కొత్తపల్లి (లవ్లీ) వేంకటేశ్వరరావు,....           20-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 44

 

చల్లపల్లి స్వచ్చ ఉద్యమం కొందరిదే గాని - ఉపయోగం అందరికీ....

 

ఒక్క రైతు వానకు తడిసి, ఎండలో ఎండి, చెమటలు కార్చి పొలంలో పంటలు పండిస్తాడు - అవి వేలమంది కడుపులు నింపుతాయి. ఒక్క పంతులు గారు తరగతిలో చదువులు చెప్తాడు- వందల మంది పిల్లల్లో తెలివి తేటలు, చైతన్యం వస్తుంది. ఒక్క సంస్కర్త తన కాలపు అవకతవకల మీద పోరాడతాడు- వాళ్లు అతన్ని అనుసరించినా, వ్యతిరేకించినా సరే- లక్షల మంది ఆ ప్రయోజనం పొందుతారు. ఈ స్వచ్చ చల్లపల్లి ఉద్యమం కూడ అలాగే కనిపిస్తున్నది మరి!

 

            గాంధీ గారు ఏనాడో కన్నకలను మన ప్రభుత్వాలు 5 ఏళ్ల క్రిందట గుర్తు చేస్తే - చల్లపల్లి DRK ప్రసాదు గారు, జన విజ్ఞాన వేదిక వాళ్లు అంతకన్న ముందే ఇందుకు రెడీగా ఉంటే - 2014 లో ప్రారంభమైన ఉద్యమం - ప్రభుత్వాలు, ఇతర స్వచ్చంద సంస్థలు కొద్ది రోజులకే దాన్ని మరచిపోయినా - 2047 రోజులుగా నిర్విఘ్నంగాను, ఎంతో ఉత్తేజకరంగాను నడుస్తుండడమే ఒక వింత! వేకువ 4.00 కె మొదలై 30 – 40 - 50 మంది ప్రతి రోజూ 2 గంటలు శ్రమించడాన్ని కంటితో చూడని వాళ్లేమో నమ్మరు. చూస్తున్న వాళ్లు మొదట్లో ఏవేవో అపవాదులు వేశారు గాని, అవన్నీ దూది పింజల్లా కొట్టుకుపోయి, నిజం నిలిచి, గెలిచింది. ఉడుకుమోతు తనం కాకపోతే - ఊరు ఊరంతటి మేలు కోసం నిస్వార్థంగా జరిగే ఈ కార్యక్రమంలో అసలు తప్పు పట్టడానికేముందని?

 

            నేను శివరామపురం గ్రామస్తుడిని. 64 ఏళ్ల వయసు వాడిని. కోసూరివారిపాలెం కోపరేటివ్ సొసైటీ సెక్రటరీ గా పని చేసి, రిటైర్ అయ్యి, ప్రస్తుతం నా ఊళ్లో విజయ డైరీలో చిన్నపాటి వ్యాపకం ఉన్నవాడిని. చల్లపల్లి లో రోజూ తెల్లారక ముందే కొందరు రోడ్డు ఊడ్చి, మురుగు కాలవలు బాగు చేసి, చెట్లు నాటి, పూల మొక్కలు పెంచి, శ్మశానాలు - బస్ స్టాండు వంటివి సుందరీకరించి, చాలా చాలా చేస్తున్నారని విన్నాసరే, 400 రోజుల దాకా ప్రవేశించలేదు గాని, మా ఊరి రోడ్డును 3 కిలో మీటర్ల దూరం నుండి వచ్చి - చల్లపల్లి కార్యకర్తలు శుభ్రం చేస్తున్న రోజున మాత్రం శివరామపురం వాళ్లం పది-పన్నెండు మందిమి వాళ్లలో కలిసిపోయాం.

 

            మావూరి చెరువును అందరం కలిసి-శ్రమించి బ్రహ్మాండంగా సుందరీకరించాం - ఒక్కసారి కాదు నాలుగైదు మార్లు - 30 - 40 రోజుల పాటు-మా శివరామపురంలో మంచి సందడి.

 

            6.00 కి డైరీ బాధ్యత ఉండటం వల్ల - అప్పుడప్పుడూ దూర స్థలాలలో జరిగే ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయినా - ఏ మాత్రం అవకాశం దొరికినా వెళుతూనే ఉన్నాను. ఎందుకు మానాలి? రోజంతా మనకోసం బ్రతికినా - ఒక్క గంట ఊరి బాగు కోసం- ఇంతమంది, ఇంత మంచి కార్యకర్తలతో కలిసి కష్టపడితే - ఆరోగ్యానికి ఆరోగ్యం, మనస్తృప్తికి అవకాశం, ఆనందానికానందం!

           

కనుక - 2000 రోజులే కాదు, మరి రెండువేల దినాలైనా ఈ స్వచ్చంద శ్రమదాన ఉద్యమం ఆగకూడదనే నా

అభిప్రాయం! ఇకపై నేను మరింత నిబద్ధతతో ఈ స్వచ్చోద్యమానికి కట్టుబడి ఉండాలని కూడ నా నిశ్చయం.

 

- కొత్తపల్లి (లవ్లీ) వేంకటేశ్వర రావు,

   శివరామపురం-20.06.2020.