బొందలపాటి నాగేశ్వరరావు....           30-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 27

నాకు బాగా నచ్చిన - చల్లపల్లికి బాగా ఉపయోగపడిన – 2000 రోజుల స్వచ్చ ఉద్యమం 

        భూమ్మీద అన్ని రకాల మనుషులూ ఉన్నారు గానండి – దొంగలూ, మాయగాళ్ళు, ఒట్టొట్టి కబుర్లు తియ్యగా చెప్పేవాళ్ళు – ఇట్లా ఎందరో ఉన్నా – ఈ చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల్లాంటి వాళ్ళు మాత్రం ఉండరండి. అసలు సొంతానికే మీ ఆశ పెట్టుకోకుండా – ఊరి కోసం 2025 రోజుల్నుండి కష్టపడ్డవాళ్ళనెక్కడైనా చూశారేమో చెప్పండి. ఈ కాలం ఎట్లా ఉందో చెప్పండి – అడుగు తీసి అడుగేస్తే మోసాలు, కుట్రలూ – ఎవడి మాట నమ్మాలో తెలీదు గాని – ఈ కార్యకర్తల శ్రమందానంలో మాత్రం ఏకల్తీ లేదండి – కులాలు, మతాలు , ఊళ్ళో డొక్కు రాజకీయాలు, బురిడీలు – అవేమీ ఇక్కడుండవు. ఊరి మంచి కోసం ఎవరికి చాతనైనంత వాళ్ళు శ్రమించడం, చందాలివ్వడం, ఒకళ్ళకొకళ్ళు అండగా ఉండడం, ఊళ్ళో ఇంకా ఎక్కడ ఏ ప్రయత్నం చేస్తే ఊరు బాగుపడుతుందో చర్చించుకోవడం – ఇదండి ఇక్కడ యవ్వారం! మరి, అలాంటప్పుడు – ఎవరికీ కీడు తలపెట్టని – కాస్త మంచి మనసులున్నోళ్ళ ఉద్యమానికి గుర్తింపులు, అవార్డులు రాకుండా ఉంటాయా? అవి వచ్చినా – రాకపోయినా – ఈ స్వచ్చ సైన్యం మాత్రం తమ పని మాననేమానదని నాకర్ధమైంది! పేరు కోసం పనిచేసే వాళ్లైతే ఇది ఎప్పుడో మూలన పడేది!

            ఇంతకీ నా పేరు బొందలపాటి నాగేశ్వరరావు – ఊరు దాలిపర్రు. రామానగరం లో ఉంటాను. దాలిపర్రులో నా సొంత భూమితో పాటు కౌలుగానూ వ్యవసాయం చేస్తుంటాను. నాదొక మంచి రికార్డున్నది. అదేమంటే 32 ఏళ్ల  నాడు – నా ఐదారేళ్ళ వయసులో – నేనిప్పుడెంతో అభిమానించే DRK ప్రసాదు గారికి చల్లపల్లి లో మొట్టమొదటి పేషెంటునట! అదొక అదృష్టమనుకొంటే – ఇప్పుడు ఇంత మంచి ఉద్యమంలో ఆ డాక్టరు గారితోనే పది మందికీ పనికొచ్చే ఈ శ్రమదాన కార్యక్రమంలో పనిచేయడం ఇంకా పెద్ద అదృష్టం సుమా! నా చిన్నప్పుడే – జనవిజ్ఞానవేదిక వాళ్ళు ప్రజల పొరపాటు నమ్మకాలను పోగొట్టడానికి కళ్ల గంతలతో బళ్ళు నడపడమూ, నిప్పుల మీద నడవడమూ చూస్తూమేల్కొన్నాను. ఆ సంస్థ 18 ఏళ్ల నుండి నడిపే వైద్య శిబిరాలలో కార్యకర్తగా నేనూ – నా భార్య రాజ్యలక్ష్మి  పనిచేస్తుంటాము. (ఒకసారి నేను జాగ్రత్తపడి దాచుకొన్న 5,000/- (వైద్య శిబిరానికి చందా ఇచ్చి ఆనందించాను!)

            మొన్న రామారావు మాస్టారు “2000 రోజుల ఈ ఉద్యమానికి నీవిచ్చే సూచన లేమిటి?” అని అడిగారండి. సలహాలిచ్చేంత పెద్దోడినా? కాని, నాకొక కోరిక మాత్రం ఉన్నది: స్వచ్చ సైన్యం చల్లపల్లిని బాగా మార్చేసింది గదా, ఇక వారానికొకటి రెండు రోజులు దగ్గర్లోని – ఉదాహరణకు దాలిపర్రు లాంటి మా ఊరికి పోయి, అక్కడ కూడ ఇలా కొందర్ని ప్రోత్సహించి, తయారు చేస్తే ఆ వూళ్ళు కూడ శుభ్రంగా – పచ్చగా కళకళలాడతాయని.

            ఈ పాగోలు రోడ్డు గత 15 రోజుల్లో మన కృషితో ఇంత చక్కగా మారిపోయిం తర్వాత – ఈ స్వచ్చ సుందర ఉద్యమంలో నుండి – మరీ వ్యవసాయంలో మునిగిన రోజు తప్ప నేనెందుకు మానతానండి? మన ఒంట్లో శక్తి ఉండేదాక ఇలాంటి మంచి పనిలో, మంచి వాళ్ళతో కలిసి నడుస్తుంటే మన ఒంటికి, మనసుకి మంచిదేగదండి?   

- బొందలపాటి నాగేశ్వరరావు,

రామానగరం – 26. 05. 2020.