ప్రాతూరి శాస్త్రి - 25.09.2020.....           25-Sep-2020

 పరిశుభ్రతా యజ్ఞానికి 100 రోజులు...

            ప్రధాని మోడీ గారు అక్టోబర్ 2, 2014 న దేశంలో బహిరంగ మలవిసర్జన రూపుమాపాలని స్వచ్ఛ భారత్ కై పిలుపునిచ్చారు.

            అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పిలుపునివ్వగా కొన్ని గ్రామాలను మంత్రులు దత్తత తీసికొని పరిశుభ్రం చేయదలచారు.

            అప్పటి ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గారు చల్లపల్లిని దత్తత తీసికొనదలచి అన్ని సంఘాల వారితో చల్లపల్లిలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు.

            ఒక సంవత్సరం పాటు రహదారులు శుభ్రపరుస్తామని జనవిజ్ఞానవేదిక సభ్యులు వాగ్దానం చేశారు.

            నవంబర్ 12, 2014 న ఉద్యమం ప్రారంభించారు. 2014 మార్చి 1100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఓ ఉత్సవంలా జరిపినారు.

            బుద్ధప్రసాద్ గారు, లంకబాబు గారు, కృష్ణకుమారి గారు, కట్టా పద్మావతి గారు, విద్యాసాగర్ గారు, కార్యకర్తలు వెంటరాగా రధసారధులు కీర్తి ఆసుపత్రి నుండి నినాదాలతో పాదయాత్ర ప్రారంభించారు.

              బైపాస్ రోడ్డులో బాలికల హాస్టల్ వద్ద బుద్ధప్రసాద్ గారు ఓ మొక్క నాటారు.

            డా.పద్మావతిగారు హాస్టల్ పరిసరాలు శుభ్రం చేయించి 3 కమలాలు ఏర్పాటు చేయించారు. వాటిలో మొక్కలు కార్యకర్తలు నాటారు.

            బైపాస్ రోడ్డులో ప్రతి ఇంటి ముందు రంగ వల్లులు తీర్చిదిద్దారు. విద్యార్థిని లను బుద్ధప్రసాద్ గారు పూలమాలతో సత్కరించారు.

            సాగర్ టాకీస్ వరకు సాగిన పాదయాత్ర తిరిగి పద్మావతి ఆసుపత్రికి చేరింది.

            సాయంత్రం కార్యకర్తలు పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ గా నినాదాలతో చల్లపల్లి సెంటరుకి చేరారు.

            సెంటరులో బహిరంగ సభ దిగ్విజయంగా సాగింది.

            బుద్ధప్రసాద్ గారు, లంకబాబు గారు, KCP CEO వేంకటేశ్వరరావు గారు, స్వచ్ఛభారత్ కార్యక్రమాలకు మెంటర్ ఉదయ్ సింగ్ గౌతం గారు, కృష్ణకుమారి గారు, సర్పంచ్ గారు, MDO విద్యాసాగర్, డా.పద్మావతి గారు వేదికనలంకరించగా ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి ముఖ్య అతిధి కాగా డా. డీఆర్కే ప్రసాదు గారు సభ ప్రారంభించారు.

            చల్లపల్లి 100 రోజుల సేవ సమయాన బుద్ధప్రసాద్ గారు చల్లపల్లి ని దత్తత తీసికొంటున్నట్లు ప్రకటించారు.

            కోనేరు హంపి గారు గ్రామంలో నిర్వహిస్తున్న పరిశుభ్రతా కార్యక్రమం చూచి ఆనందపడి చల్లపల్లి అభివృద్ధికి రూ. 25,000 లు విరాళం ఇచ్చారు. ఆ విరాళం తో బస్టాండులో జలసౌధ వాటర్ ట్యాంక్ ను ఏర్పాటుచేశారు.

               ఈ 100 రోజుల పండుగ గ్రామంలో ఎంతోమందిని కార్యకర్తలుగా మార్చడానికి దోహదపడింది.

జై స్వచ్చ సుందర చల్లపల్లి

- ప్రాతూరి శాస్త్రి

25.09.2020.