లంకే SUBHASHINI - పొడి మాటల్లో తేల్చే సంగతా -3000* నాళ్ళ స్వచ్చ సుందరోద్యమం!....           13-Jan-2024

 పొడి మాటల్లో తేల్చే సంగతా -3000* నాళ్ళ స్వచ్చ సుందరోద్యమం!

            “కట్టె - కొట్టె - తెచ్చేఅని ముగించేదా కార్యకర్తల మూడు లక్షల శ్రమదానం? ఆ అనుభవాలు, ఆ అభినివేశాలు, అద్భుతాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, ఉపశమనాలు, దగ్గరుండి వీక్షిస్తే తప్ప చూడని వాళ్లకు అర్థమయేలా చెప్పడానికి మనం కాళిదాసులమా – శ్రీ శ్రీ లమా.  

             స్వచ్చ సుందరీ కర్తలు అవసరమైతే మురుగ్గుంటల్లో తిరుగాడు తారనీ, చిటారు కొమ్మల్ని క్రమబద్ధీకరిస్తారనీ, పరువైన మహిళా వాలంటీర్లు చీకటి వేళ శ్మశానాల్లో రంగవల్లులు దిద్దుతారనీ వ్రాస్తే నమ్ముతారా?

            రోడ్లూడ్చి నొప్పిపెట్టీ, మట్టి డిప్పలు మోసి కాయలు గాసీ కొందరి భుజాలెలా రాటు దేలిందీ స్వానుభవంతో నాకు తెలుసు!

            ఒక రకంగా వీళ్లు అల్ప సంతుష్టులు! ఏరోజుకారోజు తాము శుభ్రపరచిన వీధుల్ని చూసుకొనీ, నాటిన మొక్కలకి కంప కంచెలు కట్టీ, కంపు గొట్టే డ్రైను లో సిల్టు లాగి మురుగును పరుగులుపెట్టించీ, ఎంత సంతోషిస్తారో ప్రతి వేకువలోనూ!

             “తాజమహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలి లెవ్వరు” అని శ్రీశ్రీ గద్దించి అడిగిన ప్రశ్నకు బదులు చెప్పలేను గాని, మురుగు దుర్గంధ చల్లపల్లిని స్వచ్ఛ సుందర చల్లపల్లిగా మార్చిన కూలీలూ - మేస్త్రీలూ, ఇంజనీర్లూ ఈ స్వచ్ఛంద శ్రమదాతలని చెప్పగలను!

            షష్ట్యబ్ది నెప్పుడో దాటేసిన ఒక బాబూరావు - ఒక అంజయ్య- ఒక శివబాబు లాంటి వాళ్ళకు తీసిపోకుండా - ఒక డాక్టర్ పద్మావతి, ఒక నర్సు చిట్టూరి లక్ష్మి, ఒక సుభాషిణి వంటి వాళ్లం చెత్త బండెక్కి నానా కశ్మలాలు సర్దామంటే అది కేవలం ఈ ఊరి శ్రమదానంలోనే సంభవం!

            అసలు స్వచ్ఛ కార్యకర్తల వినోద విహారయాత్రలు, వాటి తాలూకు సూక్ష్మ జాగ్రత్తలు, ప్రణాళికలు, క్రమశిక్షణలే చాలు-  స్వచ్చ శ్రమదాతల ప్రత్యేకత తెలుసుకోవడానికి!

            ఈజిప్టు పిరమిడ్లు, చైనా గోడల్ని ఎన్ని తరాలు పాటు నిర్మించారో తెలియదు. మా స్వచ్ఛ సుందర అనంద చల్లపల్లిని మాత్రం దశాబ్దం నుండీ. గ్రామస్తులు, అధికారులూ బాగా సహకరిస్తే మరొక దశాబ్దమైనా కార్యకర్తలు పాటుబడేందుకు సంసిద్ధులు!

            రోజులు గడిచే కొద్దీ కార్యకర్తల కుటుంబీకులు వాళ్ల నుండి ఇరుగుపొరుగులు, ఆపైన ఇతర గ్రామస్తులు మారుతున్నారు; ప్లాస్టిక్కులు కనిపించని హరిత వేడుకలు క్రమంగా పెరిగిపోతున్నవి.

            జయరాజ్ కవి గారు చెప్పినట్లు- మొన్నమొన్నటి దాక చల్లపల్లి ఒక శిల, 10 ఏళ్లుగా స్వచ్చ  సైనికులు శిల్పులు, ఇంకొద్ది కాలం ఓపిక పడితే మన ఆరోగ్య- ఆనంద - సుందర చల్లపల్లి ఒక సజీవ శిల్పం !

            ఇప్పటికీ గంటన్నర  రోజు వారీ శ్రమదాన విముఖలైన కొద్ది మంది సోదర గ్రామస్తులారా! దయచేసి స్వచ్చ కార్యకర్తల మెదళ్లతో ఆలోచించండి! చల్లపల్లిని స్వచ్ఛ వాలంటీర్ల కళ్లతో చూడండి! త్వరగా కార్యాచరణకుదిగండి!

            రోజుకొక్క గంట ఉన్న ఊరి కోసం శ్రమిస్తే పోయేదేమీ లేదు - అనారోగ్యం తప్ప! వచ్చేది మాత్రం బోలెడు ఆనందం !

- స్వచ్ఛ - సుందర చల్లపల్లి యజ్ఞంలో ఒక సమిధ

   (అనగా లంకే SUBHASHINI.)