వేమూరి అర్జునరావు....           15-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -  

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 40

 

అందరికోసం కొందరి ఉద్యమం - 2040 దినాలుగా మన చల్లపల్లిలో!

 

            చల్లపల్లి గ్రామం కోసం కొంతమంది గ్రామస్తులు చేస్తున్న ఈ వేలాది రోజుల స్వచ్చ - సుందర ఉద్యమంలో- తొలినాటి నుండి భాగస్వామినైనందుకు సంతోషిస్తున్న వాళ్లలో నేనూ ఒకడిని. జీవితంలో ఎన్నో సామాజిక- రాజకీయ ఉద్యమాలు చూశాను గాని, అవన్నీ ఒక ఎత్తు, ఒక్క రోజైనా ఆగక- తమ ప్రయోజనం కోసం కాక – ఊరి శ్రేయస్సు కోసం స్వచ్చందంగా ఇందరు ఇంత సుదీర్ఘ కాలం కృషి చేసిన ఉద్యమం మాత్రం ఇదే!

 

            ఘంటశాలపాలెం గ్రామస్తుడినీ, పాతికేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుడినీ, తదాదిగా రామానగర నివాసినీ, వ్యవసాయమంటే బాగా నచ్చినవాడినీ, మంచి కోసం బయలుదేరే ఇలాంటి ఉద్యమం అంటే  పూర్తిగా ఇష్టపడేవాడినీ ఐన వేమూరి అర్జున రావు నామధేయుడిని. చల్లపల్లి స్వచ్చోద్యమ కారుల్లో సగం మంది నా పిల్లల కంటే చిన్నవాళ్లు. కనీసం నాలుగేళ్లైనా నికరంగా దినదిన శుభోదయ స్వచ్చంద శ్రమదాతని! ఇప్పుడు వయసు మీరడం వల్ల కొంతా, అర్థాంగి శకుంతలమ్మ గారి ఆరోగ్య పరిస్తితి వల్ల మరి కొంతా, మేనకోడలు అనబడే కూతురు- డాక్టర్ విజయలక్ష్మి ఒత్తిడి వల్ల ఎక్కువగాను, ఇటీవల చల్లపల్లికి దూరంగా దావణగెరె స్మార్ట్ సిటీ లో ఉంటున్నాను. అసలు నా ఆలోచన, ప్రాణం చల్లపల్లి స్వచ్చోద్యమం దగ్గరే ఉంటాయి. అందుకే ఉదయం 6.00 కు ఫోనులో-మిమ్మల్ని “ హలో” అని కాక- “ జై స్వచ్చ సుందర చల్లపల్లి “ అనే పలకరిస్తుంటాను. లోలోపల మాత్రం మీ అందరికీ- మీ స్వచ్చోద్యమానికీ నిత్య నీరాజనాలు సమర్పిస్తుంటాను! ఎప్పుడు చల్లపల్లి కి నేను రావటం జరిగినా- ఉషోదయత్పూర్వమే నేను మిమ్మల్ని కలవడం తప్పదు!

 

            నా స్వచ్చోద్యమ చల్లపల్లి అనుభవాలను- ఒడలు పులకించే జ్ఞాపకాలను చెప్పాలనుకొంటే- అదొక పెద్ద గ్రంథమౌతుంది!

 

“అన్నా-బావా- తమ్ముడూ-మామా-అల్లుడూ... లాంటి పిలుపుల ఆప్యాయతలూ’, చల్లపల్లి నా కోసం కాదు-నేను చల్లపల్లికి ఏం చేయాలి” అని పోటీపడి ఆలోచించే కార్యకర్తలూ, డాక్టర్ డి.ఆర్.కె. ప్రసాదు వంటి అభ్యుదయ వాదులూ... ఇందులో నేను ఏవి మరువగలను? 80 ఏళ్ల వయసున్న నన్ను “వాటర్ బోయ్” అని పిలిచిన వాళ్లనూ, స్వచ్చ-సుందర చల్లపల్లి కోసం శ్రమిస్తున్న పద్మావతి తదితర మహిళామతల్లుల్ని స్మరిస్తూనే ఉంటాను, ఈ ఆడపిల్లల సాహస పూర్వక శ్రమదానాలకు ఆశ్చర్యపోతూనే ఉంటాను.

 

            రాజకీయాలు వస్తుంటాయి-పోతుంటాయి. కులమత భేదాలు మాత్రం కొంపలు ముంచుతాయి గూడ! నా కోసం అనేది వదలి మనకోసం మనం అనుకొని స్వస్త చిత్తంతో నిలబడిన స్వచ్చ-సుందర-చల్లపల్లి ఉద్యమం మాత్రం శాశ్వత స్థాయిగా ఉండగలదని నమ్ముతాను!  ఇప్పుడు నాకెంత- కేవలం 82 ఏళ్లే!  అంటే- (8+2) పదేళ్లే! ఇంకొక 16 రోజుల్లో నాకు పదకొండో ఏడువస్తుంది. అప్పుడు మీకు నా ఆశీస్సులతో బాటు చక్కని ఉపాహారం కూడ అందించాలనే ఉత్సాహంతో ఆలోచిస్తూ....

 

ఓం జయ జయ సాయి - అర్జునరావు బాబాయి..

  దావణగెరె - కర్ణాటక.  (14.06.2020)