పాగోలు శివాజి....           26-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 23

స్వచ్చ సుందర చల్లపల్లి తయారీలో 2000 రోజుల అసమాన కృషి.

            మాది పాగోలు. సుమారు 1400 రోజుల నుండి నేను చల్లపల్లి ఉద్యమాన్ని దగ్గరగా గమనిస్తున్నాను. నేను టీచర్ గా పనిచేస్తున్నది మొవ్వలో. మొవ్వే కాదు, సగం పైగా జిల్లాలో నాలాగే చాల మందికి చల్లపల్లి సేవా కార్యక్రమం తొలి 100 రోజుల్లోనే తెలిసిపోయింది. ఈ ఐదారేళ్లలో చల్లపల్లి 25 వేల మందికీ, బైట నుండి వచ్చే 10 వేల మందికీ రెండు చోట్ల స్వచ్చ – సుందర టాయిలెట్లూ, సకల సౌకర్య పరిపూర్ణమైన NTR పార్కు, ఎంతసేపైనా కూర్చొని వేచియుండ గలిగే బస్ స్టాండు, ఎక్కడికక్కడ రహదారి వనాలూ, నీడనిచ్చే చెట్లూ, అందాన్ని పెంచే అన్ని రకాల పూల మొక్కలు, ఇంటింటి చెత్త కలెక్షన్ల ట్రాక్టర్ లు, అన్నిటినీ మించి అధిక శాతం గ్రామస్తుల్లో పెరిగిన స్వచ్చ – శుభ్ర – ఆరోగ్య స్పృహ – ఇలా ఒకటేమిటి? గమనించగలిగిన వారికి బోలెడంత మార్పు కనిపిస్తూనే ఉన్నది..

            వీటన్నిటికీ మూల కారకులైన డాక్టర్ డి.ఆర్. కె గారికీ, డాక్టరమ్మ గారికీ, ఎండ – వాన – చలి – మంచుల్లో ఇలా నిత్యం శ్రమిస్తున్న పుణ్యాత్ములకీ చల్లపల్లి, పాగోలు గ్రామాలు ఎంత ఋణపడుతున్నాయో గదా! మా పాగోలు లో ఒక పెద్దాయనున్నారు – కంఠంనేని రామబ్రహ్మం గారు. ఆయనా ఇంతే – పాగోలు రోడ్లు, శ్మశానం – ఇళ్ల పరిసరాలు బాగుండాలని ఒకే తపన! ఆయన పెద్ద ప్రయత్నంతో – 1300 రోజుల క్రిందట పాగోలు నుండి 20 మందిమి నడుం బిగించి కదలగా మొదలైన “స్వచ్చ పాగోలు” పనిలో ముందుగా చల్లపల్లి రోడ్డు మీదే దృష్టి పెట్టాం – చల్లపల్లి డాక్టరు గారి చొరవతో ఆ స్వచ్చ కార్యకర్తలు కూడ కలిసి, గ్రామ ముఖద్వార రహదారిని ఎంత బాగుచేశామంటే – ఆ తర్వాత ఇతర ప్రాంతాల నుండి వచ్చిన మావూరి వాళ్ళు ఆశ్చర్యపోయారు!

            ఇప్పటికీ శలవులలో మాత్రం కొందరం శ్రమదానం చేస్తూ ఉన్నాం. గత వారం రోజులుగా చల్లపల్లి స్వచ్చ సైన్యంతో కలిసి – మా ప్రధాన రహదారిని బాగుచేయడంలో 10 మందిమి శ్రమిస్తున్నాం.

            2000 రోజులుగా చల్లపల్లి స్వచ్చ సైనికుల సహనం, పట్టుదల, నమ్మిన ఆదర్శానికి అంకితులైపోవడం వంటి గొప్ప లక్షణాల వల్లే ఈ శ్రమదాన ఉద్యమం ఇలా కనీ వినీ ఎరుగనట్లు విజయవంతమైనదని భావిస్తూ –

- పాగోలు స్వచ్చ కార్యకర్తల తరపున

   పాగోలు శివాజి.

   20.05.2020.