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల నిమ్మకూరు, కొమరవోలు, పెదపారుపూడిల పర్యటన...

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమంవలె ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన గ్రామాలలో స్వచ్ఛ ఉద్యమాలు నిర్మించటానికి, వాటిలో ప్రజలను భాగస్వాములను చెయ్యాలనే సంకల్పంతో స్వచ్ఛాంధ్ర మిషన్వారు రూపొందించిన కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు’ 29 మంది అక్టోబర్ 28వ తేదీన నిమ్మకూరు, కొమరవోలు, 29 వ తేదీన 23 మంది పెదపారుపూడి గ్రామాలను సందర్శించటం జరిగింది.

స్వచ్ఛాంధ్ర మిషన్ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డా. సి.ఎల్. వెంకట్రావు గారు, వారి P.S. ప్రాతూరి విద్యా సాగర్ గారు, MDO, తహసీల్దార్ గారితో సహా ఆ మండలానికి సంబంధించిన అధికార బృందం, ZPTC, MPP, సర్పంచ్ లతో సహా ప్రజా ప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

గ్రామ పర్యటన జరిపి అభివృద్ధి జరుగుతున్న తీరు, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు విపులంగా చర్చించటం జరిగింది. నిమ్మకూరులో నిర్మింపబడుతున్న భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను అందరూ ఆసక్తిగా పరిశీలించారు.

కొమరవోలులో గుట్కా, పాన్ పరాగ్, సిగరెట్లు, మద్యం అమ్మటం గాని, బహిరంగంగా సేవించటం గాని నిషేధించారని తెలిసి ఆశ్చర్యం, సంతోషం కలిగింది.

పెదపారుపూడిలో డంపింగ్ యార్డ్ని వారు డంపింగ్ పార్క్గా నామకరణం చేశారు. నిజంగానే అది పూల మొక్కలతో పార్క్ వలెనే ఉన్నది. అక్కడ ఘనవ్యర్ధపదార్ధాలను నిర్వహించే విధానాన్ని సర్పంచ్ గారు వివరించారు. శాస్త్రీయంగా నిర్వహించబడుతున్న ఈ విధానాన్ని చూసి కార్యకర్తలందరం చాలా సంతోషపడ్డాం. రామోజీ ఫౌండేషన్ వారు వేయించిన సిమెంట్ రోడ్డు, కట్టించిన ZP స్కూల్ భవనం, రుద్రభూమి, వాటర్ ట్యాంక్, అంగన్ వాడీ భవనం ఆ ఊరికి వరం. అనంతరం స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంజరుగుతున్న తీరు గురించి Power Point Presentation ను అప్పటికప్పుడు Presentation చేయాలని నిశ్చయించుకుని ముగ్గురు కార్యకర్తలు గుడివాడ వెళ్ళి Projector ను తీసుకువచ్చి ప్రదర్శించడం జరిగింది. పెదపారుపూడి వారు Presentation చూసాక స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలకు లాల్ సలాం చేశారు. 

అన్ని గ్రామాలలోనూ స్వచ్ఛ చల్లపల్లియొక్క ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది.

నిమ్మాకూరు, కొమరవోలు గ్రామాలను నారా లోకేష్ బాబు గారు, నారా భువనేశ్వరి గారు, పెదపారుపూడి ని చెరుకూరి రామోజీ రావు గారు దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి బాగా జరుగుతోంది. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈ అభివృద్ధి ఫలితాలను నిలబెట్టుకోగలం కనుక స్వచ్ఛ కార్యక్రమాలలో ప్రజలను మమేకం చేసేటట్లుగా మనం కార్యక్రమాలను రూపొందించుకోవాలి.

- ప్రాతూరి శాస్త్రి

23.09.2020.