కంఠంనేని రామబ్రహ్మం....           24-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 21

2000 రోజుల చల్లపల్లి స్వచ్చోద్యమంలో నా పాత్ర నా కృషి

            నేను పుట్టి పెరిగిందీ, ఉంటున్నదీ కొద్ది  కాలం చల్లపల్లి లో తప్ప పంచాయితీ బిల్లు కలెక్టరుగా 40 ఏళ్ళు ఉద్యోగించిందీ పాగోలు లోనే. పదేళ్ళ నాడు రిటైరై ఖాళీగా ఉన్నప్పుడు - నారంశెట్టి యోగా మాస్టరు జనవిజ్ఞానవేదిక చల్లపల్లి లో 100 నెలల నుండి పేదలకు వైద్య శిబిరం నడుపుతున్నది వాలంటీర్ గా వస్తారా అంటే వెళ్లి - అప్పటి నుండి 114 నెలల పాటు సహకరించాను. మా ఊరి శ్మశానానికి, రోడ్డు నిర్మాణానికీ కొంత కృషి చేశాను. 2014 నవంబరులో చల్లపల్లిలో స్వచ్చంద శ్రమదానం జరుగుతున్నదని తెలిసినా తొలుత నేను వెళ్లలేదు. 25 వేల జనాభా ఉన్న చల్లపల్లి కి నేను రోజూ వెళ్ళి శ్రమదానం చేసేకంటే నా ఊళ్ళో సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు గదా అని తర్జన భర్జనలు పడీపడీ పాగోలు కోసం ప్రయత్నం చేసీ సంవత్సరం తరువాత చల్లపల్లి టీము తో కలిశాను.

            2014 ఎన్నికల్లో ఓటు సక్రమ వినియోగం కోసం జనవిజ్ఞానవేదిక తో కలిసి చాల ఊళ్ళు తిరిగాము గాని, ఏ రెండు మూడు శాతమో తప్ప ఫలితం శూన్యం!

            చల్లపల్లి స్వచ్చంద శ్రమదానం లో నేను రెగ్యులర్ కార్యకర్తనయ్యాక  - ఒకరోజు కాఫీ సమయంలో డాక్టరు DRK గారు ఆ నెలకు వారి ఛారిటబుల్ ట్రస్టుకు విరాళాలు, వ్యయాలు, మిగులు తగుళ్లు చదువుతుంటే నాకు తోచినంత ఆర్ధిక సాయం నేనూ చేస్తానుఅని ప్రకటించి, నా పెన్షను   లో సింహాభాగం చల్లపల్లి, పాగోలు గ్రామాల సౌకర్యాల శుభ్ర సుందరీకరణల కోసం ఖర్ఛు పెడుతున్నాను. చల్లపల్లి లో గోపాళం శివన్నారాయణ గారి వైద్య శిబిరాలకు కూడా విరాళం ఇస్తూ ఉంటాను. తప్పకుండా నేనిక్కడ ప్రస్తావించవలసిన విషయమేమిటంటే దేశంలోని ఎన్నెన్నో చారిటీ సంస్థలకిచ్చిన విరాళాలు ‘0’ (సున్నా) నుండి కొంత శాతం సద్వినియోగమౌతాయంటారు. కానీ, స్వానుభావంతో చెప్పగలను స్వచ్చ సుందర చల్లపల్లి కి ఇచ్చే విరాళం మాత్రం 100 నుండి 200 శాతం ప్రయోజనముంటుంది ట్రస్టు నిర్వహకుల ప్రణాళికకు అదనంగా స్వచ్చ కార్యకర్తల నిస్వార్ధ శ్రమ విలువ చేరికే అందుకు కారణం!

            రాష్ట్రమంత్రులు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఎన్నిక చేసిన అయాచితం గానే ఎన్నెన్నో అవార్డులు పొందిన – 2021 రోజులు గా అరుదైన సేవా భావ జ్వలనంతో సాగుతున్న – 30 కి పైగా ఊళ్లలో ఇలాంటి ఉద్యమాలకు ప్రేరణనిచ్చిన ఐక్యరాజ్యసమితి సైతం గుర్తించిన ప్రతి కార్యకర్త స్వయం ప్రేరితుడై కదులుతున్న ఈ స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమాన్ని నేను మెచ్చాల్సిన అవసరమేముంది? అసలు మన కాలమే మనముంటున్న సమాజమే అభూతకల్పనల - అసత్యాల అర్ధ సత్యాల కలవాటుపడిపోయింది. కాని 2021 దినాల నిత్య నిస్వార్ధ నిరంతర ఆదర్శ శ్రమదానం మాత్రం కళ్లెదుట జరిగే యధార్ధం.

            ఏదో చిన్న పాటి సమస్యలతో అప్పుడప్పుడూ తప్ప నాలుగేళ్లుగా పాల్గొంటున్నాను. రష్యాలో MBBS చదువుతున్న నా మనుమడు వేమూరి సూర్య తేజ కూడ కుదిరిన ప్రతి రోజూ మా అందరితో బాటు శ్రమించడం నాకు మరీ సంతృప్తి. ఎప్పుడో అరుదుగా మాత్రమే తటస్తించే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయడం నాకు గాని, నా ఉభయ గ్రామస్తులకు గాని తగదని నా హితవు. ఈ ఉద్యమాని కంకితులైన ప్రతి కార్యకర్తకూ పేరుపేరునా ధన్యతలు తెలియజేస్తూ....

- కంఠంనేని రామబ్రహ్మం,

విశ్రాంత పంచాయతీ బిల్లు వసూలు ఉద్యోగి,  

పాగోలు, 21.05.2020.